చండీ హోమం ప్రాముక్యత

శ్రీ చండీ సప్తశతీ పూజాహోమ సంక్షిప్త పరిచయము :- ప్రాతఃకాలము మేలుకొని స్నానసంధ్యలు చేసి భక్తిశ్రద్ధలతో సకుటుంబ బంధు సపరివార సమేతము భగవతీ జగన్మాతను, సద్గురుమూర్తిని, మహర్షులను, పెద్దలను, మాతాపితరులను, సజ్జనులను, విద్వజ్జనులను మనసారా నమస్కరించి పూజకు ఉపక్రమించవలెను.
పూజా హోమస్థలము గోమయముతో లేదా జలముతో శుభ్రపరచి రంగవల్లి ముగ్గును రంగరించి, మంగళ వాయిద్యములతో ఋత్విక్ పురోహితుల యజమాని దంపతులతో పూజా మంటపములో ప్రవేశించ వలయును. ప్రప్రథమముగా స్వస్తివాచన ప్రార్థన పవిత్రజల సంప్రోక్షణ చేసి తదనంతరం అఖండ దీపస్థాపన, గణపతి పూజ పుణ్యాహవాచనం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసనం, ఋత్విగ్వరణం, ప్రధాన కలశ స్థాపన, ప్రధాన కలశములో మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతావాహన, నవగ్రహ అష్టదిక్పాలక స్థాపన పూజ సర్వతోభద్రమండల స్థాపన పూజ యోగినీ దేవతాస్థాపన, సద్గురు కలశ స్థాపన మొదలైన దేవతలను స్థాపించి ఆ స్థాపిత దేవతలకు శోడషోపచార పూజ చేయుట.
శ్రీచక్ర సహిత మహాదేవికి పంచామృత అభిషేకం, ద్వాదశ ద్రవ్య స్నానం నవావరణ పూజ సహస్రనామార్చన, అష్టోత్తర పూజ తదనంతరం సప్తశతీ పారాయణ, నవావరణ మంత్ర జపం లేదా దేవీమంత్ర జపం తదనంతరం తర్పణం (తర్పణం చేసినపుడు పాలు, తేనె, నీళ్ళు కలిపి చేయవలయును). తర్పణ మంత్రం "ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే తర్పయామి" అని చెప్పుచూ పాలు, తేనె కలిపిన ద్రవ్యమును ఒక పల్లెములో విడువవలెను. తదనంతరం చండీ హోమము ప్రారంభించ వలయును. ప్రథమముగా షట్ పాత్ర ప్రయోగము లేదా లఘు షట్ పాత్ర ప్రయోగము చేసి ముందు గణపతి హవనము, నవగ్రహ దిక్పాలక హవనము, సర్వతోభద్ర హవనము, యోగినీ దేవతా హవనము, బ్రహ్మాది హవనము, అనంతరం దుర్గాసప్తశతితో హవనము (సప్తశతితో అనగా 13 అధ్యాయములు హవనము చేసినపుడు వాటికి విధించిన ద్రవ్యములతో చేయవలెను. నవావరణ మంత్ర హవనం సూక్తములతో శ్రీ సూక్తాదులతో హవనము శక్తిఉన్నదో రుద్రము కూడా చెప్పవచ్చును.
అనంతరం జయాదిహోమం, బలిప్రదానం అనగా (మంచి గుమ్మడి కాయను శోడషోపచార పూజ జరిపి దానిని కోసినపుడు ఒక తెరను అడ్డుగా పెట్టి గుమ్మడికాయను రెండు భాగములుగా చేసి ఒక భాగము అమ్మవారి దగ్గర ఉంచి రెండవ భాగము 8 ముక్కలుగా చేసి హోమ కుండమునకు ఎనిమిది వైపులా పెట్టి వాటిపై కుంకుమ పసుపు చల్లి కర్పూరము ఉంచి వెలిగించవలెను. అనంతరము యజమాని పూజారులు, కాళ్ళూ చేతులు ప్రక్షాళన చేసుకొని అష్టదిక్పాలక నవగ్రహములకు మాషభక్త దధి బలిని సమర్పించి హస్త, పాద ప్రక్షాలన జరిపి పూర్ణాహుతి చేయవలయును. అనంతరం అవభృతస్నానం, కుమారీపూజ, దంపతపూజ, కలశ సంప్రోక్షణ, మహదాశీర్వాదం, పురోహిత బ్రాహ్మణ దక్షిణ, సాధుసత్పురుష సత్కారం, తీర్థ ప్రసాద వితరణ, శాంతిమంత్ర పఠన, మంగళవాయిద్య ఘోష, శక్తిననుసరించి అన్నదానం ఇతి ప్రకారేణ ఈ విధముగా చండీ సంక్షిప్త పూజా హోమ వివరణ సమాప్తా.