భక్తకోటికి ఓం శివశక్తి పీఠం పీఠాధిపతుల వారి మనవి

kottiyoor devaswom

శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్యలహరి మహా సంస్థాన ఆశ్రమమువారిచే “ఓం శివశక్తిపీఠం” ఆధ్వరంలో అత్యద్బుత, శిలాఖండాలతో శైవ, వైష్టవ, ఆగమశాస్త్రాలను అనుసరించి మరియు స్వయంభూగా వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు, ఎందరో ఆదిగురువులు, సిద్ధ గురువులు, రాజయోగులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, యంత్ర-మంత్రం-తంత్రములతో నిర్మించి నిత్య కార్యక్రమములు, అగ్నిహోత్రములు చేస్తున్నారు. వాటి ఆలయ నమూనాలు, మూలవిరాఠ్ నమూనాల దేవతల స్వరూపాలు అనుసరించి “ప్రపంచ శాంతి కోసం, దేశ సౌభాగ్యం కోసం, ప్రకృతి వైపరీత్యాలనుండి రక్షించడం కోసం, భూలోకంలో పాడిపంటలతో సస్యశ్యామలముగా ఉండడం కోసం, లోక కళ్యాణార్ధం మానవాళిని ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, శాంతియుతంగా, ప్రేమయుతంగా జీవించడం కోసం, ధన ధాన్యాలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఇష్ట కార్యసిద్ధి, మనోవాంఛ ఫలసిద్ధి, విద్య, ఉద్యోగం, వ్యాపార, ఐశ్వర్య ఫలసిద్ది, పాడిపంటల ఫలసిద్ది, విద్యాబుద్దులు, వివాహ, సంతానసౌఖ్యం, కుటుంబ సౌఖ్యం కలుగజేయడం కోసం “గానాభాద్యం” సౌర్యం, శైవం, వైష్టవం, కౌమారం, శాక్తేయం హిందూ మతంలో ఉండే అన్ని దేవతలకు విడివిడిగా ఆలయాలు లోకంలో ఉండే షణ్ముద దేవతల వేద శివాగమ శిల్ప శాస్త్రము ననుసరించి నిర్మించిన మహా విశిష్ట పుణ్యక్షేత్రం.

ఈ మహా పుణ్యక్షేత్రంలో శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం, ప్రధాన శివాలయం (శ్రీ తారకేశ్వర స్వామి) శ్రీ తారకేశ్వరి దేవి ఆలయం, ద్వాదశ జ్యోతిర్లింగాల 12 ఆలయాలు, శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ స్వామి ఆలయం, సతీ సమేత వాహన పూర్వక నవగ్రహాలు, శ్రీ కాలభైరవాలయం, పంచభూతాల కలయికతో, అయిదు ముఖములతో ఏర్పడిన శ్రీ పశుపతినాథ స్వామి ఆలయం, శ్రీ సాక్షి గణపతి స్వామివారు, శ్రీ చక్ర సహిత శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి ఆలయం, అష్టాదశ శక్తి పీఠాల 18 ఆలయాలు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీ గాయత్రీ దేవి, శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయాలు, శ్రీ అయ్యప్ప స్వామి, శ్రీ అనంతపద్మనాభ స్వామి, శ్రీ నాగ దేవత అమ్మవారి ఆలయాలు, శ్రీ సాయినాథ మందిరం, శ్రీ కోదండ రామాలయం, శ్రీ రామ సత్యనారాయణ స్వామి వారి ఆలయం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు, శ్రీ సూర్య భగవానుని ఆలయాలతో సహా 54 దేవాలయాలు, 84 దేవతామూర్తులు మరియు 27 నక్షత్రముల నక్షత్రవనం, 9 గ్రహముల గ్రహవనం, 12 రాశుల రాశివనం, గోసాల, నిత్య అన్నదానం, భక్తుల వసతి, ధ్యాన పిరమిడ్, సప్త నదీ జనాలతో పునీతమైన పుణ్య పుష్కరిణి మరియు పుణ్య పుష్కరిణిలో కొలువై ఉన్న 27 అడుగుల అర్ధనారీశ్వర స్వరూపం కలియుగంలోనే ఏకైక హరిహర, మహాశక్తి హిందూ ఆధ్యాత్మిక ఆలయ సముదాయాల మహా పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన వారికి, హిందూ మతంలో ఉన్న అన్ని దేవతలను విడివిడిగా ఉన్న ఆలయాల్లో ఒకేసారి ఒకే ప్రాంగణంలో దర్శించగల మహాభాగ్యము కలిగిన ఏకైక పుణ్యక్షేత్రం.

ఈ క్షేత్రం దర్శించి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, వ్యాపారాభివృద్ధి, కళ్యాణ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ ప్రాప్తి, మనోవాంఛా ఫలసిద్ది, ఇష్ట కార్యసిద్ధి పొందవలసినదిగా తెలియజేయుచున్నాము. అంతేకాకుండా జాతక దోషాలు, నామనక్షత్ర దోషాలు, జన్మ నక్షత్ర దోషాలు, కాలసర్ప దోషాలు, ఏలినాటి శని దోషాలు, గ్రహదోషాలు, గృహదోషాలు మరియు రాహు కేతువుల దోషములు గలవారు దోష పరిష్కారార్థ పూజలు, అభిషేకాలు, జపములు, హోమములు చేయించుకొని దోష పరిహారం పొందవలసినదిగా కోరుచున్నాము.

శ్రీ కైలాష నాధుడు శ్రీశ్రీశ్రీ సదాశివమూర్తి స్వామి, శ్రీ మహాకాళి , శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి స్వరూపిణి, శ్రీశ్రీశ్రీ చండికాదేవి అమ్మవారి పీఠమును తప్పనిసరిగా దర్శించి తరించండి. సృష్టి ఆవిర్భవించిన నాటి నుండి ఇన్ని యుగాలు గడిచినా కైలాషనాధుడు మొట్టమొదటి భూమిమీద ఆవిర్భవించినటువంటి రూపంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధముగా రూపాధ్యాయన గ్రంధాన్ని అనుసరించి 25 తలలతో, 50 చేతులతో, 48 ఆయుధములతో 2 అభయ హస్తములతో నిర్మించినటువంటి పరమదివ్య జ్యోతి స్వరూపుడు అయినటువంటి పరమేశ్వరుడుని మరియు సృష్టిలో ఎక్కడా లేనటువంటి అత్యంత శక్తివంతమైన సకల దేవతా స్వరూపిణి అయినటువంటి జగన్మాతా మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతి, త్రిశక్తి అమ్మవార్ల యొక్క కలయికతో ఆవిర్భవించినటువంటి మహాశక్తి శాలిని చండికా దేవి అమ్మవారిని రూపాధ్యాయన గ్రంధాన్ని అనుసరించి నిర్మించడమైనది. కలియుగంలో అత్యంత శక్తివంతమైన వారు తలచిన కోరికలు ఉత్తరక్షణములో కలియుగంలో తీర్చగలిగే కైలాష నాధుడు, చండికాదేవి అమ్మవారు అన్ని పురాణగ్రంథాలు గోచరించుచున్నవి. కావున భక్తులు, యాత్రికులు గమనించి, అరుదుగా లభించే స్వామి, అమ్మవార్లను దర్శించి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు, అఖండ విద్యా, ఉద్యోగ, వ్యాపారాభివృద్ధి, ఐశ్వర్య ఫలసిద్ధి, ఇష్టకార్యసిద్ధి, మనోవాంఛ ఫలసిద్ధి ముక్తి మోక్షాలు పొందవలసినదిగా వ్యవస్థాపక పీఠాధిపతులువారు తెలియజేయుచున్నారు. ఈ క్షేత్రంలో ప్రతిరోజు గోపూజ, అభిషేకము, అర్చనలు, పూజలు, బాలభోగములు, రాజభోగములు, సంద్యా భోగములు, పర్వదినములలో విశిష్ట కార్యక్రమములు, ప్రత్యేక అభిషేకములు, జపములు, అర్చనలు, హోమములు, కళ్యాణములు జరుగును.

ఈ క్షేత్రంలో నామకరణములు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసములు, ఉపనయనములు, వివాహములు ఉచితంగా చేసుకొనుటకు తగిన ఏర్పాట్లు కలవు. కావున దర్శించి - తరించండి.

ఆలయ నిర్మాణ రహస్యం

kottiyoor devaswom

“బలరామకృష్ణ” అను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూ|| గో||జిల్లా, కోరుకొండ మండలం, గాదరాడ గ్రామంలో కీ||శే|| బత్తుల గంగారావు, శ్రీమతి గోవిందమ్మ పుణ్యదంపతులకు మూడవ సంతానంగా రైతు కుటుంబంలో మారుమూల గ్రామం మహాశివరాత్రి పర్వదినాన, తెల్లవారుజామున బ్రహ్మీముహూర్తంలో 1973 సం||లో జన్మించినాను.

బాల్యం నుండి వ్యవసాయంలో మా నాన్న గారికి సహాయకుడిగా తోడు ఉంటూ చదువుకునేవాడిని. అదే గ్రామంలో 10వ తరగతి వరకూ చదువుకుని చదువులో ఒక్కసారి పాఠం వింటే పరీక్షలు వ్రాసే జ్ఞానం కలిగి ఉండేవాడిని. కాని వ్యవసాయపనులు ఒత్తిడి వల్ల చదువు పూర్తి చేయలేక పోయాను. చదువు ఆపేసి వ్యవసాయం చేస్తూ కల్లు, సారాయి, బ్రాంది, చుట్ట, బీడి, సిగరెట్ లాంటి చెడు వ్యసనాలకు అలవాటుపడ్డాను. చాలా మంది పెద్దలు, సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు మందలించేవారు చాలా తెలివైన నీకు ఇలాంటి చెడు వ్యసనాలు మంచిది కాదు మార్పు చేసుకోమని చాలాసార్లు చెప్పారు కానీ వారి మాట వినేవాడిని కాదు. వ్యవసాయంలో వచ్చిన డబ్బులతో మద్యం సేవించేవాడిని. చిన్నదానికి, పెద్దదానికి అందిరతో గొడవలుపడేవాడిని. తాగడానికి డబ్బులు లేనప్పుడు అప్పులు చేసివాడిని. ఆ అప్పులను మా అమ్మ, నాన్న, అన్నయ్యలు తీర్చేవారు కొంతకాలం అలా గడించింది.

ఒకరోజు నేను మద్యం సేవించి గ్రామంలో ఉన్న ఒక కిళ్ళీకొట్టు వద్ద పుగాకు చుట్టలు కొనుగోలు చేయుచుండగా, అక్కడకు సుమారు 90 సం||ల ఒక స్వామిజీ వచ్చి అందరికీ జాతకాలు చెబుతున్నారు. అందరి జాతకాలు స్వామిజీ చెబుతుంటే నేను పుగాకును చుట్ట చుట్టుకుంటూ త్రాగిన మైకంలో తూలుతూ స్వామిజీ చెబుతున్న జాతకాలను ఎగతాళి చేస్తున్నాను. అయినా ఆ స్వామిజీ అందరి జాతకాలు చెప్పారు.

అక్కడ ఉన్నవాళ్ళు నన్ను జాతకం చెప్పించుకోమన్నారు. నాకు జాతకాల మీద నమ్మకం లేదు, దేవుడు మీద నమ్మకం లేదు. అని ఎగతాళిగా మాట్లాడాను. నీకు జాతకం చెబుతాను అని ఆ స్వామిజీ అన్నారు. అందరి దగ్గర డబ్బులు తీసుకున్న స్వామిజీ నీ దగ్గర డబ్బులు లేవు అని అన్నారు. అయినా నీలాంటి వారికి జాతకం చెప్పడం కోసమే నాలాంటి స్వామిజీలు ఉన్నారన్నారు నేను నవ్వాను. నా జాతకం, నా జీవితం చిన్నవయస్సులోనే పక్కదారి పట్టి పతనమైపోయింది ఇంక మీరేంచెబుతారు అన్నాను. స్వామిజీ అక్కడ ఉన్న వారందరితోనూ నేను వద్దన్నా డబ్బులు ఇవ్వకపోయినా నీ జాతకం చెబుతాను అన్నారు. నేను వద్దని ఎంత వాదించినా స్వామిజీ వినలేదు.

నా జాతకం మొదలు పెట్టేసరికి నేను పూర్తి మద్యం మత్తులో ఉండి చుట్ట కాలుస్తూ తూలుతూ అనవసర ప్రసంగం చేస్తూ ఉన్నాను. అయినా స్వామిజీ నా జాతకం చెప్పడం మొదలుపెట్టారు. ఈ మహాజాతకుడు రేపటి నుండి ఈ మద్యాన్ని స్వీకరించడు, ధూమపానం చేయడు, ఉద్యోగం చేస్తాడు, వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తాడు సేవకులు, వాహనాలు, భవనాలు అంతులేని ఐశ్వర్యంలో పట్టణంలో నివసిస్తాడు, మంచి వ్యాపారవేత్త అవుతాడు ధానధర్మాలు చేస్తాడు మంచి ఆధ్యాత్మికవేత్త అవుతాడు అని చెప్పినారు. నాకు నవ్వు వచ్చింది. చదువులేని నాకు ఉద్యోగమా, నాకే దారిలేదు వేలాది మందికి ఉద్యోగాలు నేను ఇస్తానా! నాకు బ్రతకడానికి ధనములేదు నాకు సేవకులా! సైకిలు కూడా లేదు వాహనాలా! ఇప్పుడు జాతకం చెప్పిన మీకు ఇవ్వడానికి డబ్బులు లేవు అంతులేని ఐశ్వర్యమా! భవనాలు ఎలా వస్తాయి ఈ గ్రామం నుండి పక్క గ్రామం వెళితే ఎలా మాట్లాడాలో తెలియదు పట్టణ జీవితమా! నా బుద్ధికి దానధర్మాలు ఎలా చేస్తాను అని వెకిలిగా ఆ స్వామిజీని ప్రశ్నించాను. ఆ స్వామిజీ అవన్నీ జరుగుతాయి నాలాంటి స్వామిజీలకు ఎందరికో ఆశ్రయం కల్పిస్తావు. నీకు చెప్పినవన్నీ జరిగాక నాకోసం తపిస్తావు. అప్పుడు నీకు కనబడితే నాకు ఒకపూట ఆతిథ్యం ఇచ్చి వస్త్రాలు పెట్టు ఇది ముమ్మాటికి జరుగుతుంది. ఇక్కడ నేను చెప్పిన అందరి జాతకాలు ఎలా ఉన్నా నీ జాతకం జరిగి తీరుతుంది. నీ జాతకం దైవసందేశం నీలాంటివాడిని నేను కలవడం నా పూర్వజన్మసుకృతం నన్ను ఇక్కడికి పంపించిన పరమేశ్వరుడు లోకకళ్యాణార్థం పంపించాడు. నీ జాతకం చెప్పి నేను ధన్యుడనయినాను అని చెబుతున్నప్పుడు ఆ స్వామిజీ ముఖంలో ఎంతో తేజస్సుతో కూడిన ఆనందం కళ్ళలో చూసాను, అయినా స్వామిజీ చెప్పిన జాతకం నాకు నమ్మబుద్ధికాలేదు. నేను కాదు అక్కడ ఉన్నవారు ఎవరూ నమ్మలేదు. అందరూ ఎగతాళి చేసారు అప్పుడు స్వామిజీ అన్నారు ఈ రోజు ఎగతాళి చేసిన వారు ఈ మహానుభావుడికి రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తారు. ఆరోజు వస్తుంది అని చెప్పి ఆ స్వామిజీ వెళ్ళిపోయారు. నేను ఇంటికి వెళ్ళి ఆ తాగిన మైకంలో పడుకున్నాను.

ఆరోజు మధ్యాహ్నం పడుకున్న నాకు తరువాత రోజు ఉదయం వరకూ మెలుకువరాలేదు లేచేసరికి ఉదయం 11 గంటలు అయింది. నేను అప్పుడే పడుకున్నాను అనుకున్నాను కానీ సుమారు 21 గంటలు పడుకునేవున్నాను ఇంట్లో వాళ్ళు ఎంత లేపినా లేవలేదు అని చెప్పేవరకూ నాకు అర్థం కాలేదు. స్వామిజీ చెప్పిన విషయాలు గుర్తుకురాలేదు. నేను మామూలుగా బయటకు వెళ్ళాను మద్యం సేవించాలనుకున్నాను షాపు దగ్గరకు వెళ్ళేసరికి బాగా వాసన వచ్చినట్లు అనిపించి తాగాలనిపించక తిరిగి వచ్చేసాను చుట్ట కాల్చాలను కున్నాను కడుపులో తిప్పుతున్నట్లు అనిపించింది. చుట్ట కూడా కాల్చకుండా ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాను ఇలా కొన్ని రోజులు గడిచింది. ఎప్పటిలాగే వ్యవసాయ పనులు చేస్తున్నాను. మద్యం, మాంసం, చుట్ట, బీడి, సిగరెట్ అవేమి ముట్టడం లేదు వాటి ధ్యాసే లేదు.

ఒక రోజు కొంతమంది స్నేహితులు వచ్చి పట్టిసీమలో తిరునాళ్ళు జరుగుచున్నవి శివరాత్రి స్నానాలకి సరదాగా వెళదామాఅన్నారు. నాకు ఏమి పనిలేదు కదా అని వాళ్ళతో వెళ్ళాను గోదావరిలో అందరితో పాటు సరదాగా స్నానం చేసాను కొండపైకి ఎక్కి భక్తి లేకపోయినా గుడిలోకి వెళ్ళి పరమేశ్వరుడి లింగమును దర్శనం చేసుకున్నాను. ఆ స్వామి నుండి ఒక అద్భుతమైన తేజస్సు కనిపించింది అలా కొంతసేపు చూస్తూ ఉండిపోయాను. అక్కడికి ఎవరో ఆఫీసర్ వస్తున్నారు అని హడావుడి చేస్తూ భక్తులందరినీ బయటకు తోసేస్తున్నారు. అక్కడికి వచ్చిన ఆఫీసర్ తో పాటు నన్ను లోపలికి తోసేసారు లోపలికి వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కారం చేసాను. అప్పుడు పరమేశ్వరడు అద్భుతమైన తేజస్సుతో నవ్వుతున్నట్లు అనిపించింది. అదంతా ఏమిలేదు అనుకొని బయటకు వచ్చాను. నాతో పాటు వచ్చిన వారందరూ నన్ను బయట వెతుక్కుంటున్నారు. నేను వారిని కలిసాను. అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోవాలని బయలుదేరి సీతానగరం వచ్చాము.

ఒక కుటుంబంలో సుమారు 60సం||లు వయస్సు గల ఒక పుణ్యస్త్రీ ద్వారం దగ్గర ఉండి పిలిచింది అందరం అక్కడకి వెళ్ళి ఎందుకు అని అడిగాము రండి కాళ్ళు కడుక్కోండి భోజనం చేయండి అని అన్నారు. ఏంటి ఇలా అడుగుతున్నారు అనుకున్నాను. ఆమె కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి లోపలికి వెళ్ళి అరటి ఆకులు వేసి అన్నం వడ్డించింది. అరటిఆకులో భోజనం చేయడం మొదటిసారి అన్నం, పప్పు, కూర, నెయ్యి, పచ్చడి వడ్డించి భోజనం పెట్టింది. పప్పులో నెయ్యి వేసుకోమని అడిగి మరీ భోజనం వడ్డించింది. ఎప్పుడూ మాంసం, చేపలు, కోడిగుడ్లు మొదలగు నీచు మాంసం తినే నాకు ఆ తల్లి పెట్టిన భోజనం అమృతంలా అనిపించింది. ఆ తరువాత పెరుగు అన్నం పెట్టి దానితో ఆరటిపండు వలిచి తినండి అని కొసరి, కొసరి పెట్టింది. అన్నం తిన్న తరువాత ఆకు తీస్తుంటే అది తీయవద్దు మీరు భోజనం చేసిన ఆకు నేను తీయడం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. దయచేసి అలా ఉంచండి అన్నారు. ఏంటి! ఈ రాచమార్యాదలు అనుకొంటూ అమ్మయ్య ఖర్చు మిగిలింది అనుకున్నాను. ఆమె వెళ్లిరండి నాయనా అన్నారు.

నాకేమీ అర్థం కాలేదు అయినా ఏమి పట్టించుకోకుండా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా నాకు మళ్ళీ గోదావరి మధ్యలో వున్న పట్టిసీమ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి ఆలయం దగ్గరకు వెళ్ళాలనిపించింది. చీకటి పడింది సగం రాత్రి వరకూ తిరునాళ్ళలో తిరిగి అలసిపోయి గోదావరి ఇసుకలోనే పడుకున్నాము ఉదయం లేచి స్నానం చేసి ఇంటికి బయలుదేరాము మధ్యలో రామదుర్గం అనే కొండ ఉంది అక్కడ ఒక స్వామిజీ ఉన్నారట ఆ స్వామిజీ భోజనం, టిఫిన్ తినరట గత 30 సం||లు నుండి కొండమీద ఒక్కరే ఉ ంటారట అని ఎవరో చెప్పారు సరే ఎలా ఉంటారో అని చూడటానికి వెళ్ళాము. ఆ కొండ మీదకు వెళ్ళగానే ఆ స్వామిజీ చూసి నా దగ్గరకు వచ్చి ఏ ఊరు మీది అని అడిగారు గాదరాడ అని చెప్పాను. ఎవరబ్బాయివు అని అడిగారు. నేను బత్తుల గంగారావు గారి అబ్బాయిని అని చెప్పాను బాబు మీరు మంచి జాతకులు మీ భవిష్యత్ చాలా బాగుంది అని చెప్పి స్వామిజీ ప్రసాదం పెట్టారు. అది తిని ఆ కొండ మీద పరిసరాలు అన్నీ చూసాను. ఇంతలో ఆ స్వామిజీ నన్ను పిలిచి ప్రత్యేకంగా మాట్లాడారు ఇక మీదట నీకు అన్నీ శుభాలే నీకు మంచి పేరుప్రఖ్యాతులు, సఖల ఐశ్వర్యాలు వస్తాయి నీకు ఈ రోజు నుండి అదృష్టం వరిస్తుంది మంచి మార్పువస్తుంది ఆ మార్పుతో అద్భుతమైన జీవితం వస్తుంది. పది మందికి సహాయపడతావు. నీకు తిరుగులేదు. నేను ఈ కొండమీదకు వచ్చిన దగ్గర నుండి నీలాంటి మహానీయుడును నేను చూడలేదు. నీకు ఆ పరమేశ్వరుని పరిపూర్ణమైన అనుగ్రహం వుంది అని అన్నారు. నాకు ఏమి అర్థం కాలేదు ఆ స్వామిజీ నన్ను ఎగతాళి చేస్తున్నారనిపించింది. నా జీవితం ఏంటి వీరు చెప్పే జాతకం ఏంటి అనుకున్నాను. ఈ స్వామిజీ ఏమీ తినకుండా ఎలా జీవిస్తారు ఎవరికి చెప్పకుండా అన్ని తిని ఉండవచ్చు, అని మనసులో అనుకున్నాను. ఆయన వెంటనే నీ అనుమానం నిజమే నేను ఏమీ తినకుండా ఉండను. ఈ కొండపై దొరికే పండ్లు, నీళ్ళు త్రాగి జీవిస్తాను అన్నారు. నేను మనసులో అనుకొంటే ఈ స్వామిజీకి ఎలా తెలిసిందో అర్థం కాలేదు. సహజంగా అందరికీ వచ్చిన అనుమానమే కదా అనుకున్నాను. నీ అనుమానం తీరడానికి నీకు ఒక పనిచెబుతాను అన్నారు. ఎంటీ స్వామీజీ అన్నాను ఆయన ఆ ఎతైన కొండలో చిన్న కొలను వద్దకు తీసుకెళ్ళారు ఆ కొలనుకు రెండువైపుల సుమారు 1000మీ||ల లోయ వుంది అది చూపించారు. ఏ ఆధారం లేకుండా ఈ కొలనులో నీళ్ళు ఎలా వుంటున్నాయి అని అడిగాను దానికి వారు సమాధానం వర్షకాలంలో నీళ్ళు ఎర్రబడవు, వేసవికాలంలో నీళ్ళు ఆరిపోవు. శీతాకాలంలో నీళ్ళు చల్లబడవు. ఈ కొలనులో నీళ్ళు ఏ కాలంలోనైనా ఆరిపోవు రంగు మారవు ఈ కొలనులో నీళ్ళు ఎంతవాడినా నీళ్ళు తగ్గవు అని చెప్పారు. నాకు నమ్మకం లేదు అని చెప్పాను ఆ స్వామిజీ నీ మిత్రులను పిలువు అని మా నలుగురికి నాలుకు బకెట్లు ఇచ్చి ఈ కొలనులో కనీసం ఒక అంగుళం నీరు తగ్గేలా బయటకు తోడండి అన్నారు. సరే అని మేము బకెట్లతో చాలా సేపు ప్రయత్నం చేసి నీళ్ళు తోడాము మాకు నీరసం వచ్చింది కానీ ఒక్క అంగుళం నీరు తగ్గలేదు. అప్పుడు స్వామిజీ అన్నారు అదే దైవం అంటే ఇది మామూలు కొలను కాదు దేవతలు నిర్మించింది ఎప్పుడూ కాలాలతో సంబంధం లేకుండా నీళ్ళు ఒకేలా ఉంటాయి. రంగుమారవు నీళ్ళు తగ్గవు అని చెప్పారు. నాతో రండి అని తీసుకెళ్ళి పూజగదిలోకి వెళ్ళి మా అందరికీ అరటిపండ్లు ఇచ్చి తీసుకొండి అన్నారు. అవి తీసుకొని వస్తున్నప్పుడు నువ్వు మళ్ళీ వస్తావు అని చెప్పారు. నాకు అర్థం కాలేదు రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాను.

నాకు ఒక కల వచ్చింది నువ్వు ఈ ఊరిలో ఉండడం ఎందుకు ఊరిలో ఉండడం వల్ల ఏంటి ఉపయోగం, తాగడం, తినడం, అందరితో గొడవలు, అందిరితో చెడ్డవాడు అనిపించుకోవడం తప్ప నీ తోటివారు ఎలా ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావు ఇంత నీచమైన జీవితం నీకు అవసరమా అంటూ పెద్దవాళ్ళు బంధువులు తిడుతున్నారు. అప్పుడు నాకు అర్థమైయింది. ఈ ఊరులో ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నాను అప్పుడు మెలుకువ వచ్చింది. ఇదంతా కలా, నిజమా అని చూసుకుంటే అక్కడ ఎవ్వరూ లేరు.

ఏంటి ఇటువంటి కల వచ్చింది అని అనుకున్నాను. ఉదయం లేచి ఊరులోకి వెళ్ళాను నన్ను అందరూ శత్రువులా, దుష్టిడిలా చూస్తున్నారు అనిపించింది. ఎవరూ మంచివాడు అనుకోవడం లేదు అనిపించింది. వీడు ఊరి నుండి వెళ్ళిపోతే శని వదలిపోతుంది అన్నట్లు చూస్తున్నారు అనిపించింది. మౌనంగా ఇంటికి వెళ్ళిపోయాను. మందు తాగాలనిపించడం లేదు చుట్ట, బీడి, సిగరెట్ కాల్చాలనిపించడం లేదు మాంసాహారం తినాలనిపించడం లేదు నాకు ఏమి అర్థం కావడం లేదు మౌనంగా ఉంటున్నాను ఇంతలో ఒకరోజు మా మావయ్య వచ్చి నువ్వు ఊరిలో ఖాళీగా ఉండడం ఎందుకు అన్నారు. ఆయనతో వాళ్ళ ఊరు వెళ్ళాను. ఎందుకుంటే మా ఊరిలో వేసవికాలంలో వ్యవసాయం పనులు ఉండవు. ఆయనకు వ్యవసాయంలో తోడుగా ఉంటున్నాను అలా సుమారు 45 రోజులు గడిచాయి ఒకరోజు సాయంత్రం కిళ్ళీకొట్టు దగ్గర పేపరు సరదాగా చదువుతున్నాను. అందులో ఉద్యోగాలు చేయుటకు మనుషులు కావాలి అని చూసాను తరువాత రోజు సినిమాకి రాజమండ్రి వెళతాను అని అబద్దం చెప్పి ఉద్యోగాలు ఇచ్చేవారిని కలిసాను వారితో మాట్లాడాక సెలెక్ట్ అయితే లెటర్ పంపిస్తాము అన్నారు. నేను ఇంటికి వచ్చి యధాతథంగా మావయ్యకు వ్యవసాయ పనులలో తోడుగా వున్నాను కొన్ని రోజులు గడిచింది.

ఒకరోజు నా తమ్ముడు బత్తుల గోపాలకృష్ణ రాత్రిపూట వచ్చి నీకు ఉద్యోగానికి సంబంధించిన ఏదో లెటర్ వచ్చింది అని నేను వున్న ఊరికి వచ్చి లెటరు ఇచ్చాడు అది చదివి ఖర్చులకు రెండువేలు ఉండాలి వద్దులే అన్నాను. రెండు రోజుల తరువాత మావయ్య, మా అక్క చేతిగాజు ఒక షావుకారు దగ్గర తాకట్టు పెట్టి ఉద్యోగానికి వెళ్ళు అని 2000 రూ||లు ఇచ్చారు. అవి తీసుకుని ఉద్యోగానికి వెళ్ళాను అక్కడ నుండి వెళ్ళి ఉద్యోగంలో నమ్మకంగా, కష్టపడుతూ రేయింబవళ్ళు పనిచేసాను నాయొక్క పనితనాన్ని చూసి కంపెనీవారు రకరకాలుగా పరీక్షించి ఉన్నతమైన ఉద్యోగాలు ప్రమోషన్లు ఇచ్చారు. దానికి తోడు ఇంకా చదువు అవసరం అని బి. కామ్ ప్రైవేట్ గా కట్టి చదివాను ఒక పక్క నాకు అప్పగించిన ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాను. అది చిన్న ఉద్యోగం నుండి బ్రాంచ్ మేనేజర్ స్థాయికి ఎదిగాను. మద్యపానం లేదు, ధూమపానం లేదు. మంసాహారం తినడంలేదు ఏమి అర్థం కావడంలేదు. ఈ మార్పు ఏమిటి అనుకున్నాను. ఇలా జరుగుతుంది ఇంతలో నాకు వివాహం అయింది ఉద్యోగం మానేసాను. సొంతంగా వ్యాపారం చేయాలి అనుకున్నాను మంచి ఉద్యోగం మానేసి వ్యాపారం ఏంటి అని బంధువులు అందరూ భయపెట్టారు. కానీ పట్టుదలతో వ్యాపారం పెట్టాలి అనుకున్నాను.

విజయవాడ నుండి రాజమండ్రి వచ్చి అష్టకష్టాలు పడి వ్యాపారం 1999లో మొదలు పెట్టాను. వ్యాపారానికి కావలసిన పెట్టుబడి నిమిత్తం ధనము ఎలా అని సతమవుతున్న సమయంలో నా భార్య తన పుట్టింటివారు ఇచ్చిన మొత్తం బంగారాన్ని తాకట్టు పెట్టుకోండి అని అడగకుండా ఇచ్చింది. ఆ బంగారాన్ని తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో వ్యాపారం మొదలుపెట్టాను. అంతేకాకుండా సుమారు లక్షయాబైవేలు వరకు మా మావయ్య, అక్క వారికి తెలిసినచోట తీసుకొని అప్పుగా ఇప్పించారు. వ్యాపారం పరిపూర్ణంగా మొదలు పెట్టాను. ఇంతలో ఒక సిద్ధాంతిని కలిసాను నీ వ్యాపారం చాలా బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. నువ్వు అనుకున్నది సాధిస్తావు అని చెప్పారు. నేను వ్యాపారం ప్రారంభించిన దగ్గర నుండి వ్యాపారాన్ని మంచి వృద్ధిలోకి తీసుకువచ్చాను. ఆర్థికంగా అన్ని సమకూర్చుకున్నాను ఇద్దరు పిల్లలు పుట్టారు అంతా సంతోషంగా ఉంది భవనాలు వచ్చాయి, వాహనాలు వచ్చాయి పొలాలు వచ్చాయి, సేవకులు వున్నారు. నాకేంటి అని అహంకారంతో జీవిస్తున్నాను.

ఇంతలో ఒక స్నేహితుడు కలిసి మంచి లాభాలు వచ్చే వ్యాపారం వుంది చేద్దాము అన్నాడు. సరే అని ప్రారంభిచాము కొంతకాలం నమ్మకంగా వ్యాపారం చేసిన తరువాత అధికమొత్తంలో నా దగ్గర ఉన్న డబ్బులు, వాటితోపాటు ప్రజలు డబ్బులు తీసుకొని మధ్యలో నన్ను మధ్యవర్తిగా, హామిగా ఇరికించి, మోసం చేసి విదేశాలకు వెళ్ళిపోయాడు. నా దగ్గర ఉన్న డబ్బు పోయింది, వారందరూ నా దగ్గరకు వచ్చి డబ్బుల కోసం ఇబ్బంది పెట్టేవారు. పోలీస్ కేసులు, కోర్టు కేసులు వచ్చాయి. నేను పట్టుదలతో నా దగ్గర ఉన్న ఆస్థి అంతా అమ్మి ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చేసాను. చేతిలో డబ్బులు లేవు చాలా వరకూ ఆస్తిపోయింది. వాహనాలు లేవు, భవనాలు లేవు, సేవకులు లేరు, కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. ఎలా జీవితం అని బాధపడుతున్న రోజులు ఏంచేయాలో అర్థం కాలేదు.

ఒక రోజు కోర్టు పని మీద విజయవాడ వెళ్ళడానికి ఒక చోటుకి వెళ్ళి అక్కడ లాయర్‌ను నాతోపాటు విజయవాడ తీసుకువెళ్ళడానికి లాయర్ గారు వస్తారని ఎదురుచూస్తున్నాను. అనుకోకుండా నేను ఎదురుచూస్తున్న ప్రదేశంలో శివాలయం ఉంది నా దగ్గరకు ఒక పెద్దాయన వచ్చి బాబు శివాలయానికి వెళ్ళు అన్నారు. వద్దులెండీ అన్నాను నామాట విను నాతోపాటు శివాలయం లోపలకి వెళదామురా అని ఒత్తిడి చేసారు. ఆయనమాట విని సరే అని అన్నాను ముందుగా కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని ఒక పాల ప్యాకెట్, కొబ్బరికాయ కొను అన్నారు. అవన్నీ ఎందుకులే అన్నాను. పెద్దవాడిని చెబుతున్నాను దయచేసి ఆచరించు మంచి జరుగుతుందని అన్నారు ఆయన మాటలు నాకు నమ్మకం కలిగి పెద్దవారన్న గౌరవంతో శివాలయంలోకి ఆయనతోపాటు వెళ్ళాను. నీ కోరిక ఏమైనా వుంటే కోరుకో తప్పక నెరవేరుతుంది అన్నారు సరే చుద్దాంకదా అని నేను ఈ రోజు వెళ్ళుతున్న కోర్టు పని శుభం కలగాలి అని నమస్కరించి పాల ప్యాకెట్, కొబ్బరికాయ అర్చకునికి ఇచ్చాను వాటితో స్వామికి అభిషేకం చేసారు తీర్థం తీసుకొని బయటకు వచ్చాను. ఆ పెద్దాయన కనిపించలేదు సరేకదా అని విజయవాడ వెళ్ళాను కోర్టులోకి వెళ్లిన తరువాత ఈ కేసుతో మీకు సంబంధం లేదు మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. ఏంటి ఇలా జరిగింది అనుకున్నాను ఇంటికి వచ్చి నా భార్యకు చెప్పాను చాలా సంతోషించింది. ఇదంతా పరమేశ్వరుని అనుగ్రహం కష్టకాలంలో ఆయన మీకు సహాయం చేయడానికి వచ్చారు. కాబట్టి మన కష్టాలన్నీ పోవాలంటే కనీసం సోమవారమైనా శివాలయానికి వెళ్ళండి అని చెప్పింది.

అప్పటి నుండి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడం ప్రారంభించాను. ఒక చిన్న పాలప్యాకెట్, ఒక కొబ్బరికాయతో ఎలాంటి కోరికైనా తీరుస్తారనే నమ్మకం కలిగింది. అప్పుడు నాకు గుర్తుకు వచ్చారు నాకు జాతకం చెప్పిన స్వామిజీ నేను జులాయిగా ఉన్నప్పుడు, తాగుబోతుగా ఉన్నప్పుడు నాలో ఇన్ని మార్పులు వస్తాయి అని చెప్పారు. అలాంటి స్వామిజీని కలవాలని తిరగనిచోటు లేదు, చాలా ప్రదేశాలు తిరిగాను అన్నిరకాలుగా ప్రయత్నించాను వారు దొరకలేదు. మొదటి స్వామిజీ దొరకలేదు కదా అని రెండవ స్వామిజీ కోసం రామదుర్గం కొండకు వెళ్ళాను ఆయన మరణించారు అని తెలిసింది. అప్పట్లో శివరాత్రి రోజున భోజనం పెట్టిన ఆ మాతృమూర్తిని కలవాలని వెళ్ళాను కానీ ఆ మాతృమూర్తి ఆచూకి దొరకలేదు. కనీసం ఇల్లు కూడా గుర్తుపట్టలేక పోయాను ఏంటి నాకు సహకరించినవారు ఎవరూ దొరకడం లేదు అని నిరాశకు లోనవతూ ఆలోచిస్తున్నాను చెడుమార్గం నుండి మంచి మార్గం వైపు నడిచేలా చేసిన స్వామిజీల ఆచూకీ దొరకలేదు. వారిని కలువలేకపోయాను. ఈ పరిస్థితులలో నాకు మంచి మార్గం చూపించేవారు. కనీసం అమృతం లాంటి ఆతిథ్యం ఇచ్చిన ఆ మాతృమూర్తి కనిపించిన సంతోషించే వాడిని, ఆమె పాదాలకు నమస్కారం చేసి మనశ్శాంతిని పొందేవాడిని అని అనుకున్నాను. అందులో కూడా నిరాశే ఎదురైంది.

ఒకరోజు నిద్రలో ఒక పెద్దాయన తెల్లవస్త్రాలు పంచి, కండువా ధరించి పొడవాటి గెడ్డంతో పొడవుగా జడలు వేసిన తలతో అఖండమైన తేజస్సుతో కలలోకి వచ్చి ఎవరికోసం వెతుకుతున్నావు, ఎక్కడ లేను నువ్వు చూడడంలో తేడా గమనించు నిర్మలమైన మనస్సుతో అమితమైన భక్తిభావంతో ప్రయత్నించు నీ జీవితం ఎక్కడ మార్పు మొదలయిందో ఆలోచించు. నువ్వు కారణజన్ముడవు అహాన్ని వదులు జ్ఞానంతో, భక్తితో అన్వేషించు. అన్నీ శుభాలే జరుగుతాయి, నీకు జాతకం చెప్పింది, నీలో మార్పు తీసుకొచ్చింది ఎవరు నువ్వు బాగా స్థల పురాణం ఆలోచించు అని చెప్పారు. నాకు ఒళ్ళంతా చెమటలు పట్టి లేచి కూర్చున్నాను భయం వేస్తుంది ఏమి అర్థకావడంలేదు నిద్రరావడంలేదు. ఏమి జరిగిందో అర్థంకావడం లేదు బాగా ఆలోచించాను. ఉదయం కాలకృత్యాలు తీర్చుకొని అయోమయంతో శివాలయంకు వెళ్ళాను. ఆ రోజు సోమవారం స్వామిని దర్శించుకుంటూ కల గురించి ఆలోచించాను వెంటనే పట్టిసీమ గుర్తుకు వచ్చింది అక్కడకు వెళ్ళి గోదావరిలో స్నానం చేసి స్వామిని దర్శించుకున్నాను. అప్పుడు నాకు అర్ధమైంది నాకు గాదరాడలో జాతకం చెప్పి చెడు వ్యసనాల నుండి దూరం చేయడానికి ఆ స్వామిజీలోకి ఈ స్వామి ప్రవేశించి జాతకం చెప్పించాడు అని తెలుసుకున్నాను. శివరాత్రికి ఇక్కడ దర్శనానికి మిత్రులు ద్వారా రప్పించింది, అధికారులతో పాటు లోపలికి తీసుకువెళ్ళి నిజమైన అనుగ్రహ స్వరూపంతో దర్శనమిచ్చారు. ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆలోచనను మార్చి ఆకలితో ఉన్న నాకు ఒక మాతృమూర్తిలో అన్నపూర్ణేశ్వరిని ప్రవేశింపజేసి అమృతం లాంటి భోజనం పెట్టించి మాంసాహారంలో ఏముంది అనేలా చేసారు. అహాన్ని అనుమానాలను వదలడానికి రామదుర్గం కొండపైకి తీసుకెళ్ళి స్వామిజీతో మాట్లాడించింది ఈ స్వామే, అపొహలు సృష్టించి కొలనులో నీరు తోడి జ్ఞానాన్ని పొందేలా చేసింది నా స్వామి అనిపించింది. ఇంత మహిమ గల స్వామిని నేను ఇంతకాలం దూరం చేసుకున్నాను అని బాధపడుతూ ఇక మీదట నా స్వామిని స్మరించు కుంటూ ప్రతీ పనిచేయాలి, ఫలితం స్వామి అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకొని బయటకు వస్తుండగా ఒక సాధువు నన్ను చూసి నది దగ్గరకు వచ్చి ఆశీర్వదించారు. నీకు అన్ని ఈ రోజు నుంచి మంచి రోజులు అన్నారు.

కొంచెం కిందకు వచ్చాను. ఒక పెద్దావిడ కేతో పులిహోర తీసుకువచ్చి భక్తులకు పులిహోర పంచుతుంది. నేను అలా వెళుతుంటే పిలిచి నాకు పులిహోర చేతిలో పెట్టింది అది తిని, నేను ఇంటికి వచ్చాను ఆ రాత్రి పడుకున్న తరువాత కల వచ్చి నీ మనస్సు ఎలా ఉంది. ఈ రోజు ఏంజరిగింది అని ముందు రోజు కలలోకి వచ్చిన పెద్దాయన మళ్ళీ వచ్చి అడిగారు. ఆ రోజు జరిగిన విషయాలు అన్నీ చెప్పాను. అప్పుడు స్వామిజీ చెప్పారు పరమేశ్వరుడు ఒక స్వామిజీ రూపంలో వచ్చి ఆశీర్వదించారు. అమ్మవారు పులిహోర ప్రసాదాన్ని పెట్టి స్థల పురాణం అనుగ్రహించారు అని చెప్పారు సరే ఇక మీదట నీకు అంతా మంచే జరుగు తుంది నువ్వు పోగొట్టుకున్న ఆస్తులు, వాహనాలు, ఐశ్వర్యం, సేవకులు పేరు ప్రఖ్యాతలు అన్ని తిరిగి వస్తాయి. నువ్వు పోగొట్టుకున్న వాటి కంటే రెట్టింపు, రెట్టింపు వస్తాయి అలా వస్తే నువ్వు నాకేమి ఇస్తావు అని అడిగారు. మీకు ఏది కావాలంటే అది ఇస్తాను అన్నాను సరే అని ఆయన వెళ్ళిపోయారు నాకు మెలుకువ వచ్చింది నిజంగా ఇదంతా జరిగిందా కలా అని నాకు అర్ధం కాలేదు. మౌనంగా కూర్చొని ఆలోచిస్తున్నాను ఆ పరమేశ్వరుడు నన్ను జాగృతం చేస్తున్నాడా ఈ రోజు గుడి దగ్గర నన్ను ఆశీర్వదించింది పరమేశ్వరుడు నాకు ప్రసాదం పెట్టింది, జగన్మాత పార్వతీదేవి. ఈ విషయం నేను సరిగా గమనించలేదని స్వామి నాకు గుర్తుకు చేయడానికి కలలోకి మళ్ళీ వచ్చి నాతో అన్ని విషయాలు మాట్లాడిస్తున్నారు అనిపించింది ఇంత అద్భుతం జరిగిందా అని నా మనసు ఆనందంతో పరవశించిపోయింది.

అసలు నా జీవితం ఏంటి నేను నిత్యం వ్యాపారం, డబ్బు, ఆస్తులు, వాహనాలు అనుకునే వాడిని ఇప్పుడు నా ప్రయాణం స్వామి, అమ్మవార్ల వైపు వెళుతుంది డబ్బు, ఆస్తులు, వ్యాపారం అన్నింటిలో నష్టం వచ్చి నేనుంటే, నా మనస్సు ఆధ్యాత్మికం వైపు వెళుతుంది అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. పైగా నీకు అన్నీ నేను ప్రసాదిస్తే నాకేమి ఇస్తావు అని అడుగుతున్నారు నిజంగా ఆ స్వామికి నేను ఏమి ఇవ్వగలను. నాలో నేను ఆలోచించుకుంటూ కొంతకాలం గడిపాను ప్రతి సోమవారం శివాలయంకు వెళ్ళడం వీలున్నప్పుడు కుటుంబంతో శ్రీశైలం వెళ్ళడం చేస్తున్నాను.

వ్యాపారం అభివృద్ధి చేయాలన్న తపనతో ఉన్నాను అక్కడ నుండి స్వామిని తలచుకొని వ్యాపారం మొదలుపెట్టాను తక్కువ వ్యవధిలోనే వ్యాపారం దినదినాభి వృద్ధి చెందింది ఎంత పెద్ద కాంట్రాక్ట్ కు వెళ్ళినా పిలిచి నాకే ఇచ్చేవారు వ్యాపా రంలో నేను కోరుకున్న దానికంటే పదింతలయ్యింది పోగొట్టుకున్న ఐశ్వర్యం, ఆస్తులు, వాహనాలు, సేవకులు రెట్టింపుకు రెట్టింపు వచ్చింది. అంతా సుఖంగా సంతోషంగా జీవితం గడుస్తుంది, బాగా పేరు ప్రఖ్యాతులు పెరిగాయి

ఒక రోజు నిద్రలో వుండగా స్వామి కలలోకి వచ్చారు ఇప్పుడెలా ఉన్నావు అని అడిగారు వ్యాపారం, ఆస్థిపాస్తులు అన్ని సంపాదించాను అని చెప్పాను. నీకు ఇల్లు ఇచ్చాను, నాకు ఇల్లు ఇవ్వవా నేను ఎక్కడ ఉండను నీకు ఆస్తిని ఇచ్చాను నాకు ఇవ్వవా, నీకు కావలసిన ఆహారాన్ని ఇచ్చాను. నాకు నైవేద్యాలు ఇవ్వవా నీకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చాను నాకు అర్చనలు, అభిషేకాలు ఇవ్వవా అని అడుగుతున్నారు. నీకు అన్ని నేనై ఇచ్చాను మరి నాకేమి ఇస్తావు ఇప్పుడు ఈలోకంలో నువ్వు సంపాదించినదంతా ఇక్కడే వదిలి వెళ్ళాలి నీది నాది అని ఆరాటపడడం ఎందుకు ఒక్కసారి నన్ను పరిపూర్ణమైన భక్తితో మనస్సులో పెట్టుకొని ప్రతీ రోజు నువ్వు చూస్తున్న ఈ ప్రపంచాన్ని చూడు నీకు ఏమి కనిపిస్తుంది. అలాగే భవ బంధాలతో జీవిస్తున్న నీకు చివరకు నీతో వచ్చేదెవరు ఒక్కసారి ఆలోచించు నీది అనేది ఏదీ లేదు. నువ్వు నీతోపాటు తీసుకువచ్చింది లేదు అలాగే నీతో పాటు తీసుకువెళ్ళేది లేదు నీది నాది అనే కొట్లాట తాత్కాలికం ధనము, అధికారము, ఆడంబరాలు కారణ జన్ములకు అవసరములేదు నువ్వు ఆలోచించుకో! గతంలో నేను అడిగితే ఏది కావాలంటే అది ఇస్తాను అన్నావు. నీకు ధనము, సకల ఐశ్వర్యాలు ఇచ్చాను. నువ్వు ఆలోచించుకో నీకిచ్చేవాడిని నేను, నేను నిన్ను అడిగి తీసుకోను నీకు ఏది ఇవ్వాలో ఆలోచించుకో అని వెళ్ళిపోయారు.మెలుకువ వచ్చి లేచాను అసలు ఏమి జరుగుతుందని ఆలోచించాను ఇంతలో పూజగదిలో గంట మ్రోగుతుంది ఏంటా అని చూస్తే తెల్లవారుజామున నేను వెళ్ళలేకపోయినా ప్రక్కవారితో నా భార్య గోదావరి స్నానానికి వెళ్ళి వచ్చి పూజగదిలో పూజచేసుకుంటుంది తెల్ల వారితే కార్తీక పౌర్ణమి అని అర్ధంమైయింది. ఇలా కల వచ్చింది అని చెప్పాను. మనము శివాలయం కడదాము అని చెప్పాను మంచి ఆలోచన అలాగే చేద్దాం స్వయంగా స్వామి మీ కలలో కనిపించి చెప్పారుగా అంది. అందులోను ఈ రోజు కార్తీక పౌర్ణమి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు అలాంటి రోజున పరమేశ్వరుడే స్వయంగా కలలోకి వచ్చారు. మీరు ఎంత అదృష్టవంతులో అని అమితమైన ఆనందంతో మాట్లాడింది

ఆ రోజు నుండి ఊరిలో పెద్దలను కలిసి ఈ గాదరాడ గ్రామంలో శివాలయం కట్టిస్తాను పూజలు, ధూప, దీప, నైవేద్యాలు ఖర్చులు నేను పెట్టుకుంటాను స్థలం చూపించండి అని చెప్పాను. ఎన్నోసార్లు మీటింగులు పెట్టాను పెద్దలతో మాట్లాడాను అలా రెండు సంవత్సరాలు గడిచింది. కానీ స్థల సేకరణ జరగడం లేదు ఎలా అని విసుగెత్తి పోయి శివాలయం కడదామనుకున్న డబ్బుతో శ్రీశైలంలో ఒక కాటేజికి విరాళం ఇద్దాం అనుకున్నాను. ఇలా కొన్ని రోజులు జరిగాక ఈ విషయం పెద్దలతో చెప్పాను ఎవరూ మాట్లాడలేదు.

ఒక రోజు కలలో మళ్ళీ స్వామి వచ్చారు. నువ్వు నిరాశపడద్దు, ఆలయ నిర్మాణానికి స్థలం దొరుకుతుంది అని అన్నారు. సరే కదా అనుకున్నాను. అనుకోకుండా ఒక రోజు ఊరులోకి వెళితే కొందరు పెద్దమనుషులు వచ్చి మీరు మనసు మార్చుకోవద్దు. శివాలయం నిర్మాణం చేద్దాం స్థలం చూపిస్తాం, రండి అని చెరువు దగ్గర స్థలం చూపించారు సరే అని శంకుస్థాపన చేద్దాం అని ముహూర్తం నిర్ణయించాము. ఇంతలో నాకు తెలిసిన వ్యక్తి వచ్చి ఇంత పెద్ద ఆలయం కట్టేటప్పుడు ఆ స్థలం కరెక్ట్ కాదు మీ సొంత స్థలంలో నిర్మించండి అని సలహా చెప్పారు. నేను పట్టించుకోలేదు.

నేను ఏదో ఆలోచించుకుంటూ పడుకున్నాను రాత్రి ఒక కల వచ్చి నీకు నేను ఇచ్చిన ఆస్తిలో ఆలయాలు నిర్మించకుండా బంజరు భూములలో నిర్మిస్తావా! నీకు ఇల్లు విశాలంగా కావాలి. నేను ఇరకులోనూ, బంజరు స్థలాలలోను ఉండాలా ఏమిటి అని అడుగుతున్నట్లు అనిపించింది ఉలిక్కిపడి లేచాను.

అప్పుడే గుర్తుకు వచ్చింది ఊరికి అరకిలోమీటరు దూరంగా వద్దన్నా ఒక రైతు కావాలని పొలం నాకు అమ్మారు అది ఎందుకు పనికి వస్తుంది అనుకుంటూ కొన్నాము. అమ్మే రైతు చాలామంది మాకు కావాలి అని బలవంతం చేసినా అమ్మకుండా మాకే అమ్మారు అయితే స్వామి అనుగ్రహం అందులో ఆలయాలు నిర్మించాలి అదే సంకల్పం దైవానుగ్రహం అనుకున్నాను శంఖుస్థాపన నిర్ణయించిన ముహూర్తానికే ఆ పొలంలో శంఖుస్థాపన చేయించాను. అప్పుడు మొదలయింది ఆలయాలు నిర్మాణం ఎలా చెయ్యాలి! వాటి ప్రమాణం ఎలా ఉండాలి! ఎవరు సలహాలు ఇస్తారు! అనే ప్రశ్నలు ఎదురైనవి.

ఉత్తరభారతదేశ యాత్ర: కుటుంబం, బంధువులు, ఆత్మీయులుతో బయలుదేరి ఎందరినో సాధువులను, పీఠాధిపతులను, మఠాధిపతులను, మునులను, ఆధ్యాత్మికవేత్తలను, కాశీ, ప్రయాగ, గయ, కోణార్క్, పూరి, శ్రీశైలం, విజయవాడ మొదలగు పుణ్యక్షేత్రాలను దర్శించి సలహాలు స్వీకరించాను.

నేను స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోయాను. ఎలా నిర్మాణం చేయాలో అర్థం కావడంలేదు. అప్పుడు స్వామి కలలోకి వచ్చి ఇంజనీరువి నువ్వే, సేనాధిపతివి నువ్వే, సేవకుడివినువ్వే, ధర్మకర్తవి నువ్వే ఏమి ఆలోచించకు ధనముకు లోటు రాదు, జ్ఞానమునకు లోటు రాదు అవసరం అయినప్పుడు అవసరాన్ని బట్టి నీతో నేను ఉంటాను. నీకు వాస్తు ఎలా ఉండాలి అన్నప్పుడు ఎదుట వ్యక్తిలో వాస్తు పురుషుడును నేనే అయిఉంటాను. నీకు సలహా అవసరం అయినప్పుడు నేను సలహాదారునిగా నీ పక్క వ్యక్తిలో వుంటాను. నీకు ధనము అవసరం అయినప్పుడు నీ భాండాగారంలో కుబేరునిగా కూర్చొంటాను. నిర్మాణానికి ప్రతీ వారిలోనూ నేను నా గణాల ప్రతిరూపాలు ఉంటాయి సామాగ్రిని సమకూర్చడానికి సమర్గులను నేను నీకు అప్పగించి వారిలోకి నేను ప్రవేశిస్తాను. ప్రతీ కట్టడంలోనూ ముక్కోటి దేవతలు సహాయకులుగా ఉంటారు. నీ మనస్సులోనూ, నీ ఆలోచనలోనూ, నువ్వు చేసే సంకల్పంలోనూ నేను పరిపూర్ణంగా ఉంటాను. ఈ ఆలయాల నిర్మాణం దైవసంకల్పం నువ్వు కారణజన్ముడవు కాబట్టి నీతో నిర్మాణం చేయిస్తున్నాను. నీకు మంచి పరివారం వస్తారు పరిపూర్ణంగా పూర్తిచేస్తావు భయపడకు అని చెప్పి వెళ్ళిపోయారు.

నాకు ఎనలేని సంతోషం, ధైర్యం వచ్చింది. నా తమ్ముడు గోపాలకృష్ణ నిర్మాణంలో పూర్తిగా బాధ్యతలు తీసుకొని నిర్మాణం గావిస్తున్నారు. బంధువులు, ఆత్మీయులు, పురుషులు అంతా పరమాత్మ స్వరూపంగా మహిళలందరూ జగన్మాత స్వరూపంగా సహకరించి కలియుగంలో ఎక్కడాలేని విధంగా శైవ, వైష్ణవ, మహాశక్తి పరివార దేవతలు కైలాసం, వైకుంఠం, స్వర్గలోకం, భూలోకం పంచభూతాలు అన్నీ ఒకేచోట ఉండేలా పరమేశ్వరుడు, జగన్మాత, ముక్కోటి దేవతల అనుగ్రహంతో ఏ విధమైన ప్రమాదాలు లేకుండా, ఏ విధమైన ఆటంకాలు లేకుండా అతి సుందరంగా నిర్మాణం పూర్తయి అత్యంత వైభవంగా దివ్య కాంతులతో దైవానుగ్రహంతో ఈ క్షేత్రాన్ని నిర్మించాను. కాదు స్వామి, అమ్మావార్లు ఈ క్షేత్రాన్ని నాతో నిర్మించేలా చేసారు.

కలియుగంలో ఎక్కడా లేని విధంగా సర్వదేవతలు ఒకే చోటు కొలువై ఉండేలా 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆలయాలు 18 అష్టాదశ శక్తి పీఠాలు ఆలయాలు కృతయుగంలో ఈ భూమండలంలో దేవతలు, మునులు ఎలా నిర్మించారో అక్కడ ఉన్న ఆలయాలలో దేవాతమూర్తులు ఎలా ఉంటారో అదే రూపంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆలయాలు, అష్టాదశ శక్తిపీఠాల ఆలయాలు, నేపాల్ లో ఉన్న పశుపతినాథ్ (పంచభూతాలైన అగ్ని, నీరు, వాయువు, భూమి ఆకాశం, లింగం) పంచముఖ ఈశ్వరునిగా నిర్మించాము వరాలు సిద్ధించడానికి వరసిద్ధి వినాయకుడు ప్రధాన శివలింగం పార్వతీ అమ్మవారిని, తారకేశ్వరస్వామి, తారకేశ్వరదేవిగా ఒకేచోట నిర్మించాము ఈ క్షేత్రం దర్శిస్తే కలియుగంలో ఉన్న అన్ని ఆలయాలు దర్శించిన అనుభూతి కలిగేలా నిర్మించాము.

సప్తనదీ జలాలు కలిసిన పునీతమైన పవిత్ర పుష్కరిణి ధ్యానం చేసుకొనుటకు ధ్యానపిరమిడ్, భక్తులకు నిత్య ఉచిత అన్నదానం సముదాయం ఏర్పాటుచేసి నిత్య ఉచిత అన్నదానం చేసే భక్తులు పరవశించేలా ఏర్పాటు చేసాము.

ఆ క్షేత్ర ప్రాంగణంలో 27 నక్షత్రాలకు నక్షత్ర వనం, 12 రాశులకు రాశివనం, 9 గ్రహాలకు గ్రహవనం, పుష్పవనం మరియు దేవతా వృక్షాలు కూడా ఏర్పాటు చేసి, 108 గోవులలో గోసేవ గోపూజ నిమిత్తం ఏర్పాటు చేసాము. దూరప్రాంతాల నుండి వచ్చు భక్తులకు వసతి కూడా ఏర్పాటు చేయడమైనది. వివాహాలు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసం, శాంతి పూజలు, హోమాలు కార్యక్రమాలు చేసుకొనుటకు ఏర్పాటు చేయడమైనది.

ఈ క్షేత్ర దర్శనం భక్తిదాయకం, సర్వమంగళకరం, మోక్షదాయకం, ముక్తిదాయకం ఈ క్షేత్రం దర్శిస్తే భూమండలంలో ఉన్న అన్ని ఆలయాలు దర్శించిన పుణ్యఫలం లభిస్తుంది, అని క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆనందంతో పరవశించిపోతుంటారు. ఈ క్షేత్రం తమిళనాడుకు చెందిన కాళికాదేవి స్థల పురాణం పీఠాధిపతులు, శృంగేరీ జగద్గురు ఆదిశంకరాచార్య పరంపర శిష్యులు మహోన్నతమైన 150 మంది ఋత్వికులతో మహాకుంభాభిషేకం, విగ్రహాల ప్రతిష్ఠలు జనవరి 25న జరగాలని పీఠాధిపతులు నిర్ణయించారు. ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని ఎలా నిర్వర్తించాలి అన్న భయంతో నిరాశతో ఉండిపోయాను. కార్యక్రమం ఎలా చేయాలి అని మదన పడుతున్నప్పుడు నిరాశ, నిస్పృహకులోనైయాను సరైన సహాయకులు లేరు సరిపడే ధనం లేదు. ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ఏమాత్రం అనుభవం లేదు. ఎలా చేయాలి అని అర్థంకాని స్థితిలో ఉండి ఈ కార్యక్రమం చేయలేను అను అనుమానంతో భయంతో ఏమి అర్థం కాని స్థితిలో ఉండిపోయాను.

ఒక రోజు క్షేత్రం నిర్మాణం దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నాను. ఒక ఆలోచన వచ్చింది ఈ క్షేత్రం పూర్తి చేయకుండానే చనిపోతానేమో అని ఆలోచన వచ్చింది నాకు చావు అంటే భయం లేదు కానీ క్షేత్రం పూర్తి చేయాలి అనుకున్నాను. నాకు సహాయపడే వారి అందిరితోనూ పూర్తి వ్యతిరేకత ఏ ఒక్కరూ సహకరించడం లేదు. అన్ని వైపుల నుండి అందరూ ఏకదాటిగా నన్ను వ్యతిరేకిస్తున్నారు ఏ పని ముందుకు వెళ్ళడం లేదు. అందరికీ నేను శత్రువులా కనిపిస్తున్నాను అనే భావన కనిపిస్తుంది. నాకు ఆత్మీయులు, బంధువులు, సేవకులు ఎవరూ సహకరించడం లేదు. ఏదో ఒక పరీక్షలా వుంది ఏం చేయాలి. ఎవరికి ఏ పని చెప్పిన కోపంగా మాట్లాడుతున్నారు అప్పటి వరకు నేను చెప్పిన ప్రతీదీ వారి కర్తవ్యంగా, బాధ్యతగా ఉండేవారు నాకు సంబంధం లేదు నేను ఇంకేమి చేయలేను అంటున్నారు. ఎవ్వరూ ఏమి పట్టించుకోవడం లేదు ఎలా మార్పు తీసుకురావాలి అని మధనపడుతూ ఉండేవాడిని ఒకపక్క ధనము అనుకున్న దాని కన్నా ఎక్కువ ఖర్చు అయ్యేలా ఉంది అన్ని ఇబ్బందులుగా కనిపిస్తుంది. ఒక పక్క అనారోగ్యంతో బాధపడుతున్నాను అనుకోకుండా ఒక రోజు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాను. ఆ టైములో హాస్పిటల్ కి వెళ్ళి వైద్యం చేయించుకొని ఎవ్వరికి తెలియకుండా మందులు వాడుతున్నాను. ఎవ్వరికి చెప్పినా భయపడతారు అందరూ నా ఆరోగ్యం గురించే ఆలోచిస్తారు కానీ ఆలయ విగ్రహ ప్రతిష్ఠలు, కుంభాభిషేకం గురించి ఆలోచించరని అనిపించింది. ఇన్ని బాధలు తలుచుకుంటూ నాలో నేనే మధనపడుతూ ఉన్నాను.

ఒకరోజు చాలా రాత్రి వరకూ నిద్రరాలేదు ఏవేవో ఆలోచనలు మానసిక ఒత్తిడులు పనులు పూర్తికావడం లేదన్న ఒత్తిడులు, కార్యక్రమానికి సరిపడా ధనము లేదన్న ఒత్తిడులు అన్ని ఎలా జరుగుతాయి అనే భయం నా బాధ ఈ పరిస్థితులలో ఎవరికి చెపితే వారికి ఏమి అర్థం అవుతుంది నాకు వాళ్ళు సహాయపడగలరా అనిపించేది.

ఒక రోజు నాకు కల వచ్చింది నేను కాశీలో ఉన్నాను ఒక స్వామిజీ వచ్చి నన్ను అడుగుతున్నారు. ఏంటి నువ్వు చాలా బాధలలో ఉన్నట్లు ఉన్నావు అని అడిగారు ఏమిలేదు అని చెప్పాను. నిజం చెప్పు నీకు బాధలు లేవా అన్నారు లేవు అన్నాను. గుడి పూర్తి చేస్తావా ? చేయలేవా? అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను నాకళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. నేను కడుతున్నది స్వామికి ఆలయం ఏంటి ఇన్ని ఇబ్బందులు అన్నాను. ఏమో నీ సంకల్పం నువ్వు మాట ఇచ్చావు స్వామికి ఏది కావాలంటే అది చేస్తానని ఇప్పుడు ఈ పరిస్థితులలో ఏం చేస్తావు. అని అడగగానే నాకు కోపం వచ్చింది. సరే ఆలయం నిర్మాణం ప్రతిష్ఠలు నా సంకల్పం నేనే పూర్తి చేస్తాను. నా స్వామి కూడా నాకు సహాయం చేయడం లేదు. సహాయం చేసే ఆత్మీయులు కోపంగా ఉన్నారు. అయినా పరవాలేదు స్వామి నాకు పరీక్ష పెట్టి చేతికందవలసిన ధనం చేతికి రానీవడం లేదు. మనస్పూర్తిగా సహకరించే ఆత్మీయులు సహకరించడం లేదు నా ఆలోచనా విధానం మందగిస్తుంది అయినా నేను పోరాడతాను. స్వామి నాకు ఎన్ని పరీక్షలు పెట్టినా పరవాలేదు అనారోగ్యం రాకుండా ఉండేలా చూడమనండి మరణం సంభవించకుండా అనుగ్రహించమనండి నా సంకల్పం నేను పూర్తి చేస్తాను.

నాకు మరణం, అనారోగ్యం ఇవ్వవలసి వస్తే కుంభాభిషేకం, విగ్రహాల ప్రతిష్ఠలు పూర్తి అయిన తరువాత ఇవ్వమనండి సంతోషంగా స్వీకరిస్తాను అని చెప్పాను. అలాగే నువ్వు కోరుకున్నట్లుగా అనారోగ్యం , మరణం నీ దగ్గరకు రాదు. నీ ప్రయత్నం నవ్వు చెయ్యి అన్నారు నాకు సంతోషంగా అనిపించింది. నువ్వు అహాన్ని, అనుమానాన్ని వదిలి స్వామి అమ్మవార్లపై భక్తిభావంతో నీ పనులు మొదలుపెట్టు నువ్వు కారణజన్ముడవు నీ చేత ఈ క్షేత్రాన్ని నిర్మాంచాలనే సంకల్పం నీది కాదు పరమేశ్వరుడిది అని చెప్పి అంతా శుభం జరుగుగాక అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు తెల్లావారిపోతుంది నేను లేచి చూసాను ఏమిలేదు ఏంటి ఇలాంటి కల వచ్చింది నేను స్వామితో పోట్లాటకు దిగాను నాలో ఇంకా అహం ఉందా, నాకు స్వామి పరీక్షలా ఈ సంకల్పం స్వామిదా అని ఆలోచించాను. అప్పుడు అర్థం అయ్యింది ఇదంతా మన గొప్పతనం కాదు స్వామి నా చేత ఈ పనులు చేయిస్తున్నారు. ప్రతీ సేవకుడు స్వామి అనుగ్రహమా క్షేత్రానికి ఒక మహాసర్పం కాపలాగా ఉంటుంది అని చాలా మంది చెబుతున్నారు. ఒక వ్యక్తి దొంగతనం చేస్తే ఆ మహాసర్పం తరిమి తరిమి పరిగెత్తించిందట ప్రతీరోజు కనస్ట్రక్షన్ జరుగుతున్న శివాలయం మరియు మొత్తం క్షేత్రం ప్రతీరోజు ఆ సర్పం వచ్చి తిరిగి చూసి వెళ్ళడం అంటే ఈ క్షేత్రానికి ఒక మహాసర్పాన్ని కాపలాగా పెట్టారా స్వామి అనిపించింది. అప్పటికే నేను నా చిన్నకుమార్తె వందనాంబిక శివలింగాలను, విగ్రహాలను తీసుకురావడానికి కాశీ వచ్చాము. పవిత్రమైన గంగానదిలో స్నానమాచరించి కాశీవిశ్వనాథుని, కాశీ అన్నపూర్ణేశ్వరీని, కాశీ విశాలాక్షిని దర్శించి త్రివేణి సంగమం వెళ్ళి అక్కడ స్నానమాచరించి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు ప్రతిష్టించిన అతి పెద్ద సహస్రలింగము మరియు కామాక్షి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేసి, దర్శించి తిరిగి కాశీపట్టణానికి వచ్చాము.

నర్మదా నదిలో పరమేశ్వరుని అనుగ్రహంతో ప్రకృతి సిద్ధంగా తయారయ్యే శివలింగాలు కాశీ పుణ్యక్షేత్రంలో శుద్ధి చేయించి గాదరాడ గ్రామానికి తీసుకువచ్చాము. క్షేత్రానికి దగ్గరలో ఉన్న రైస్ మిల్ లో ధాన్యాధివాసంలో శివలింగాలు పెట్టించాను. అక్కడ అంతకుముందు అసభ్య కార్యకలపాలు రాత్రులయందు జరుగుతాయి అని తరువాత నాకు తెలిసింది కాని శివలింగాలు రైస్ మిల్ దగ్గర పెట్టిన దగ్గర నుండి ఆ మహాసర్పం రైస్ మిల్ దగ్గర శివలింగాలకు కాపలాగా వెళ్ళి ఉండడం అది చూసినవారు ఏ విధమైన అసభ్య కార్యక్రమాలకు వెళ్ళడం మానేసారు. అక్కడకు మంచి ఉద్దేశ్యంతో వెళ్ళిన వారికి శివలింగాల దగ్గర ఆ మహాసర్పం కనిపించేది. కానీ ఎవరికి ఎలాంటి హాని చేయలేదు. చూసిన వారందరూ ఈ లింగాలలో పరమేశ్వరునికి సర్పం కాపలాగా ఉందని తెలిసిన వారందరూ భక్తితో పరవశించుపోయేవారు. నాకు మనోధైర్యం వచ్చింది. ఆరోజు వరలక్ష్మీ వ్రతం ఇంట్లో అత్యంత వైభంగా సుమారు 2000 వేల మంది భక్తుల సమక్షంలో జరిగింది.

ఆ రోజు రాత్రి నేను అలసిపోయి ప్రశాంతంగా పడుకున్నాను కాంతి వంతమైన తేజస్సుతో పరిపూర్ణమైన పుణ్యస్త్రీ కలలో కనిపించి క్షేత్ర నిర్మాణాన్ని పూర్తిచేయుటకు నాయన నీకు కొంతమంది సహాయకులు కావాలి వారుకూడా పరిపూర్ణమైన భక్తి, శ్రద్ధలతో స్వామిని ఆరాధించేవారు కావాలి. అటువంటి వారిని ఏర్పాటుచేసుకోవాలి. నువ్వు కారణజన్ముడవని స్వామికి తెలుసు కాని మానవులకు సాధారణ మనిషిలాగా కనిపిస్తున్నావు. నీలో ఆధ్యాత్మిక భావన కనిపించడంలేదు, నువ్వు ఇలాగే ఉంటే భక్తితో సేవకు ఎవ్వరూరారు. నువ్వు శివదీక్ష చేపట్టు అందులోను గురుదీక్షను పొందు అప్పుడు నీకు పరమేశ్వరుడి అనుగ్రహంతోపాటు ఆధ్యాత్మికభావన కూడా నీలో పెంపొందిస్తుంది. నువ్వు చెప్పింది ఎదుటవారు శాసనం గాను వారి కర్తవ్యం గాను అనుసరించి సేవచేసే సహాయకులు వస్తారు అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు మెలుకువ వచ్చింది. ఏంటి కల ఇలా వచ్చింది అని ఆలోచించుకున్నాను. తరువాత రోజు ఉదయం పీఠాధిపతులు, గురువులు తమిళనాడు నుండి విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం ఏర్పాట్ల వివరాలు తెలియజేయడం కోసం అనుకోకుండా వచ్చారు. వారికి నాకు కలలో వచ్చిన వివరాలను తెలియచేశాను. అప్పుడు వారు నేను మీకు కూడా సలహా ఇవ్వాలి అనుకున్నాము. ఇంతటి పెద్ద మహాక్షేత్ర నిర్మాణానికి సంకల్పించిన మీరు పరిపూర్ణమైన దీక్షలో వుండాలి. కాని మీరు ముందుగా మాకు చెప్పారు. రేపు అతి పవిత్రమైన రోజు ఆరోజున వేద మంత్రాలతో హోమాలు, పూజలు, అభిషేకాలతో గురుమంత్రాన్ని ఉపదేశించి దీక్షాధారణ చేయుటకు సంకల్పించారు. దాని ప్రకారం నాకు గురుమంత్రోపదేశం, గురుదీక్ష ఇచ్చారు. నాతో పాటు మరొక 11 మంది శివదీక్ష తీసుకొని క్షేత్ర నిర్మాణ ప్రాంగణంలోని పీఠం పెట్టుకొని పూజలు, అభిషేకాలు, దీక్ష, విశ్రాంతి తీసుకుంటూ క్షేత్ర నిర్మాణం విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకం ఏర్పాట్లలో నిమగ్నమై సేవచేస్తున్నారు.

ఇదంతా చూచిన గాదరాడ గ్రామంలో వారు మరియు చుట్టుప్రక్కల గ్రామంలో వారు చాలా మంది భక్తులు స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు వందలాది మంది శివదీక్ష తీసుకొని “ఓం నమఃశ్శివాయః” అని పంచాక్షరి మంత్రం జపిస్తూ కార్యక్రమాలలో నిమగ్నమైనారు. ఏవిధమైనా కులం, హోదా బేధం లేకుండా శివదీక్ష తీసుకొని శివస్వాములు తుడవడం, కడగడం, ఊడ్చడం, అన్నీ శుభ్రపరచడం మొదలగు అన్ని రకాల పనులు చేయడం అదీ ఇదీ అని లేకుండా అందరూ దేవుడి సేవలో నిమగ్నమై అన్ని రకముల పనులు చేస్తుంటే దేవతలు ఆలయాలు నిర్మిస్తున్నట్లు ఉండేది. ఆ ప్రదేశం కైలాశం, వైకుంఠం, స్వర్గలోకం తలపించేలా ఉందని చూసిన భక్తకోటి అంతా ప్రశంసించేవారు.

నేను క్షేత్రాన్ని నిర్మించడానికి, ధనాన్ని సముకూర్చుటకు పవిత్రమైన శివ దీక్షలో ఉండి నాతో పాటు గ్రామాల బిక్షాటనకు సుమారు 500 మంది నాతో బయలుదేరారు. శివలింగం, అమ్మవారు, గోపురాల కలశాలు శిరస్సుపై పెట్టుకొని వేదమంత్రాలతో, మంగళవాయిద్యాలతో బవతీ భిక్షాందేహి అంటూ వీధి వీధిని ఊరురా ప్రతీ ఒక్కరి దగ్గరకూ ప్రతీ ఇంటిటికి వెళ్ళి పేద, ధనిక, కూలీ అనే భావం లేకుండా అందరినీ భిక్షాటన చేసాను. చాలా ధనం, వస్తువులు భిక్షం రూపంలో వచ్చాయి. ఇంటింటికి వెళ్ళి పంచలోహ మహా శివలింగానికి, పార్వతి అమ్మవారికి, లలిత త్రిపుర సుందరీ అమ్మవారికి, కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార మొదలగు పంచామృతాలతో శివదీక్ష తీసుకుని తలపై పెట్టుకున్న శివస్వాములు తడిసిపోయేలా గ్రామ గ్రామలలో భక్తులు అభిషేకం చేస్తుంటే ఆ గ్రామం కైలాశం, వైకుంఠం, స్వర్గలోకం తలపించేలా ఉందని భక్తకోటి అంతా ప్రశంసించేవారు. ఇలాంటి కార్యక్రమం ఈ కలియుగంలో జరగలేదని పీఠాధిపతులు, మఠాధిపతులు ప్రశంసించేవారు. ఈ గ్రామల్లో భిక్షాటనలో నాతోపాటు వున్న శివస్వాములు మానవులు కాదు దేవతలు అని భక్తులు పంచామృతాలతో అభిషేకాలు చేస్తూ భక్తులు పరవశించిపోతుండేవారు. శివస్వాములు కూడా ఈ అద్భుతమైన అనుభూతిని పొందేవారు.

శివదీక్ష తీసుకున్న ప్రతీ వ్యక్తిలోనూ పార్వతీ, పరమేశ్వరులు ప్రవేశించి, ఈ అభిషేకాలు చేయించుకున్నారా అనే విధంగా 500 మంది స్వాములు అభిషేకంతో తడుస్తూ గ్రామ ప్రదక్షిణ బిక్షాటన చేయడం కలియుగంలో ఇదే మొదటిసారి అని పీఠాధిపతులు, ఋత్వికులు ఆశ్చర్యపోయారు. భక్తులు ఈ కార్యక్రమం చూసి అద్భుతమైన అనుభూతిని పొందారు.

108 హోమగుండాలు నిర్మాణం చేయాలి. దానికి సరిపడే యాగశాల నిర్మాణం చేయాలి ఎలా అని ఆలోచిస్తే ఈ 500 శివస్వాములు మేము కడతాం మీరు ఎలా కట్టాలో చెప్పండి అన్నారు. ముక్కోటి దేవతలు లోక కళ్యాణార్థం ఈ శివస్వాములలో ప్రవేశించారు అనిపించింది. ఎప్పుడు ఇంట్లో నుండి బయటకు రాని స్త్రీలు, ఆర్థికంగా ఆస్థులతో స్థిరపడి ఏపనీ చేయకుండా సేవకులతో చేయించుకొనే పెద్ద మనుషులు అందరూ మట్టి తడిపి మట్టిని కుమ్మి అడుసుగా తయారుచేసి ఇటుకలు మోసి యాగశాలలో 108 హోమగుండాలు తయారుచేయడం చెప్పలేనంత అద్భుతం ఇటువంటి అద్భుతం భూమండలంలో ఎక్కడా జరిగి ఉండదు. అనేలా అతిసుందరంగా యాగశాల, హోమశాల నిర్మించారు. ఇందులో చిన్న పిల్లలు కూడా సేవచేయడం ఇంకా అత్యద్భుతం చూసేవారు ఏంటి వీరందరూ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు వీరిలో పూర్తిగా దైవత్వం నిండిపోయింది. మనవంతు కూడా సేవచేయాలని వేలాది మంది వాలెంటీర్లుగా క్షేత్రానికి సేవచేయడానికి ముందుకు వచ్చి అద్భుతంగా సేవచేసారు.

విగ్రహాల ప్రతిష్ఠలు కుంభాభిషేకం ఆహ్వానాల అందజేయాలి, జిల్లా అంతా తిరగాలి ఎలా అనుకుంటే నా భార్య మా ఇంట్లో కోడళ్ళు, ఆడపడచులు రోడ్డులంటా, ఊరూరా తిరుగుతూ ప్రతీ ఇంటికి ఆహ్వానాలు అందజేసారు. అది చూసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఇంట్లో నుండి బయటకురాని మీ ఆడవాళ్ళు వీధులంటా, గ్రామాలంటా తిప్పడం ఏంటి అని అడిగేవారు. కానీ ఇది పరమేశ్వరుడు మాకు ఇచ్చిన అవకాశం. ఈ అవకాశంలో మేము పాలుపంచుకోవడం, ఇలా ఇంటింటికి ఆహ్వానాలు ఇవ్వడం పూర్వజన్మ సుకృతం అని సమాధానం చెప్పేవారు. అది విన్న కొందరు పెద్దమనుషులు కళ్ళలో నీళ్ళు తిరిగాయి మాకు ఆహ్వాన పత్రికలు ఇవ్వండి మేము సేవ చేసుకుంటాము. అని మరో 1000 మంది వరకూ సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు.

ఒకరోజు ఆహ్వాన పత్రిక ఇవ్వడంలో భాగంగా నా కుటుంబ సభ్యులతో కలిసి “బ్రహ్మశ్రీ ఛాగంటి కోటేశ్వరరావు గారి” వద్దకు వెళ్ళినాము. ఆయన ఆ ఆహ్వానపత్రిక చూసి కలియుగంలో ఇది సాధ్యమా, ఇన్ని ఆలయాలు కట్టించడం ఎంత శ్రమ, మీకు ఇద్దరు చిన్న చిన్న ఆడపిల్లలు ఉన్నారా. ఇంత ధనాన్ని వెచ్చించి మీ దంపతులు 54 ఆలయాలు నిర్మించారా అందులో 84 దేవతామూర్తులను ప్రతిష్టిస్తున్నారా! నేను చెప్పే పురాణాలు ఎన్ని ఉన్నాయో అన్ని దేవాలయాలు మీరు కట్టించారా! నేను తప్పకుండా ఒక్కసారి వచ్చి చూడాలి. అని ప్రశంసించడం నాకు అద్భుతమైన ఆనందాన్ని ఇచ్చింది మీ దంపతులు, పిల్లలు అంతా సుఖంగా ఉండాలని దీవించి క్షేత్రం చూడడానికి కుటుంబ సమేతంగా వస్తాను, అని ఆనందంతో మనస్పూర్తిగా దీవించారు. ఈ మాటలు వారి ఆశీర్వచనం విన్న నా భార్య తన్మయం చెంది ఆనందభాష్పాలతో వారి పాదాలకు నమస్కారం చేసి అద్భుతమైన ఆనందం పొందింది. ఇంతటి అనుగ్రహం ఇచ్చిన పరమేశ్వరునికి జగన్మాతను స్మరించుకుని ఆనందంతో పరవశించిపోయాము.

ఈ క్షేత్రంలో పరిపూర్ణమైన ఒక స్వామిజీ ఉండాలి వారిని నేను గురువుగా సంభోదించాలి అని అనుకున్నాను. అలా అనుకున్న రెండు రోజులకు నా మిత్రుడు ఒక స్వామిజీ ఋషికేష్ లో వున్నారు. వారు గత 12 సం||రాలు క్రిందట జగద్గురు ఆదిశంకరాచార్య పరంపర శిష్యులు శృంగేరీ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ భారతితీర్థుల వారి చేతుల మీదుగా సన్యాసం పొందినవారు. ఆధ్యాత్మిక భావనలో ప్రయాణిస్తున్నవారు ఉన్నారు. వారికి క్షేత్రం నుండి ఏ విధమైన ధనము అవసరములేదు వారికి కావలసిన ఆహార పదార్థాలు వారే తయారు చేసుకుంటారు అని చెప్పారు. నేను కోరుకున్నాను పరమేశ్వరుడు అనుగ్రహం ఇచ్చాడు అనుకుని ఆ స్వామిజీని ఆహ్వానించాను. వారే పరివ్రాజకాచార్య పరమహంస శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద తీర్థ స్వామిజీల వారు. క్షేత్రంలో నిరంతరం వుండి క్షేత్రానికి వచ్చే భక్తులను ఆశీర్వదిస్తూ భక్తులు ఇచ్చే గురుదక్షిణలను తీసుకొని దేవస్థానం అభివృద్ధికి వినియోగిస్తున్నారు. కొన్ని రోజులు ఋషికేష్ షోను, కొన్ని రోజులు క్షేత్రంలోను ఉంటున్నారు. తలుచుకుంటే చాలా ఆనందంగా వుంది. అప్పుడే నాకు అర్థమయ్యింది నా స్వార్థం కోసం కాకుండా క్షేత్రం కోసం లోకకళ్యాణార్థం కోసం ఆలోచిస్తే నా యొక్క సంకల్పం సిద్ధిస్తుందని అర్థమయ్యింది.

విగ్రహాల ప్రతిష్ఠ ముహూర్తం వస్తుంది యాగశాల సిద్ధమైంది నిర్మాణ పనులు పూర్తి అవుతున్నవి. గోపాలకృష్ణ మరియు మా అన్నదమ్ములు, మేనమామతో పాటు సేవాకార్యకర్తలు, కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులు కలిసి అత్యంత వైభవంగా తీర్చిదిద్దుతున్నారు అతి సుందరంగా తయారు చేస్తున్నారు. పూజా సామాగ్రి ఋత్వికులకు కావలసిన సామాగ్రిని విగ్రహ ప్రతిష్ఠ, కుంభాభిషేకంకు కావలసిన సామాగ్రిని, అన్నదానంకు కావలసిన సామాగ్రిని సుజీవరాజు, జగదీష్ రేయింబవళ్ళు కష్టపడి అన్నీ సక్రమంగా ఏర్పాట్లు చేసారు వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

విగ్రహాలు గ్రామ ప్రదక్షిణ చేయాలి అనే ఆలోచన రాగానే 84 దేవతా మూర్తులను 5 ట్రాక్టర్లలో పెట్టి ఊరేగింపుకు వెళ్ళేవాళ్ళం. ప్రతిరోజూ తెల్లవారుజామున శివస్వాములు అన్ని కార్యక్రమాలు ముగించుకుని పూజలు, అభిషేకాలు పూర్తి చేసి సుమారు 1000 మంది కాలినడకన ఊరూరా తిరిగి సాయంత్రం క్షేత్రం దగ్గర ట్రాక్టర్లు పెట్టే వాళ్ళం సాయంత్రం మహాసర్పం వచ్చి 84 దేవతామూర్తులకు కాపలాగా ఉండి ఉదయం ఊరేగింపుకు బయలుదేరేటప్పుడు పుట్టలోకి వెళ్ళిపోయేది ఇలా సుమారు 5 మండలాలు కాలి నడకన శివస్వాములు, సేవకులు, భక్తులు సుమారు 54 గ్రామాలు కాలినడకన తిరుగుతూ “ఓం నమఃశ్శివాయః” అనే పంచాక్షరీ మంత్రం జపిస్తూ భవతి భిక్షాందేహి అంటూ భిక్షాటన చేస్తూ 11 రోజులు ఊరేగించాము. బహుశా కలియుగంలో ఇలాంటి అద్భుతమై ఊరేగింపు ఎక్కడా జరగలేదని 84 దేవతా మూర్తుల ఊరేగింపులో దర్శించిన యావత్ భక్తులు పరవశించి పోయేవారు.

విగ్రహాల ప్రతిష్ఠలు, మహాకుంభాభిషేకాలకు ముందుగా గణపతిపూజ, పుణ్యాహవచనం అనంతరం ఎనిమిది దిక్కులలో ఉన్న అష్టదిక్పాలులకు విడివిడిగా అష్టదిక్కులలోనూ ప్రత్యేక పూజలు, హోమాలు, నైవేద్యాలు, కూష్మాండబలి కార్యక్రమాలు చేసి అష్టదిక్పాలులకు శాస్త్రయుక్తంగా శాంతి పూజలు చేసారు. ఇంతటి కార్యక్రమాన్ని అద్భుతంగా చేసారు. ఆ కార్యక్రమా లను చూసి భక్తులు పరవశించిపోయారు.

కరోరమైన దీక్షతో, భక్తితో క్షేత్ర నిర్మాణం పూర్తిచేసాము నాకు తెలియకుండా ఆలోచించకుండా ఆలయాలు, ప్రహారీ గోడలు అద్భుతమైన శిలాఖండాలతో రాజగోపురాలు నిర్మాణం పూర్తిచేసాము. విగ్రహ ప్రతిష్ఠ ముహూర్తం ఆసన్నమైంది. శివాలయంలోకి ధ్వజస్తంభం, అతి బరువైన మహాశివలింగం పాణమట్టం లోపలికి తీసుకువెళ్ళాలి. అప్పుడు గురువులు, పీఠాధిపతులు సాధ్యం కాదని చెప్పినారు. ప్రహారి గోడలు, అంతరాలయం, గర్భాలయం గోడలు పగలుకొడితేనే గాని ఆ మహాశివలింగం పాణమట్టం లోపలికి వెళ్ళదని గురువులు, పీఠాధిపతులు నాకు చెప్పారు. అవన్నీ లోపలకు మోసే సేవకులు కూడా సిద్ధంగా వున్నారు. కాని అందరూలోను ఒకటే భయం ఇరుకు ద్వారాల నుండి సుమారు 1800 కేజీల బరువైనటువంటి మహాశివలిం పాణమట్టం ఇరుకుద్వారాల ద్వారా తీసుకువెళ్ళడం అసంభవమని చెప్పినారు. కాని నేను భయపడలేదు దాని గురించి పూర్తిగా ఆలోచించి స్వామి, అమ్మవార్లపై భారం వేసి మనోధైర్యాన్ని పెంచుకున్నాను. మొదటిగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించాలని పీఠాధిపతులు నిర్ణయించారు దాని ప్రకారం నా భార్యను పిలిచి ధ్వజస్తంభానికి పూజా కార్యక్రమం పూర్తిచేసి ధ్వజస్తంభ ప్రతిష్ఠ ప్రారంభించు అని చెప్పాను. ఆమె అందరూ ధ్వజస్తంభం, శివాలయంలోనికి తీసుకువెళ్ళడం చాలా కష్టమని అంటున్నారు నేను ఏమీ పర్వాలేదు స్వామి, అమ్మవార్ల కరుణాకటాక్షాలు వుంటాయి ఎందుకు భయపడతావుం ప్రతిష్ఠ ప్రారంభించండి అని చెప్పాను అక్కడవున్న భక్తులు, శివస్వాములు “ఓం నమఃశ్శివాయః” అను పంచాక్షరీ మంత్రం జపిస్తూ అఖండమైన ధ్వనితో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పూర్తిచేసారు. పీఠాధిపతులు, గురువులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఏంటీ చాలా కష్టమనుకున్న ధ్వజస్తంభం ప్రతిష్ఠ ఇంత తేలికగా పూర్తయింది అని అడిగారు. ఇక్కడ ప్రతీ పనిలో, ప్రతీ మనిషిలో స్వామి, అమ్మవార్లు ప్రవేశించి కార్యక్రమాన్ని పూర్తిచేసారు. నిజంగా ఇక్కడ ఏదో శక్తి వుంది అని వారియొక్క అభిమతాన్ని వ్యక్తపరచారు.

అతి చిన్న అంతరాలయం ద్వారం, అతిచిన్న గర్భాలయం ద్వారాలనుండి ఇంత పెద్ద మహాశివలింగ పాణమట్టం తీసుకువెళ్ళడం ఎలా అని ప్రశ్నార్థకంగా మారింది. గురువులు, పీఠాధిపతులు ఇంత పెద్ద మహా శివలింగ పాణమట్టాన్ని ప్రతిష్టించాలంటే జరిగేపని కాదు అసలు ఈ ముహూర్తానికి ఈయొక్క శివలింగాన్ని ప్రతిష్టించలేము అలా ప్రతిష్టించాలంటే గుడి ద్వారాలు, గోడలు పగులకొట్టాలి లేదంటే వేరొక చిన్న శివలింగాన్ని ప్రతిష్టించాలి అని సందేహాన్ని నాకు తెలియజేసారు. ఇదే సందేహం క్షేత్ర నిర్మాణం పరిసర ప్రాంతాల్లో భక్తు లకు, సేవకులకు, శివస్వాములకు, శిల్పులకు, పనివారికి గత రెండు, మూడు నెలలుగా ఇదే సందేహం గురించి చర్చించుకొనుచున్నారు. కొంతమంది సలహా అయితే ముందుగా ఈ లింగాన్ని ప్రతిష్టించి గుడి కట్టి ఉండాల్సింది అని సలహా ఇచ్చేవారు ఇప్పుడు ఎలా క్రేన్ ద్వారా లోపలికి తీసుకువెళదామంటే క్రేన్ లోపలికి వెళ్ళదు. ఇంత పెద్ద శివలింగాన్ని మనుషులు ఇరుకు ద్వారాల మధ్య మోయలేరు అను సందేహంలో వున్నప్పుడు నేను గురువులకు, పీఠాధి పతులకు, భక్తులకు, శివస్వాములకు, సేవకులకు పంచాక్షరీ మంత్రం “ఓం నమః శివాయః” పఠిస్తూ మహాశివలింగాన్ని పట్టండి లోపలికి వెళ్ళిపోతుంది అని చెప్పాను. అందరూ ధైర్యంగా, బలంగా మోసుకుంటూ అంతరాలయం వరకూ వెళ్ళారు ఇంక మావల్లకాదు ఈ మహాశివలింగాన్ని లోపలికి తీసుకు వెళ్ళలేము అని అందరూ చెప్పగా దానికి గురువులు, పీఠాధిపతులు కూడా సమ్మతించారు కాని నేను అందరికీ ధైర్యం చెప్పి పీఠాధిపతులకు, గురువులకు ఇప్పుడు మూడు నిముషాల్లో లోపలికి వెళ్లిపోతుంది చూడండి అని శివస్వాములకు, సేవకులకు, భక్తులకు గట్టిగా పంచాక్షరీ మంత్రం “ఓం నమః శివాయః” జపిస్తూ మహాశివలింగాన్ని లోపలికి తీసుకువెళ్ళండి అని వారికి చెప్పి నేను అక్కడే మండపంలో కాశీ విశ్వనాథుడుని, కాశీ అన్నపూర్ణేశ్వరిని తలచు కొని ధ్యానం ప్రారంభించాను నేను ధ్యానం ప్రారంభించిన మూడు నిముషాల్లోపు ఈ మహాశివలింగం పాణమట్టాన్ని “ఓం నమః శివాయః” అను పంచాక్షరీ మంత్రం ధ్యానిస్తూ గర్భాలయంలో భక్తులంతా తీసుకువెళ్ళారు. ఆ మహాశివ లింగం లోపలికి వెళ్ళగానే అక్కడవున్న శివస్వాములు, భక్తులు, సేవకులు, పీఠాధిపతులు కళ్ళల్లో అంతులేని ఆనందభాష్పాలతో, ఆనందంతో పరవశించి పోయినారు. కొంతమంది అయితే ఏంటీ ఈ ఆశ్చర్యం, ఏంటీ ఈ అద్భుతం ఎంతో కష్టతరమైన పనిని ఇంత అవలీలగా ఎలా జరిగింది అని నన్ను ప్రశ్నిస్తే అదే స్వామి, అమ్మవార్ల అనుగ్రహం అని చెప్పాను. ఇది దైవసంకల్పం కాబట్టి దైవానుగ్రహంతోనే పూర్తవుతుంది ఏ విధమైన అవాంతరాలురావు, ఏవిధమైన సందేహాలు అవసరం లేదు. ఈ క్షేత్రం మహిమాన్వితమైనది అని చెప్పాను.

విగ్రహాల ప్రతిష్ఠ, కుంభాభిషేకం కార్యక్రమం 150 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, ఋత్వికులతో 84 దేవతామూర్తుల ప్రతిష్ఠలు 5 రోజులు అద్భుతంగా రంగ రంగ వైభవంగా జరిగాయి మొదటి రోజు సుమారు 20వేల మంది భక్తులు వచ్చారు. రెండవ రోజు సుమారు 15 వేలమంది వచ్చారు. మూడవరోజు సుమారు 10వేల మంది వచ్చారు. 4వరోజు విగ్రహ ప్రతిష్ఠ రోజున 50వేల మంది అంచనా వేసారు కానీ 30 వేల మంది వచ్చారు. 5వ రోజు మహాకుంభాభిషేకం 50వేల మంది వరకూ రావచ్చు అని అన్నదానం ఏర్పాట్లు చేసాము ఉదయం 10-30 ని||లకు కుంభాభిషేకం మొదలు అయ్యింది సుమారు 20వేల మంది మాత్రమే కనిపించారు. నాకు చాలా బాధకలిగింది ఇంత అద్భుతమైన కార్యక్రమానికి భక్తులు రాలేదు అని ఆలోచించుకుంటు న్నాము సుమారు 11-30 ని||లకు చుట్టు గ్రామాలు కూడా ఖాళీలేకుండా 2 నుండి 3 లక్షల మంది కుంభాభిషేకం తిలకించడానికి వచ్చారు. ఇంత జనం ఒకేచోటు నా జీవితంలో చూడలేదు వీరందరికీ దర్శనం ఎలా అనుకున్నాను. నేను చేసిన ఏర్పాట్లు ఎవరికి వస్తాయి వారికి భద్రత ఎలా అనుకున్నాను. ఎమ్.ఎల్.ఎ సైతం 3,4కి||లు నడిచిరావడం ఏంటి అని భయపడి ఒక రూములో కూర్చొని స్వామిని, అమ్మావారలను, స్మరించుకొంటూ ధ్యానం చేసు కుంటూ కూర్చున్నాను. వచ్చిన 2, 3లక్షల మందికి ఏ విదమైన చిన్న చిన్న ప్రమాదాలు కూడా జరగకుండా ఇంత పెద్ద కార్యక్రమం అద్భుతం అని పరమే శ్వరుడు, జగన్మాత దగ్గరుండి సక్రమంగా నడిపించుకున్నారని అనిపించింది. పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వాములు, ఋత్వికులు మేము ఎన్నోవేల కుంభాభిషేకాలు చేసాము గాని ఇంతమంది జనం వచ్చిన ఏ చిన్న అపసృతి జరగకుండా జరగడం దైవ సంకల్పం అని కొనియాడారు. ఈ క్షేత్రాన్ని ఏదో శక్తి నడిపిస్తుంది అని చెప్పారు.

ఈ విగ్రహ ప్రతిష్ఠలు, మహాకుంభాభిషేకం కార్యక్రమాలలో భాగంగా 18 అ॥ల మహాశివలింగాన్ని తాత్కాలికంగా ప్రతిష్ఠించి ఆ శివలింగానికి నేపాల్ నుండి 7,50,000 పంచముఖ రుద్రాక్షాలతో అలంకరించి భక్తులచే పంచా మృతాలు అవకాశం లేకపోతే కనీసం పవిత్ర గంగాజలంతోనైనా అభిషేకాలు, పూజలు చేసేలా ఏర్పాటు చేసాము. ఆ శివలింగం ప్రతిష్టించడానికి భక్తులు గుమిగూడడం వల్ల లారీ క్షేత్రం దగ్గరకు రావడానికి అవకాశం లేకపోతే శివ స్వాములు సుమారు రెండు కిలోమీటర్లు నుండి మోసుకొస్తుంటే ముక్కోటి దేవతలు పరమేశ్వరుడిని మోసుకొస్తున్నట్లుగా భక్తులు ఆనందంతో, భక్తితో ఆ శివస్వాములు పాదాలకు నమస్కారాలు చేస్తుంటే చూసే వారందరూ ఆనందంతో పరవశించిపోయారు. ఆ శివలింగాన్ని ప్రతిష్టించి రుద్రాక్షతో అలంకరించిన భక్తులు అభిషేకాలు, అర్చనలు, పూజలుచేసి అద్భుతమైన ఆనందాన్ని పొందారు. ఇటువంటి కార్యక్రమం ఎక్కడా తిలకించలేదు అని మహామహా పండితులు సైతం కొనియాడారు.

విగ్రహాల ప్రతిష్ఠలు, మహాకుంభాభిషేకం కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత చివరి రోజు సాయంత్రం ఒకేమండపంలో సప్త కళ్యాణాలు. అనగా శివపార్వతులకు, శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామిలకు, సీతారాము లకు, రమాసత్యనారాయణలకు, లక్ష్మీనరసింహస్వామిలకు, వల్లీ దేవసేన షణ్ముకస్వామికి అత్యంత వైభవంగా తిరుకళ్యాణాలు జరిగాయి. ఎక్కడా జరగని విధంగా ఒక మండపంలో విడివిడిగా సప్తకళ్యాణాలను తిలకించి భక్తులు పరవశించిపోయారు. అనంతరం భక్తులు ఊరేగింపుగా స్వామి అమ్మవార్లను మోస్తూ అద్భుతమైన ఆనందాన్ని పొందారు. ఇంతటి మహాకార్యక్రమాన్ని సుమారు 90మంది ఋత్వికులు కనులపండుగగా చేసారు వారికి నా పాదాభి వందనములు.

కుంభాభిషేకం రోజునుండి 23వ రోజు మొదటి మహాశివరాత్రి పర్వ దినము వచ్చింది. ఆ రోజు పరమేశ్వరునికి (మహాశివలింగానికి) నాలుగు కాలాలలో (రోజును 4 భాగాలుగా చేసి) అనుభవజ్ఞులైన వేదపండితులచే నాలుగు వేదాల పఠనంతో నమక చమకాలతో మహన్యాసపూర్వక మహారుద్రాభిషేకం, మహారుద్రహోమం, మహాచండీహోమం, మహా మృత్యుంజయ హోమం 21 మంది అద్భుతమైన ఋత్వికులతో శివపార్వతుల అనుగ్రహంతో కార్య క్రమాలు జరిపించాము. అదే రోజు ఈ భూమండలంలో ఉన్న ప్రతీ కుటుంబా నికి, ప్రతీ జీవికి అన్నప్రసాదానికి (ఆహారానికి) ఇబ్బంది లేకుండా ఉండాలని కనీసం రోజుకు ప్రతీ కుటుంబానికి ఒక కేజీబియ్యం స్వామి అనుగ్రహించాలని సంవత్సరానికి 365 కేజీలు బియ్యాన్ని ప్రతీ కుటుంబానికి అనుగ్రహించాలని సంకల్పించి 365 కేజీల బియ్యంతో అన్నం వండి మహాశివలింగానికి అన్నాభి షేకం అన్ని రకాల కూరగాయలు, అన్నిరకాల పండ్లు, పంచామృతాలతో అత్య ద్భుతమైన అభిషేకం, అలంకరణ చేయడమైనది. వేలాదిమంది భక్తులు తిలకించి అద్భుతమైన అనుభూతిని పొంది పరవశించిపోయారు.

ఈ మహాదైవ సంకల్పానికి సహకరించిన పీఠాధిపతులు సదాశివం స్వామిజీ, సుందర్ గురుకుల్ స్వామిజీ, యం.జి. గణేషన్ స్వామిజీ గార్లకు మరియు శృంగేరీ పీఠం వ్యవస్థాపక జగద్గురు ఆదిశంకరాచార్య పరంపర శిష్యులు పరివ్రాజకాచార్య పరమహంస శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద తీర్థల స్వామి జీకి, సాగర స్వామీజికి, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలకు, నా పాదాభివంద నములు రిటైర్డ్ డి.యస్.పి. శ్రీ పి.యస్ రామమూర్తి గారికి, మాజీ సైనికులు శ్రీ నారపురెడ్డి సుబ్బారావు గారికి నా నమఃసుమాంజలి.

క్షేత్ర నిర్మాణం, యాగశాల నిర్మాణం, హోమశాల నిర్మాణం, పందిర్లు, అన్నదాన ఏర్పాట్లు మొదలగు విగ్రహాల ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేకం కార్యక్రమాలకు పూర్తి సేవా సహకారం అందించిన శ్రీ బత్తుల గోపాలకృష్ణ కుటుంబానికి శ్రీ బత్తుల వెంకట శంకరుడు కుటుంబానికి, శ్రీ యర్రంశెట్టి పోలారావు కుటుంబానికి, శ్రీ దొడ్డా వెంకటేశ్వరరావు కుటుంబానికి శ్రీమతి చీర్ల ధనలక్ష్మి కుటుంబానికి, శ్రీ చీర్ల సత్తిబాబు కుటుంబానికి, శ్రీ గరగ సీతారామయ్య కుటుంబానికి, శ్రీ దేవన నాగేశ్వరరావు కుటుంబానికి, శ్రీమతి యర్రంశెట్టి నాగలక్ష్మి కుటుంబానికి, శ్రీమతి మచ్చా నాగవరలక్ష్మి కుటుంబానికి, శ్రీ బత్తుల అర్జునుడు కుటుంబానికి, శ్రీ బత్తుల రాధాకృష్ణ కుటుంబానికి, శ్రీ గుర్రాల వెంకటరామచలం కుటుంబానికి, శ్రీమద్దిపాటి సుజీవరాజు కుటుంబానికి, ఆకాశపు లక్ష్మీ నారాయణ కుటుంబా నికి, శ్రీ దినకర ప్రసాద్ కుటుంబానికి, దాతల కుుంబాలకు , శివదీక్ష తీసుకుని అద్భుతమైన సేవ చేసినవారి కుటుంబాలకు భక్తితో సేవ చేసిన కుటుంబాలకు పేరు పేరునా నా ప్రత్యేక అభినందనలు మానసికంగా, శారీరకంగా ఎంతో సహకరించి నాలో ఉత్సాహం, ఆనందం ధైర్యం కల్పించి ముందుకు నడిపిం చిన వారందరికి నా ప్రత్యేక అభినందనలు నా ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ఓం శివ శక్తిపీఠంలో ఉన్న సర్వ దేవతా అనుగ్రహంతో సుఖ సంతోషాలు, ధనధాన్యాలు, అప్టైశ్వర్యాలు, ఆయు రారోగ్యాలు మనోవాంఛాఫల సిద్ధితో వారు చేయు వృత్తి, వ్యాపార, ఉద్యోగ, విద్య వ్యవహారాలలో విజయాలు చేకూర్చాలని వ్యవస్థాపక ధర్మకర్త ఆశ్రమ గురుస్వామిగా కోరుచున్నాను.

ఈ క్షేత్రం పూర్తిగా విగ్రహాల ప్రతిష్ఠలు, మహాకుంభాభిషేకం పూర్తి అయిన తరువాత 48వ రోజు వరకూ మండల పూజ కార్యక్రమాలు ప్రతీరోజు అభి షేకాలు హోమాలతో జరిగింది చివరి రోజున అనగా 48వ రోజున మహా పూర్ణాహుతి కార్యక్రమం రోజున ఆరడుగుల ఆజానబాహుడు దైవ స్వరూపంగా దేవతా వస్త్రధారణ నుదుటన విభూదితో తెల్లగా ఉన్న వ్యక్తి ఆయనతో పాటు ఆయన భార్య వచ్చి మహాపూర్ణాహుతి కార్యక్రమానికి వచ్చాము మీరు ఎలా చేస్తారో చూద్దాం అని అన్నారు. వీరు సాక్షాత్తు పార్వతీ, పరమేశ్వరులుగా కనిపించారు వారు దగ్గరుండి మహాపూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపించారు. అనంతరం వారికి వస్త్రాలు, ఆతిథ్యం ఇచ్చి నమస్కరించినాను. దైవసంకల్పం అద్భుతంగా పూర్తయింది. నాయనా కారణ జన్ములు ఎన్ని అడ్డం కులు వచ్చినా సంకల్పాన్ని పూర్తి చేస్తారు. ఈ కలియుగం ఉన్నంత వరకూ ఇలాంటి కార్యక్రమం ఎవ్వరూ చెయ్యలేరు. ఈ అదృష్టం కలియుగంలో మీకు మాత్రమే లభించింది దానిని మీరు పూర్తి చేసారు. మా ఆశీర్వచనాలు మీకు ఎల్లప్పుడు ఉంటాయి. ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతుంది అని వెళ్ళి పోయారు వారి అడ్రస్ చెప్పలేదు ఎక్కడ ఉంటారో తెలియదు తరువాత ఏమి జరిగింది అని ఆలోచించి వారి కోసం వెతికాను కనబడలేదు అంతా స్వామి అమ్మవార్లు కరుణాకటాక్షం అనుకున్నాను.

నా కర్తవ్యం సంకల్పం నెరవేరింది 84 దేవతామూర్తులకు దీపధూప నైవేద్యాలు సక్రమంగా జరుగుతున్నాయి. భవిష్యత్ లో అన్ని పర్వదినాలలో అన్ని కార్యక్రమాలు అద్భుతంగా జరగాలని ప్రయత్నం చేస్తూ పార్వతీపరమేశ్వ రులు మరియు ఓం శివశక్తి పీఠంలో వున్న సర్వదేవతా అనుగ్రహం అందరికీ ఉండాలని ప్రార్థిస్తున్నాను.

ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులకు 12 జ్యోతిర్లింగాలు, 18 అష్టాదశ శక్తి పీఠాలు దర్శించిన అనుభూతితోపాటు ఇష్టదేవతా దర్శనంతో 84 దేవతామూర్తు లను పవిత్ర పుష్కరిణి నక్షత్రవనం, రాశివనం, గ్రహవనం, దేవతావనం, గోశాల, జ్ఞానపిరమిడ్ దర్శనభాగ్యం లభిస్తుంది. ఇలాంటి క్షేత్రం కలియుగంలో ఎక్కడా నిర్మించబడలేదు, భక్తుల సౌకర్యార్థం నిత్య అన్నదానం కూడా ఏర్పాటు కలదు.

ఈ క్షేత్ర దర్శనం ఆనందదాయకం, సర్వమంగళకరం, భక్తిదాయకం, ముక్తిదాయకం, మోక్షదాయకం. ఈ క్షేత్రాన్ని దర్శించినవారికి భూమండలంలో వున్న దేవతామూర్తులను దర్శించినంత అద్భుతమైన అనుభూతిని పొంది, ఓం శివశక్తి పీఠంలో వున్న సర్వదేవతా అనుగ్రహానంతా పొందవలసినదిగా కోరుచున్నాము.

జూన్ 2015లో ఒక మహాపురుషుడు క్షేత్రదర్శనానికి వచ్చారు. నన్ను కలవాలని ఉదయం నుండి సాయంకాలం వరకు వేచి వున్నారు. అనుకోకుండా ఆ రోజు నేను సాయంత్రం క్షేత్రానికి వెళ్ళాను. ఆ స్వామిజీ నన్ను కలిసి మిమ్మల్ని చూడటానికి వచ్చాను నేను గత 14 సంవత్సరాలుగా హిమాలయ పర్వతాలలో నివసించుచున్నాను. అందులో 7 సంవత్సరాలు కఠోరమైన ఆహార పానియాలు కూడా తీసుకోకుండా తపస్సులో వున్నాను అని చెప్పారు. నాకు వారిని చూడగానే జ్ఞానులు అనిపించింది. పొడవాటి జడలతో కూడిన శిరో జాలు, అతిపొడవాటి గడ్డంతో వున్నారు. వారు జన్మతహ బ్రహ్మచారి ఇప్పుడు వారి వయస్సు సుమారు 85 సం||లు వారితో నాకు హిందూధర్మం పై వున్న సందేహాలతో వాదోపవాదానికి దిగాను. ఆవాదనలో నాకు కావలసిన హిందూ ధర్మంపై సందేహాలు తీరేవిధంగా వారు చెప్పారు. వారు చివరగా నన్ను ఒక ప్రశ్న వేసారు. ఈ క్షేత్రం ఎందుకు నిర్మించారు చిన్న వయస్సులో ఆధ్యాత్మికంగా ఎందుకు వెళ్ళాలనిపించింది ఈ క్షేత్రాన్ని ఎలా నిర్మించారు అని ఆ స్వామీజీ నన్ను ప్రశ్నించారు. ఏమో నాకు తెలియదు అని నేను వారికి జవాబు చెప్పాను నిజం కూడా అదే.

అప్పుడు ఆ స్వామిజీ ఈ క్షేత్రం నిర్మాణం ఎందుకు జరిగింది, ఎలా జరి గింది నాకు తెలుసు అని ఆయన చెప్పగానే నాకు ఆశ్చర్యం కలిగింది. ఇప్పటికీ నాకు అర్ధంకానిది వారికి ఎలా తెలుసు అనుకున్నాను. వారికి నమస్కరించి అయితే చెప్పండి స్వామిజీ అని వారిని అర్థించాను. అప్పుడు ఆ స్వామిజీ చెప్పడం ప్రారంభించారు. కృతయుగంలో ఒక మహాముని ఇక్కడ పరమేశ్వరుని కోసం ఘోరమైన తపస్సు చేసినారు. ఆ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ మహాముని ఎల్లవేళలా నా తలపై పార్వతీపరమేశ్వరులు నివసించి భక్తులకు వరాలను ప్రసాదించాలి అని మహాముని కోరుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆ మహామునికి రాబోవు కలియుగంలో నీకోరిక నెరవేరుతుంది ఇక్కడ కైలాస, వైకుంఠ మహా శక్తి క్షేత్రాలు నిర్మించబడి అఖండమైన దైవారాధనతో పూజించబడి భక్తులు అనుగ్రహం పొందుతారు అని వరం ఇచ్చాడు. కాలానికి అనుగుణంగా, యుగాలకు అనుగుణంగా అప్పటినుండి ఆ మహాముని ఇక్కడే భూగర్భంలో వుండి తపస్సు చేయుచున్నారు వారి తలపైనే ఈ మహాక్షేత్రం నిర్మించబడింది. ఆ వర ప్రభావమే ఈ మహా క్షేత్రం అని చెప్పి మిమ్మల్ని కలిసినందుకు ధన్యుడనై నాను అని చెప్పి వారు వెళ్ళిపోయారు.

ఏమిటి ఈ క్షేత్ర నిర్మాణ రహస్యం వెనుక ఇంత చరిత్ర ఉందా దీనికి కృతయుగంలోనే పరమేశ్వరుని వరంతో ఆనాడే పునాది పడిందా మహామునికి ప్రసాదించిన వరాన్ని నేను పూర్తి చేయడానికి కారకుడనయ్యానా అని ఆశ్చర్యంతో అమితమైన ఆనందంతో పరవశించిపోయాను.

భవిష్యత్ లో ఆ పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహిస్తే భవబంధాలను వదిలి సన్యాసిగా ఆధ్యాత్మిక సేవాకార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను.