శ్రీ నాగ దేవత అమ్మవారు

kottiyoor devaswom

నాగదేవత : -    భూమి లోపలిభాగంలో ఉండే పాతాళలోకాన్నే నాగలోకం అని పిలుస్తారు. ఆ లోకంలో ఉండే సమస్త నాగజాతికి తల్లిగా నాగేశ్వరిని గుర్తిస్తారు. ఈమెకే మానసాదేవి అని, విషహారి అని పేర్లు ఉన్నాయి. విషాన్ని హరిస్తుంది కనుక ఈమె విషహరి అని పిలువబడుతుంది. ఈ మానసాదేవి కొన్నిసర్పాలను తన ఆభరణములుగా ధరిస్తుంది. ఆమె శిరస్సుపై ఉండే కిరీటంపైన కొన్ని సర్పాలు పడక ఎత్తి కనిపిస్తాయి. ఒక తెల్లటి హంస ఈమెకు వాహనంగా ఉంటుంది. పశ్చిమబెంగాల్లోని కొన్ని వెనుకబడిన కులాలవారు ఈ విషహారిని తమ కులదైవంగా కొలుస్తారు. ఈ కులాల ప్రధాన వృత్తి పాముల్ని పట్టటం. నాగులకు ఈశ్వరి అనగా అధిపతి కనుక ఈమెకు నాగేశ్వరి అన్నపేరుకూడా ఉన్నది. ఒకప్పుడు ఈ భూమిమీద ఉండే భయంకరమైన విషసర్పాలు తరచుగా మానవుల్ని కాటువేస్తూ చంపుతూ ఉండేవి. ఈ పరిస్థితుల్లో కస్యపప్రజాపతి మానవుల్ని రక్షించటంకోసం మరియు తమ ఇష్టంవచ్చినట్లు ప్రవర్తిస్తున్న సర్పాలను నియంత్రించడంకోసం ఒక మహాశక్తిని తన మనస్సు నుండి సృష్టించాడు. కస్యపప్రజాపతి మనస్సునుండి పుట్టినది కనుక ఆమెకు మానసాదేవి అన్నపేరు వచ్చింది. భారతదేశంలో ముఖ్యంగా పశ్చిమ మరియు ఉత్తర భారతదేశాలలో మానసాదేవిని అధికంగా పూజిస్తారు. దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్యస్వామిని ఎక్కువగా పూజిస్తారు. మానసాదేవిని అత్యధికంగా పూజించే బెంగాల్ రాష్ట్రంలో నాగపంచమి రోజున సజీవమైన త్రాచుపాముల్ని పూజిస్తారు. ముఖ్యంగా నాగపంచమి రోజున హైందవ స్త్రీలు తమకు అందుబాటులో ఉన్న పాము పుట్టల దగ్గరకువెళ్లి ఆ పుట్టలకు పసుపు, కుంకుమ అద్ది, ఆపై ఎర్రటి పూలతో ఆ పుట్టలకు పూజలుచేసి, ఆపై ఆ పుట్టలవద్ద చలిమిడి మరియు బెల్లము మరియు నువ్వులు కలిపి తయారుచేసిన చిమ్మిలిని నైవేద్యంగా ఉంచుతారు పూజ చివరలో పుట్టలో ఉండే నాగమయ్యకు అనగా సర్పాలకి పైనుండి పాలుపోస్తారు. సర్పాలు పాలు తాగవని, అసలు ఏ ద్రవపదార్థాలను త్రాగవని ఆధునికులు వాదిస్తున్నారు. అయితే నాగపంచమి సమయంలో పాతాళలోకం నుండి కొన్ని నగశక్తులు అదృశ్యరూపంలో పాము పుట్టల అడుగు భాగంలోకి వచ్చి చేరుతాయి. ఆ అదృశ్య నాగశక్తులే భక్తులు పోసేపాలను పుట్ట అడుగున ఉండి తాగుతాయి. ఈ విషయం గ్రహించని నాస్తికులు పుట్టలో పాలుపోసేవాళ్ళని హేళన చేయ్యడం జరుగుతున్నది. భారతదేశ పశ్చిమతీరంలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న గోవాలో విభిన్న జాతులకు చెందిన సర్పాలు సంచరిస్తూ ఉంటాయి. వాటిలో చాలా కొద్ది జాతులుమాత్రమే విషపూరితమైనవి ఉంటాయి. అయితే గోవాలో మానవ నివాసాలకు దగ్గరగా ఉంటూ మరణాలకు కారణమవుతున్న నాలుగు రకాల సర్పాలను 'బిగ్ ఫోర్’ అని పిలుస్తున్నారు. త్రాచుపాము, కట్లపాము, రక్తపింజరి, మొప్పలపాము అనే నాలుగు ప్రధాన రకాలు అక్కడ మానవులకు ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. గోవా రాష్ట్రంలోని సత్తారి తాలూకాలో ఉన్న కపర్దే అనే గ్రామంలో సర్పాలను రెండు చేతులతో పట్టుకున్న మానసాదేవిని పూజిస్తారు. అక్కడ ఈమెకు “బ్రాహ్మిమాయ” అని పేరు ఉన్నది. ఈ ఆలయం బయట ఉన్న పుష్కరిణిలోని జలం త్రాగినట్లయితే పాముకాట్లవల్ల కలిగే ప్రమాదం తప్పిపోతుందని ఇక్కడ ప్రజలు విశ్వసిస్తారు.

శ్రీ నాగదేవత అమ్మవారికి : -    నాగదేవత, రాహు కేతువులు, జంట నాగులకు ప్రతీ మంగళవారము పంచామృత అభిషేకము, శాంతి పూజలు, కాలసర్పదోష పూజలు జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.

నాగ శాపం-సర్పదోష ప్రభావాలు ఎలా ఉంటాయి? : -    మానవుడు తన అవసరాలకోసం సర్పాలకు నివాసాలుగా ఉన్న అనేక పంట పొలాలను తొలగించి ఇళ్ళ స్థలాలుగా కర్మాగారాలు నిర్మించే ప్రదేశాలుగా మారుస్తున్నాడు. అలా చెయ్యడం వల్ల సర్పాలకు నివసించే ప్రదేశంలేక క్రమంగా నశించిపోతాయి. ఇలా సర్పాలకు నివాసం లేకుండా చేసిన వారికి తప్పనిసరిగా సర్పశాపం తగులుతుంది. హైందవ శాస్త్రాల అభిప్రాయం ప్రకారం భూమిని ఆదిశేషుడు అనే ఒక మహాసర్పం మోస్తూ ఉంటుందని అలాంటి భూమిని తవ్వటం వల్ల ఆదిశేషునికి బాధకలిగి భూమిని గాయపరిచిన వారిని శపిస్తాడని ఫలితంగా భూమిని బాధించిన వారికి సర్పశాపం తగులుతుందని చెప్పబడింది. ఆ కారణంగానే హైందవులు భూమిని తవ్వేటప్పుడు కాని, దున్నేటప్పుడుకాని ముందుగా భూమాతను పూజించి ఆమెను గాయపరుస్తున్నందుకు క్షమాపణ కొరతారు. అప్పుడు వారికి భూమాత శాపంకాని, సర్పశాపంకాని తగలదు.
కర్కాటకరాశిలో భాగంగా ఉండే ఆశ్లేషా నక్షత్రానికి అధిపతి ఒక సర్పం. కనుక ఆశ్లేషా నక్షత్రం జరుగుతున్న సమయంలో సర్ప సంబంధ తాంత్రిక విద్యలను సాధనచేస్తే మంచి ఫలితాలు ఉంటాయని మంత్రశాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
చాలామంది భావించినట్లుగా కాలసర్పదోషం మరియు నాగదోషం ఒకటి కాదు. ఒకవ్యక్తి జాతకచక్రంలో లగ్నం నుండి 5వ స్థానంలో రాహువు లేదా కేతువు ఉన్నట్లయితే అది నాగదోషంగా గుర్తించాలి. అలాంటి దోషం కలిగిన వారిని పిల్లలు పుట్టరు ఒకవేళ పుట్టినా బ్రతకరు. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే నాగదోషం అన్నా, సర్పదోషం అన్నా ఒకటే అని గ్రహించాలి. ఈ దోషం ఉన్నవారు నాగపూజ చేయటంద్వారాకాని, నాగప్రతిష్ట చేయటంద్వారా కాని ఈ దోషాన్ని తొలగించుకోవచ్చు. ఈ దోషనివారణ ప్రక్రియను చేసుకున్న తరువాత బ్రాహ్మణులకు భూదానంకాని, తిలాదానంకాని, సువర్ణదానంకాని చేస్తే ఫలితాలు అమోఘంగా ఉంటాయి. నాగదోషం ఉన్నవ్యక్తులు చెప్పటానికి వీలుకాని అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉండటమే కాకుండా సంతానంకూడా లేని దుస్థితినికూడా పొందడం జరుగుతుంది.

నాగశాపం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? : -    సర్పానికి తలలో మాత్రమే విషం ఉంటుంది. కానీ దుర్మార్గుడైన మనిషికి వళ్ళంతా విషమే ఉంటుంది. సర్పం తనకి అపకారం జరుగుతుంది అనుకున్నపుడే మనిషిపైన దాడిచేస్తుంది. కానీ మనిషి అకారణంగా సర్పాన్ని చంపుతాడు. తనకు అపకారం చేస్తుందేమో అన్న అనుమానంతోను లేదా ఆ సర్పాన్ని చంపి దాన్ని సొమ్ముచేసుకోవాలి అన్న ఉద్దేశ్యంతోను మనిషి సర్పాలను చంపుతూ ఉంటాడు. సర్పాలలో దేవతా సర్పాలుకూడా ఉంటాయి అన్న విషయం చాలామందికి తెలియదు. 25 సంవత్సరాలు దాటిన ఆడ మరియు మగ త్రాచుపాములు దేవతా సర్పాలుగా మారతాయి. ఆ తరువాత అవి మానవులకు దూరంగా ఏకాంత ప్రదేశాలలో జీవించటం ప్రారంభిస్తాయి. అలాంటి దేవతా సర్పాలను అకారణంగా చంపినవాళ్ళకి ఎంత భయంకరమైన శిక్ష పడుతుందో నిరూపించే ఒక సంఘటన గురించి ఇక్కడ క్లుప్తంగా తెలియజేస్తాను.

సుమారు 7 సంవత్సరాల క్రితం విజయవాడ గుణదల ప్రాంతంలో కూలి పనులుచేస్తూ పొట్టనింపుకునే జకరయ్య అనే ఒక వ్యక్తి ఒకసారి అనుకోకుండా కర్నూలు వెళ్ళటం జరిగింది. అక్కడ అతనికి సుధాకర్ అనే వ్యక్తితో స్నేహం కలిసింది. సుధాకర్ కర్నాటక రాష్ట్రంలోని గంగావతి ప్రాంతానికి చెందినవాడు అతడికి పూర్వీకులు ఇచ్చిన ఆస్తి ఉండటంతో ఏ ఉద్యోగమో, వ్యాపారమో చేయవలసిన పనిలేకుండా పోవటంతో అతడు ప్రాచీనకాలంనాటి వస్తువులను, మహత్యాలుగల యంత్రాలను, నాగమణులను సేకరించే హాబీని అలవరుచు కున్నాడు. కూలిపనికోసం కర్నూలుకు వచ్చిన జకరయ్యకు ఒక బార్ లో సుధాకర్ కలిసాడు. మాటల సందర్భంలో సుధాకర్ ఆత్మకూరు - డోర్నాల ఘాట్ రోడ్డులో ఉండే మామిడితోటలలో అక్కడక్కడ పురాతన కాలానికి చెందిన కొన్ని పాము పుట్టలు ఉన్నాయని వాటిలో 30, 40 సంవత్సరాలు వయస్సుదాటిన దేవతా సర్పాలు ఉన్నాయని, వాటి తలపై నాగమణులు ఉంటాయని వాటిని సేకరించి ఎవరికైనా అమ్ముకుంటే లక్షల రూపాయలు కులాసాగా సంపాదించుకోవచ్చని జకరయ్యకు రసవత్తరంగా చెప్పాడు. ఎంతకాలం కూలిచేసినా

సొంతగుడిసె కూడాలేని తను నాగమణిని సంపాదిస్తే మంచిమేడ కట్టుకోవచ్చు అని ఆశపడ్డ జకరయ్య సుధాకర్‌తో కలిసి నాగమణిని సంపాదించటానికి సిద్ధపడ్డాడు. ఆ తరువాత కొద్ది నెలలకి సుధాకర్ గుంటూరు వెళ్లి అక్కడకి రమ్మని విజయవాడలో ఉన్న జకరయ్యకు ఫోన్ చేసాడు. జకరయ్య గుంటూరు రాగానే సుధాకర్ అతడిని తీసుకుని ఒక బైకుమీద డోర్నాల ఘాట్ రోడ్డుకి ప్రయాణం ప్రారంభించాడు. ముందుగా గుంటూరు నుండి నరసరావు పేట జేరుకుని అక్కడ నుండి వినుకొండ మీదగా డోర్నాల్ చేరుకున్నాడు. డోర్నాల దగ్గరనుండి ఘాట్ రోడ్ 25 కి.మీ. పొడవు ఉంటుంది. ఘాట్ రోడ్ దాటగానే ఆత్మకూరు అనే చిన్న పట్టణం లాంటి గ్రామం వస్తుంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి డోర్నాల ఘాట్ రోడ్ కి చేరుకున్న సుధాకర్ మరియు జకరయ్యలు ప్రయాణిస్తున్న మోటారు బైక్ ఒక గంటలో ఘాట్ రోడ్ లో సగందూరం వచ్చేసింది. ఘాట్ రోడ్లో ఒకచోట రోడుకి ప్రక్కగా బైక్ ని ఆపి అక్కడ ఉన్న మామిడి చెట్లలోకి నడిచారు ఆ ఇద్దరూ. అలా వెళ్ళినవారికి ఒక మామిడిచెట్టుక్రింద పెద్ద పాముపుట్ట కనిపించింది. ఏ పుట్టలో నాగమణి ఉండే పాము ఉంటుందో తెలుసుకునే శక్తి జకరయ్యకు ఉన్నది. నాగమణి తలపై ఉన్నపాము పుట్ట అడుగున ఉండే నేలపై నివసిస్తూ ఉంటుంది. ఆ పుట్ట పైభాగంలో గులాబీరంగుతో కూడిన ఒకరకమైన వెలుగు కనిపిస్తుంది. అలా గులాబిరంగు వెలుగు ఏ పుట్ట పై భాగంలో కనిపిస్తుందో ఆ పుట్ట అడుగున తప్పనిసరిగా నాగమణి ఉన్న త్రాచుపాము ఉన్నట్టుగా గుర్తించాలి.

మన అదృష్టం బాగుండి మనం వచ్చిన వెంటనే నాగమణి ఉన్న పుట్ట మనకి కనపడింది. దీన్ని ఎలాగైనా మనం సొంతంచేసుకోవాలి అని సుధాకర్, జకరయ్యతో అన్నాడు. పుట్టలో చెయ్యి పెట్టి పొడవాటి త్రాచుపాముల్ని పట్టుకుని అవలీలగా బయటకులాగివేసే జకరయ్య నాగమణి కలిగి ఉన్న పాము నివసిస్తున్న పుట్టలోకి చెయ్యిపెట్టటానికి వెనకాడాడు. కారణం నాగమణి ఉన్న పాముని చంపకుండా ఆ నాగమణిని సొంతంచేసుకోవాలి. అలాకాకుండా నాగమణికోసం పామును చంపితే నాగశాపం తగిలి నానాకష్టాలు పడాల్సి వస్తుంది. ఆ విషయాన్నే జకరయ్య సుధాకర్ కి వివరించాడు. సుధాకర్ కరుడుకట్టిన నాస్తికుడు అతడు తరచుగా నాస్తిక సభలకు హాజరు అవుతూ పాములు కేవలము విషకీటకాలని అవి పగపట్టవని, దయ్యాలు, ఆత్మలు లేవని, యజ్ఞాలు చెయ్యటం, పూజలు చెయ్యటం పరమ దండగని ప్రజలకు ప్రభోదిస్తూ ఉంటాడు. (వాళ్ళు అతడు చెప్పిన మాటలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలివేస్తారు అన్నమాట వేరే విషయం) సుధాకర్ వాదనలు విని మైమరచిపోయిన జకరయ్య సర్పాలుకు ఉండే శక్తి విషయం మర్చిపోయి తనచేతికి ఒక మైనపుసంచిని గ్లౌజులాగా చుట్టుకుని పాముపుట్టలో చెయ్యిపెట్టి అటు, ఇటు చెయ్యి కదిలించాడు. అతని చేతికి త్రాచుపాము పడగ దొరికింది. జకరయ్య చాలా ఒడుపుగా త్రాచుపాము పడగను చేత్తోపట్టుకుని శరవేగంతో బయటకు లాగాడు. సుధాకర్ సంభ్రమాశ్చరాలతో ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. జకరయ్య ఆ త్రాచుపామును గాలిలో ఎత్తిపట్టుకుని ఈ త్రాచుపాము వయస్సు దాదాపు 40 ఏళ్ళు ఉంటుందని నా అంచనా. దీని గొంతులో ఖచ్చితంగా నాగమణి ఉండే ఉంటుంది. దీన్ని చంపితేకాని నాగమణి మన సొంతంకాదు అన్నాడు సుధాకరుతో. (దేవతా సర్పాలు రాత్రి సమయాలలో తమ ఆహారమైన ఎలుకల్ని సంపాదించుకోవటం కోసం తమ గొంతులో లేదా తలలో దాచుకుని ఉండే నాగమణిని బయటకు కక్కుతాయి. ఆ నాగమణి నుండి వచ్చే గులాబీరంగు వెలుగునుచూసి చుట్టుప్రక్కల ప్రాంతాలలో సంచరిస్తున్న ఎలుకలు, చుంచులు లాంటి జీవాలు నాగమణి దగ్గరకు వస్తాయి. అపుడు ఆ త్రాచుపాము వాటిని పట్టుకుని గుటుక్కున మింగుతుంది. ఆ తరువాత మరల నాగమణిని మింగి తలలో దాచుకుంటుంది). సుధాకర్ చూపించిన డబ్బు ఆశకు, లొంగిపోయిన జకరయ్య ఆ త్రాచుపామును తన దగ్గరున్న పదునైన చాకుతో తలనుండి తోకవరకు నిలువునా రెండుగా చీల్చివేసాడు. ఎర్రటి త్రాచుపాము రక్తం జకరయ్య చొక్కాను మరియు పంచను తడిపివేసింది. అయినా జకరయ్య ఏమాత్రం చలించక త్రాచుపాము పడగలోపల చాకునుపెట్టి అటు ఇటు కెలికాడు. ఆ త్రాచుపాము మాంసంలో ఇరుక్కుని ఉన్న నాగమణి జకరయ్య చేతికి దొరికింది. దాదాపు సోడా సీసాలలో వేసే గోలీ అంత పరిమాణంలో ఉన్న ఆ నాగమణిని తనచేతిలోకి తీసుకుని తన దగ్గర ఉన్న మినరల్ వాటర్ పోసి ఆ నాగమణికి ఉన్న త్రాచుపాము నెత్తురును కడిగివేసి ఆపై ఆ నాగమణిని ఒక చిన్న పెట్టెలోపెట్టి ఆ పెట్టెను తన పాంటు జేబులో పెట్టుకుని జకరయ్యను విపరీతంగా మెచ్చుకుని ఇక బయలుదేరమన్నాడు. నెత్తురుతో తడిసిపోయిన ఈ బట్టలతో ప్రయాణం చెయ్యటం అంతమంచిదికాదు అని భావించిన జకరయ్య తన ఒంటి మీద ఉన్న చొక్కాను, పంచను విప్పివేసి వాటిని ఉండగాచుట్టి ప్రక్కనే ఉన్న పొదల్లోకి విసిరివేసాడు.

ఆ తరువాత బైకుకు ఉన్న తన సంచిలో నుండి ఇంకొకపంచ, చొక్కా తీసుకుని ధరించాడు. ఆ తరువాత ఇద్దరు కొద్దిగా మద్యం సేవించి సిగరెట్ కాల్చుకుని మళ్ళీ బైక్ ఎక్కారు. సుధాకర్ బైకును డోర్నాలా ఘాట్ రోడ్ మీదగా మరికొద్దిదూరం ప్రయాణంచేసి ఆత్మకూరుకి చేరుకున్నాడు. ఆ తరువాత వాళ్ళిద్దరూ ఆ బైక్ మీదే కర్నూలు పట్టణానికి చేరుకుని అక్కడ ఒక లాడ్జిలో రూం తీసుకుని ఆ రోజు రాత్రికి విశ్రాంతి తీసుకున్నారు. మర్నాటి ఉదయం కర్నాటకకు చెందిన కొందరు రత్న వ్యాపారులు సుధాకర్ దగ్గరకు వచ్చారు. వాళ్ళు మంచి ధర ఇచ్చి నాగమణిని కొనుక్కున్నారు. వాళ్ళుబేరం మాట్లాడుకునే సమయంలో జకరయ్యను బయటకు వెళ్ళమని సుధాకర్ జకరయ్యకు చెప్పాడు. ఆ నాగమణిని ఎంతకి అమ్ముతున్నాడో తెలిసే అవకాశం లేదని జకరయ్యకు అపుడు అర్ధమయ్యింది. ఏది ఏమయినా తాను చేసేదిలేదని అర్ధంచేసుకున్న జకరయ్య లాడ్జి గదిలోంచి బయటకు వచ్చి వరండాలో నుంచున్నాడు. ఆ తరువాత అరగంటకు రత్నవ్యాపారులు నాగమణిని తీసుకుని సుధాకర్ కి పెద్దమొత్తంలో డబ్బులు ముట్టచెప్పి వెళ్ళిపోయారు. సుధాకర్ ఒక్క లక్షరూపాయలు జకరయ్యకు ఇచ్చి మళ్ళీ అవసరమైనపుడు పిలుస్తానని చెప్పాడు. జీవితంలో ఐదువందల రూపాయల నోటును కనీసం ఐదుసార్లు కూడా చూడని జకరయ్యకు ఒక్కసారిగా రెండు ఐదువందల రూపాయల కట్టలు చేతిలో పడటంతో ఆనందంతో తబ్బిబ్బు అయిపోయాడు. ఆ తరువాత జకరయ్య కర్నూలులో బస్సుఎక్కి విజయవాడకు చేరుకున్నాడు. ఈ సంఘటన జరిగిన నెలరోజులకి ఏదోపనిమీద అర్ధరాత్రి సమయంలో కర్నూలు నుండి ఆత్మకూరు బైకుపై వస్తున్న సుధాకర్ ఒకచోట బండి ఆపి మూత్రవిసర్జన చేస్తున్న సమయంలో ఒక త్రాచుపామువచ్చి శరవేగంతో జరజరాపాకి సుధాకర్ కుడి భుజంమీద కసిగా కాటువేసి అతనిమీద నుండి దిగి ఎటో వెళ్ళిపోయింది. ఆ పాము కాటుకి సుధాకర్ నేలమీద కూలిపోయాడు. విచిత్రం ఏమంటే ఆ పాము కాటుకి సుధాకర్ చావలేదు. ఆ తరువాత కొంత సేపటికి అటువైపు కారులో వెళుతున్న కొందరు రోడ్డుప్రక్కగా పడి ఉన్న సుధాకర్ ని కారులో ఎక్కించుకుని కర్నూలు ఆసుపత్రిలో చేర్చారు. సుధాకర్ ఎలాగో బ్రతికాడు. కానీ అతని కుడిచేయి అతి భయంకరంగా మారిపోయింది. అతనిచెయ్యి నిరంతరం వికృతమైన గాయాలతో అతడిని నానాబాధలు పెడుతున్నది.

తాము నాగమణికోసం అన్యాయంగా చంపిన దేవతాసర్పం ఇచ్చిన శాపం కారణంగానే తను ఇంకొక సర్పంకాటుకి గురై వికృతమైన ఈ చర్మవ్యాధికి బలి అయ్యానుఅని సుధాకర్ కి ఆలస్యంగా అర్ధమయ్యింది.

ఆ తరువాత ఆరు నెలలకి సుధాకర్ విషజ్వరంవచ్చి చనిపోయాడు. ఇక్కడ జకరయ్య కొత్త వ్యాపారం ప్రారంబిద్దామని కరీంనగర్ దగ్గరలో ఉన్న వేములవాడకు చేరుకున్నాడు. అక్కడ తన దగ్గర ఉన్న లక్షరూపాయలతో చిన్న భోజన హోటల్ స్థాపించాడు. ఒక పౌర్ణమిరాత్రి కరీంనగర్ నుండి బస్సులో వేములవాడవచ్చి వేములవాడ బస్ స్టాండులో బస్సుదిగి నడుచుకుంటూ ఊళ్ళోకి వస్తున్న జకరయ్య వేములవాడకి, వేములవాడ బస్ స్టాండ్ కి మధ్యగా ప్రవహించే వాగుమీద ఉన్న చిన్న వంతెన మీదకు రాగానే ఒక ఊహించని ప్రమాదానికి గురి అయ్యాడు. అది ఏమిటంటే ఎండిపోయిన వాగులో నుండి ఒక భయంకరమైన కట్లపాము వంతెనమీదగా నడిచివెళుతున్న జకరయ్యకాలుమీద మూడుకాట్లువేసి వంతెనదిగి వాగులోకి వెళ్ళి పోయింది. జకరయ్య భయంకరమైన బాధను అనుభవిస్తూ పెద్దగా అరుస్తూ వేములవాడ ఊళ్ళోకి పరుగెత్తాడు. అలా పరుగెడుతున్న అతను రాజన్న గుడిని దాటి (శ్రీరాజరాజేశ్వరస్వామివారి గుడి) ఆ గుడి ప్రక్కగా ఉన్న చెట్లలోకి పరుగెత్తి నేలపై కూలిపోయాడు. మర్నాటి ఉదయం అటువైపు మూత్రవిసర్జనకు వెళ్ళిన కొందరు కార్మికులకు తుక్కులో పడి ఉన్న జకరయ్య కనిపించాడు. వాళ్ళు అతడిని తీసుకువెళ్ళి ఒక హాస్పటల్ చేర్పించారు. అక్కడ వైద్యులు జకరయ్యకు వైద్యం చేసారు. దాదాపు నెలరోజులు వైద్యంచేసినా జకరయ్యకాలిమీద ఉన్న పెద్దపుండు ఏమాత్రం తగ్గలేదు. భయంకరమైన దుర్వాసన కొడుతూ విపరీతమైన పోటును బాధను కలిగించే ఆ గాయాన్నిచూసి బెంబేలెత్తిపోయిన జకరయ్య అన్నం నీళ్ళు కూడా మానేసి నిద్రలేకుండా ఏదో ఏదో మాట్లాడటం ప్రారంభించాడు. అతని భార్యకు. కొడుక్కి అతనికి ఏం జరిగిందో అర్ధంకాలేదు. దేవతా సర్పాన్ని అన్యాయంగా చంపేసాను. దాని ఉసురే నాకు తగిలింది. నేనుకూడా చచ్చిపోతాను నన్ను ఏ డాక్టరు కాపాడలేడు అని రోజులో అనేకసార్లు జకరయ్య అనటం జరిగింది. జకరయ్య అనేకసార్లు పాముల్ని చంపిన విషయం ఆయన భార్యకు కొడుక్కి తెలుసు. మరి ఇపుడు జకరయ్య పామును చంపినందుకు పామును చంపినందుకు భయపడటం ఏమిటి అన్నవిషయం వాళ్ళకు అర్ధంకాలేదు. ఆ తరువాత 45 రోజులకు జకరయ్యను కారులో

విజయవాడకు తీసుకువచ్చారు. అతని భార్యబిడ్డలు అతడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చేరిన వారం రోజులకి జకరయ్య హఠాత్తుగా మరణించాడు. జకరయ్య మరణించటానికి కొద్ది గంటలముందు ఒక పొడవైన త్రాచుపాము జకరయ్య పడుకుని ఉన్న వార్డులో సంచరిస్తూ కొందరు నర్సులకు కనిపించిందని తెలుస్తున్నది.