నవగ్రహ పాశుపతం హోమం ప్రాముక్యత

ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ | గురుశుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః
సృష్టి స్థితి లయ కారకులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనప్పటికీ వారిని సృష్టించినది ఆ ఆదిపరాశక్తి అయినప్పటికీ, ఈ కలియుగం మాత్రం నవగ్రహాధీనంగా చేయబడింది. నవగ్రహాలనేవి మానవుడి గతజన్మ కర్మానుసారం ఆ జీవుడు చేసిన కర్మఫలాలని అనుభవింపచేస్తాయి. సాక్షాత్తు పరమేశ్వరుడు నవగ్రహాధిదేవతగా వున్నప్పటికీ, ఆయన కూడా గ్రహాధీనుడై శనిగ్రహ బాధ భరించక తప్పలేదు. గతజన్మలో మనం చేసే పుణ్యపాప కర్మల ఫలితంగా ఈ జన్మలో ఎన్నో కష్టాలు పడుతూవుంటాం. సుఖాలనూ అనుభవిస్తుంటాం. ఇవన్నీ మనిషి పుట్టింది మొదలు తత్కాల గ్రహస్థితిని అనుసరించి అతడి జాతకలగ్నం, రాశి, నక్షత్రం నిర్ణయించబడి, తదనుగుణంగానే ఆయాగ్రహాల దశలు సంప్రాప్తించటం. ఆయాదశల్లో ఉన్న గ్రహస్థితికి అనుగుణంగా కష్టసుఖాలు అనుభవించటం జరుగుతుంది. ఈ నవగ్రహాలలో ఏ దశలో మనకి ఏ గ్రహం అనుకూలంగా లేదో జ్యోతిషుల ద్వారా తెల్సుకుని, ఆయా గ్రహాలని స్తోత్రాల ద్వారా స్తుతించి ప్రసన్నం చేసుకోవాలి.
విధానం:- పంచామృతాభిషేకం, బిల్వపత్ర అష్టపుష్పపూజ, క్షీరాన్న నివేదన.
ఫలం:- గ్రహానుకూలత. ఉద్యోగం దొరకడం లేదా? దారిద్ర్యం మిమ్మల్ని వెంబడిస్తోందా? లేక వచ్చిన డబ్బు నిలవడంలేదా? డబ్బు మంచినీళ్ళులా ఖర్చవుతోందా? అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఎవరూ మీ మాట వినడం లేదా? అవమానాల పాలవుతున్నారా? ప్రతిరోజూ దెబ్బలు తగులుతున్నాయా? ఆక్సిడెంట్లు అవుతున్నాయా? ఇది ఏలినాటి శనిదోషమా? రాహుమహార్దశా దోషమా? కుజదోషమా? జ్యోతిష్యుడు ఈ విషయము చెప్పి ఉంచకపోవచ్చు. లేదా మీకు ఈ విషయం తెలియకపోవచ్చు. అయినా పై సమస్యలలో ఏ ఒక్క సమస్య మిమ్మల్ని బాధిస్తున్నాసరే మీరు నవగ్రహాలను శాంతపరిచే, దారికితెచ్చే పై పాశుపతప్రయోగం చేయండి మీకష్టం తొలగిపోతుంది..
కేతుగ్రహ ప్రభావము-పరిహారములు:- మానవశిరసు, సర్పదేహం కలిగిన అత్యంత క్రూరమైన సర్పగ్రహం కేతువు. హైందవ జ్యోతిషశాస్త్ర సిద్ధాంతాల ప్రకారంచూస్తే కేతువు ఇంకొక సర్పగ్రహం అయి కుజుడికి ప్రతిబింబమని తెలుస్తున్నది. కేతువుయొక్క శక్తిని వివరించటంకోసం ఆ గ్రహాన్ని కుజగ్రహంతో పోల్చటంమినహా వేరేవిధానం జ్యోతిష పండితులకు ఈనాటికి తెలియకపోవటం విశేషం. పాపగ్రహమైన కేతువు ఒక వ్యక్తి జన్మ కుండలినిలోని ఏ గ్రహంతో కలిసినా ఆ గ్రహంయొక్క శక్తి నశించిపోతుంది. ఫలితంగా ఆ గ్రహం మంచిఫలితాలకు బదులు వినాశనకర ఫలితాలను ఆ జాతకునికి ఇవ్వటం జరుగుతుంది. కొన్నిసార్లు కేతుగ్రహం వ్యక్తుల జాతక చక్రాలలోని అశుభస్థానాలలో ఉన్నపుడు విపరీతమైన చెడుఫలితాలను ఆ జాతకులకు ఇవ్వటం జరుగుతుంది. కేతుగ్రహానికి అధిదేవత చిత్రగుప్తుడు. ప్రత్యధిదేవత బ్రహ్మఅయి ఉన్నారు. కేతువు ఎరుపురంగులో ఉంటాడు. ఆయన వాహనం గ్రద్ద అయి ఉన్నది. ఉలవలు కేతుగ్రహానికి చెందిన ధాన్యంగా చెప్పబడుతున్నది. ఈయనకు ఎర్ర లిల్లీపూలు మరియు అనేక రంగులతో నేసిన వస్త్రము ప్రీతిపాత్రములుగా భావిస్తారు. గోమేధికము అనే రత్నము కేతు గ్రహానికి చెంది ఉన్నది. అన్నంలో ఉలవపొడిని కలిపి కేతువుకి నైవేద్యంగా పెడితే కేతువు అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. జ్యోతిషశాస్త్రంలో కేతుగ్రహ ప్రభావానికి లోబడి ఉండే కొన్ని అంశాలు పేర్కొనబడ్డాయి. అవి ఏమిటంటే మోక్షము, దృష్టి, భూమి, ఆస్తులు, బంగారం, కీర్తి, భార్య, సంతానము, జ్ఞానము, వ్యాపారము, సంతోషము మరియు ఊహించని గాలిపాటు లాభాలు. అశ్వని, మఖ, మూల అనే నక్షత్రాలకు కేతువు అధిపతిగా ఉంటాడు. ఈ మూడు నక్షత్రాలను సర్ప నక్షత్రాలు అని పిలుస్తారు. కేతువు మీనరశి కేతువు యొక్క స్వస్థానమని, కన్యారాశి రాహువు యొక్క స్వస్థానమని జ్యోతిషశాస్త్రం తెలియ జేస్తున్నది. కేతువు జాతకులకు ఆకస్మికంగా చెడు లేదా మంచిని చేస్తాడు. జాతకచక్రంలో కేతువు మంచి స్థానాలలో ఉంటే మంచి, చెడు స్థానాలలో ఉంటే చెడు చేస్తాడని గుర్తించాలి. కేతువు చంద్రగ్రహణానికి కారకుడు అవుతాడు. రాహువు సూర్యగ్రహణానికి మూలం అవుతాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశానికి చెందిన వరాహమిహిరుడు అనే ఖగోళశాస్త్రజ్ఞుడు తన బృహత్ సంహిత అనే గ్రంధంలో గ్రహణాలు ఎప్పుడూ వస్తాయో లెక్కించే విధానాలను వ్రాయటం జరిగింది. దశమహావిద్యలలో ఒకటిగా పేర్కొనబడే ధూమవతి కేతువుకు తల్లిగా చెప్పబడుతున్నది. కాలసర్పదోషంతో బాధ పడుతున్నవారు ధూమవతినిగాని, చినమస్తానుకాని ఆరాధించినట్లయితే ఆ దోషం తొలగిపోతుందని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు. కేతు జన్మవృత్తాంతము: కొన్ని యుగాల క్రితం దేవదానవులు అమృతం పొందటంకోసం పాల సముద్రాన్ని మధించాలని నిర్ణయించుకున్నారు. అంతటి మహా సముద్రాన్ని చిలకటంకోసం మంధర పర్వతాన్ని చిలికే కవ్వంగా వాసుకి అనే మహాసర్పాన్ని ఆ కవ్వానికి తాడుగా చేసుకుని వందలాదిమంది రాక్షసులు వాసుకి తోకను వేలాదిమంది దేవతలు వాసుకి శిరస్సును పట్టుకుని పాలసముద్రాన్ని చిలకాలని బ్రహ్మదేవుడు నిర్ణయించాడు. మూర్ఖులు మరియు దురహంకారులు అయిన రాక్షసులు పాముతోకను పట్టుకోవటానికి ఇష్టపడక శిరస్సును పట్టుకుంటామని బ్రహ్మదేవుడితో వాదించారు. గొప్పవారైన తాము మాత్రమే సర్పశిరస్సును పట్టుకోవాలని తమకన్నా తక్కువవారైన దేవతలు పాము తోకను పట్టుకోవాలని రాక్షసులు పట్టుపట్టారు. ముందుచూపుగల దేవతలు తామే తోకవైపు ఉండటానికి సిద్ధపడ్డారు. క్షీరసాగర మధనం ప్రారంభం అయ్యింది. సముద్రంలో ఉన్న మంధర పర్వతాన్ని చుట్టుకున్న వాసుకి సర్పాన్ని దేవదానవులు చెరొకవైపు గుంజుతున్నపుడు తీవ్రమైన ఒత్తిడికి గురైన వాసుకి మహాభయంకరమైన విషజ్యాలలను తన శిరస్సు నుండి బయటకి కక్కటం ప్రారంభించాడు. ఫలితంగా ఆ సర్పం తలవైపు ఉన్న రాక్షసులు ఆ విషజ్యాలలకు గురై గుంపులు గుంపులుగా చనిపోవటం ప్రారంభించారు. రాక్షసుల సంఖ్య అపరిమితంగా ఉన్న కారణంగా వాసుకి శిరస్సును పట్టుకుని లాగుతున్న రాక్షసులు చనిపోయినపుడు ఆ స్థానంలో కొత్త రాక్షసులు వచ్చి కవ్వంతాడుగా ఉన్న వాసుకి శిరస్సును పట్టుకుని లాగటం జరిగింది. తోకవైపు ఉన్న దేవతలు క్షేమంగా ఉండిపోయారు. ఆ తరువాత ఆ సముద్ర మధనంలో మొదట ప్రళయ భీకరమైన హాలాహలం అనే విషజ్వాలలుపుట్టాయి. వాటి ధాటికి భయపడిన దేవదానవులు రక్షించమని పరమశివుడి శరణుకోరారు. లయకారకుడైన పరమశివుడు ఆ హాలాహలాన్ని తన చేతులోకి తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అతి భయంకరమైన ఆ హాలాహలం ఉదరంలోకి వెళితే ప్రమాదం కనుక దానిని తన గొంతులోనే భద్రపరచాడు. ఫలితంగా ఈశ్వరుడి గొంతు నీలంరంగులోకి మారింది. ఆనాటి నుండి ఆయన నీలకంఠుడని, గరళకంఠుడని పిలువబడ్డాడు. (గరళం అంటే విషం అనిఅర్ధం). ఆ తరువాత శ్రీమహావిష్ణువు సముద్రంనుండి పుట్టిన అమృతాన్ని దేవదానవులకు పంచటంకోసం మోహినీ అవతారాన్ని ధరించి తన మాయాజాలంతో రాక్షసులకు ఒకచుక్క అమృతంకూడా దక్కకుండాచేసి మొత్తం అమృతాన్ని దేవతలకే పంచిపెట్టాడు. అయితే మాయావి అనే రాక్షసుడు మోహినీ చేస్తున్న మోసాన్ని గమనించి తానుకూడా దేవతల రూపాన్ని ధరించి దేవతలతో కలిసి మోహినీ పోస్తున్న అమృతాన్ని నోట్లోపోసుకున్నాడు. మాయారూపంలో ఉన్న రాక్షసుడిని గుర్తించిన సూర్యచంద్రులు ఆ విషయాన్ని శ్రీమహావిష్ణువుకి తెలియ జేసారు. ఫలితంగా ఆయన అమృతాన్ని మ్రింగబోతున్న ఆ రాక్షసుడి శిరస్సును తన సుదర్శనచక్రంతో ఖండించాడు. అప్పటికే అమృతం ఆ రాక్షసుడి శరీరంలోని ఛాతీవరకు చేరిన కారణంగా ఆ రాక్షసుడు మరణించలేదు. ఆ తరువాత ఆ రాక్షసులయొక్క శిరస్సు రాహువుగాను, శరీరం కేతువుగాను మారి అంతరిక్షంలో సంచరిస్తూ తరచుగా సూర్య చంద్రులను మ్రింగటం జరుగుతుంది. ఈ సంఘటననే సూర్యగ్రహణమని, చంద్రగ్రహణమని పిలుస్తారు. ఆ తరువాత బ్రహ్మదేవుని యొక్క వరప్రభావంవల్ల రాహుకేతువులు నవగ్రహాలలో సభ్యులుగా పూజలందుకోవటం ప్రారంభించారు. జోతిషశాస్త్ర సూత్రాలప్రకారం చూసినట్లయితే రాహువు శనిగ్రహానికి ప్రతినిధిగా ఉంటాడని కేతువు కుజగ్రహానికి ప్రతిరూపంగా ఉంటాడనీ తెలుస్తున్నది. కేతువు కారణంగా మానవులకు చోరభయం, దురలవాట్లు, ఆస్తినష్టం, పాముకాట్లు, పరువుపోవటం, కుష్టరోగం రావటం, సంతాననష్టం లాంటి చెడుపరిస్థితులు ఎదురవుతాయి. కేతువుని పూజించటంవల్ల ఈ పీడలు తొలగిపోతాయని గుర్తించాలి. రాహువు లాగానే కేతువుకూడా ఒక ఛాయాగ్రహమే అని గుర్తించాలి. రాహు కేతువులు ఎల్లప్పుడు సమ సప్తకంలో అనగా 180 డిగ్రీల దూరంలో ఉంటారని గ్రహించాలి. కేతువుకూడా అపసవ్యదిశలో అనగా వెనక్కి ప్రయాణిస్తూ ఉంటుంది. చంద్రుడు, భూమి మరియు సూర్యుడు ఒకే లాంగిట్యూడ్ మీదకు వచ్చినపుడు వచ్చే చంద్రగ్రహణం కేతువు ద్వారా జరుగుతున్నట్టుగా గుర్తించాలి. కేతువు మోక్షకారకుడు అని జ్యోతిషశాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కేతువు యొక్క అనుగ్రహం ఉన్న మానవులు మానవాతీత శక్తులను మరియు తాంత్రిక శక్తులను కలిగి ఉంటారు. అంతేకాక వీరు భూత, ప్రేతాలను చూడగలిగే శక్తినికూడా కలిగి ఉంటారు. వైద్యం జ్యోతిషశాస్త్రం ఔషధతయారీ పరిశ్రమ కేతువుకు చెందినవని గుర్తించాలి. కేతువు పొగరంగులో ఉంటాడు. శనివారం కేతువుకి ప్రీతికరమైన రోజు. పిల్లికన్నురాయి లేదా వైఢూర్యం కేతువుకి సంబంధించిన రక్తం అయిఉన్నది. కేతువు ఇష్టదైవం భైరవుడు. రాహువు మనస్సుని బాధించగా, కేతువు శరీరాన్ని బాధిస్తాడు. కేతువు కారణంగా కుష్టు, కాన్సర్, పక్షవాతం లాంటి వ్యాధులు వస్తాయి. రక్తహీనత, కీళ్ళనొప్పులు, నరాల సంబంధ వ్యాధులు కేతువు కారణంగానే సంక్రమిస్తాయని జ్యోతిషశాస్త్రం తెలియజేస్తున్నది.
కుజగ్రహ ప్రభావములు - పరిహారములు :- కుజ అంటే మండుతున్న బొగ్గు అని, ఎరుపుఛాయలో ఉన్న వ్యక్తి అని అర్ధం. యుద్ధానికి అధిదేవతగా చెప్పబడే సుబ్రహ్మణ్యస్వామికి మరియు కుజుడికి సంబంధం ఉన్నట్టుగా పురాణాల ద్వారా తెలుస్తున్నది. కార్తికేయుడులో ఉన్న బలము, ధైర్యము మరియు ప్రార్ధించినవారిని రక్షించే సామర్ధ్యము కుజునిలో కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నది. కొంతమంది అభిప్రాయం ప్రకారం ‘కు’ అనగా భూమి అని ‘జ’ అనగా జన్మించిన అని మరియు కుజ అనగా భూమినుండి జన్మించినవాడు అని తెలుస్తున్నది. కుజుడు సమస్త గ్రహాలకు సేనాధిపతిగా ఉంటాడని జ్యోతిషశాస్త్రంలో పేర్కొనబడింది. వ్యక్తులలోని పోరాటపటిమకు, స్వతంత్రాన్ని కోరుకునే స్వభావానికి కుజుడే కారకుడు అవుతున్నాడు. కొంతమంది జ్యోతిష పండితులు మంగళవారం రోజున జన్మించినవారికి కుజుడుయొక్క లక్షణాలు అధికంగా ఉంటాయని చెబుతూ ఉంటారు. కానీ ఇది నిజంకాదు. ఒకవ్యకి జాతకంలో కుజుడు మంచిస్థానాలలో ఉన్నపుడు మాత్రమే, కుజుని యొక్క మంచి లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. కుజుడు ఒకవ్యక్తి జాతకచక్రంలో ఏ స్థానంలో ఉండే ఆవ్యక్తీ ఎలాంటి స్వభావం కలవాడు అవుతాడో క్లుప్తంగా తెలుసుకుందాం... 1. లగ్నంలో కుజుడు ఉన్నట్లయితే ఆవ్యక్తి చిన్న చిన్న విషయాలకు కూడా తగాదాలు ఆడుతూ ఉంటాడు. తోటి మానవులతో ఉండే సంబంధ బాంధవ్యాలలో తన ఆధిపత్యం అధికంగా ఉండాలని భావిస్తూ ఉంటాడు. ఒకవ్యకి జన్మకుండలిని లోని లగ్నం లేదా లగ్నభావం ఆ వ్యక్తియొక్క శారీర నిర్మాణాన్ని, ఆరోగ్యాన్ని సూచిస్తుంది. బలానికి ప్రతీక అయిన కుజుడు లగ్నంలో ఉన్న వ్యక్తి మంచి ఆరోగ్యాన్ని, బలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. అంతే కాకుండా ఆ వ్యక్తి మాట్లాడే విధానం దూకుడుగా ఉంటుంది. మృతుత్వం ఉండదు. అంతేకాకుండా లగ్నంలో కుజుడు ఉన్న జాతకుడు మొండిపట్టుదలని, పగపట్టే స్వభావాన్ని కలిగి ఉంటాడు. లగ్నంలో ఉన్న కుజునియొక్క నాల్గవదృష్టి (ఫోర్త్ యాస్పెక్ట్) కుటుంబ స్థానమైన చతుర్ధస్థానం పై పడటంవల్ల జాతకునికి కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. అంతేకాకుండా కుజునికి ఉన్న ఏడవ దృష్టి లగ్నం నుండి ఏడవస్థానంపై పడటం వల్ల ఏడవస్థానం (సప్తమస్థానం/కళత్ర స్థానం) ఆ జాతకుని లేదా జాతకురాలి యొక్క వైవాహిక జీవితం నిరంతరం ఆందోళనలతో కొనసాగుతుంది. అంతేకాకుండా దంపతుల మధ్య తరచుగా అభిప్రాయ భేదాలు రావటం ఆ తరువాత అవి పెరిగి పెద్దవయి ఆ దంపతులు విడిపోయేదాకా జరుగుతుంది. అంతేకాకుండా కుజునియొక్క సంపూర్ణదృష్టి అష్టమస్థానంపై పడటంవల్ల జాతకుని యొక్క లేదా జాతకురాలి యొక్క జీవిత భాగస్వామికి మరణభయం వెంటాడే అవకాశం ఉంటుంది. 2. ఒకవ్యక్తి జాతకచక్రంలోని రెండవ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే ఆ వ్యక్తి దురుసుగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఒక వ్యక్తి జాతకంలోని రెండవస్థానం ఆ జాతకునియొక్క బంధువుల్ని మరియు సంపదల్ని సూచిస్తుంది. రెండవ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే ఆ జాతకునికి బంధువులతో విరోధాలు రావటం సంపదలు కోల్పోవటం జరుగుతుంది. అంతేకాకుండా రెండవ స్థానంలో ఉన్న కుజుడు ఐదవ, ఎనిమిదవ మరియు తొమ్మిదవ స్థానాలను చూస్తాడు. ఫలితంగా జాతకునియొక్క సంతానంపై కుజునియొక్క చెడు ఫలితం పడుతుంది. 3. ఒకవ్యక్తి జాతకచక్రంలోని నాల్గవ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే ఆ వ్యక్తి విపరీతమైన ఉద్వేగ స్వభావాన్ని కలిగి ఉంటాడు. అందువలన చేసే ఉద్యోగంలో లేదా వ్యాపారంలో ఇతరులతో తగాదా పడుతూ వృత్తిపరమైన చిక్కులను తరచుగా ఎదుర్కొంటూ ఉంటాడు. నాల్గవ స్థానంలో ఉన్న కుజుడు జన్మకుండలినిలోని 7, 10, 11వ స్థానాలను వీక్షిస్తాడు. ఫలితంగా జాతకునికి స్థిరమైన సంపద ఉన్నప్పటికీ జీవితం కష్టాలతోకూడి ఉంటుంది. ముఖ్యంగా నాల్గవ స్థానంలో ఉన్న కుజుడు సప్తమ స్థానాన్ని వీక్షించటం వల్ల ఆ జాతకుని వివాహ జీవితం కల్లోలంలో పడుతుంది. అయితే నాల్గవ స్థానంలో ఉన్న కుజుని వల్ల మరణభయం మాత్రం ఉండదు. 4. ఒకవ్యక్తి జన్మకుండలినిలోని ఏడవ స్థానంలో కుజగ్రహం ఉ న్నట్లయితే ఆ వ్యక్తి విపరీతమైన శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటాడు. మరియు కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగి ఉంటాడు. ఒకవ్యక్తి జాతకచక్రంలోని ఏడవస్థానంలో కుజుడు ఉండటంవల్ల ఆ జాతకునికి అనారోగ్యకరమైన జీవితభాగస్వామి లభించటం జరుగుతుంది. అంతేకాకుండా అటువంటి గ్రహస్థితి ఉన్న జాతకుడు లేదా జాతకురాలికి వచ్చే జీవితభాగస్వామి ఉద్రేకస్వభావాన్ని, నోటి దురుసును, దూకుడుతనాన్ని కలిగి ఉండటం జరుగుతుంది. ఒక ముఖ్య విషయం ఏమంటే సప్తమ స్తానంలో ఉన్న కుజుడు లగ్నాన్ని చూస్తాడు అందువలన ఆ వ్యక్తి యొక్క సంపద మరియు ఉద్యోగము సమస్యల్లో పడతాయి. అంతేకాకుండా లగ్నానికి ఏఏ అంశాలు చెందిఉంటాయో ఆ అంశాలన్నీ కుజునియొక్క సప్తమ దృష్టివల్ల నాశనం అవుతాయి. సపము స్థానంలో కుజుడు ఉండటంవల్ల జాతకుని జీవిత భాగస్వామికి మరియు సంతానానికి తీవ్ర ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఎవరి జాతకంలో అయినా సప్తమ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా కుజదోష పరిహారాలను చేయించుకోవాలి. 5. ఒకవ్యక్తి జాతకచక్రంలోని 8వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే ఆ వ్యక్తి యొక్క జీవిత భాగస్వామి అకాలమృత్యువుపాలు కావటం జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క జన్మకుండలినిలోని 8వ స్థానం ఆయుర్దాయాన్ని, సుఖదు:ఖాలను, జీవితంలో జరిగే వివిధ రకాల సంఘటనలను సూచిస్తాయి. అలాంటి ముఖ్యమైన స్థానంలో కుజుడు ఉండటం వలన జాతకునికి దాంపత్య సుఖం ఉండకపోవటం నిరంతరం మానసిక అశాంతి ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా ఇలాంటి గ్రహస్థితి ఉన్న జాతకుడు తక్కువ ఆదాయంతో నిరంతరం తగాదాపడే జీవిత భాగస్వామితో నరకం అనుభవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎనిమిదవ స్థానంలో కుజుడు ఉన్న జాతకుడు లేదా జాతకురాలు ఏదో ఒకవిధమైన అనారోగ్యాన్ని కలిగి ఉండి జీవితభాగస్వామికి శృంగార సుఖాన్ని ఇవ్వలేకపోవటం జరుగుతుంది. అంతేకాకుండా ఎనిమిదవ స్థానంలో కుజుడితోపాటు ఏవైనా శుభగ్రహాలు ఉన్నట్లయితే అవికూడా అష్టమ కుజుడు వల్ల పాపగ్రహాలుగా మారతాయి. 6. ఒక వ్యక్తి జాతకచక్రంలోని 12వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే అతడు ఆర్ధిక నష్టాలు పొందుతాడు. అనేకమంది శత్రువులను కలిగి ఉంటాడు. కోపాన్ని అణుచుకునేవాడు అయి ఉంటాడు. జాతకుని యొక్క జన్మకుండలినిలోని 12వ స్థానం సంతోషాన్ని, ప్రయాణాలను, విశ్రాంతిని, వ్యయాన్ని, దాంపత్య జీవిత సుఖాన్ని సూచిస్తుంది. ఎవరి జాతకంలో అయినా 12వ స్థానంలో అనగా వ్యవభావంలో కుజుడు ఉన్నట్లయితే ఆ జాతకుడు లేదా జాతకురాలు తన భాగస్వామిపట్ల నిర్లక్ష్యాన్ని, కఠినత్వాన్ని ప్రదర్శించటం జరుగుతుంది. మరియు ఆ జాతకుడు లేదా జాతకురాలి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. 12వ స్థానంలో ఉండే కుజుడు జాతకుడు లేదా జాతకురాలియొక్క కామాన్ని విపరీతంగా పెంచుతాడు. ఫలితంగా ఆ జాతకులు అన్య పురుషుల లేదా స్త్రీల అందానికి ఆకర్షితులై వారితో శృంగార జీవితాన్ని పంచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో వారు తమ జీవిత భాగస్వామిని దెబ్బతియ్యటానికి కూడా వెనకాడరు. అంతేకాకుండా వ్యయస్థానంలో కుజుడు ఉన్న జాతకులకు లైంగిక సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి తెలియని విషయం ఏమంటే కేవలము కుజగ్రహం వల్లనే కాక, రాహువు, శని మరియు సూర్యుడు అనే గ్రహాల ద్వారా కూడా కుజదోషానికి సమానమైన దోషం ఏర్పడుతుంది. అది ఎలాగంటే ఒక జాతకునియొక్క జన్మకుండలినిలోని లగ్నం/2/4/7/8/12వ స్థానాలలో రాహువుకాని, కుజుడు, శని, సూర్యుడు కాని ఉండి పైన పేర్కొన్న ఆరుస్థానాలలో కాకుండా మిగిలిన 3/5/9/10/11 స్థానాలలో కుజుడు ఉంటే మాంగలిక్ అనగా అంగారక దోషానికి సమానమైన దోషం ఆ జాతకునికి ఏర్పడుతుంది. అందువలన ఇలాంటి గ్రహ స్థితి ఉన్న జాతకులుకూడా వివాహ సంబంధమైన దోషాలు తొలగించుకోవటం కోసం తత్-సంబంధిత దోషాలకు పరిహారాలు జరిపించాల్సి ఉంటుంది. కుజదోషం ఉన్న స్త్రీ, పురుషులకు జీవితంలో ఏవిధమైన పరిస్థితులు ఎదురవుతాయో జ్యోతిషశాస్త్రంలో పేర్కొనబడింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. 1. కుజదోషం ఉన్న జాతకులకు వివాహం కావటం చాలా ఆలస్యం అవుతుంది. 2. వివాహ జీవితం చాలా సమస్యలతో కూడి ఉంటుంది. 3. దంపతుల మధ్య తరచుగా తగాదాలు వస్తూ ఉంటాయి. 4. దంపతుల మధ్య ఒకేరకమైన ఆలోచనా విధానం లేకపోవటం వల్ల అభిప్రాయ భేదాలు తలెత్తుతూ ఉంటాయి. 5. దంపతులు విడిపోయే అవకాశం ఉంటుంది. 6. జీవిత భాగస్వామి అకాలమృత్యువు పొందే అవకాశం కూడా ఉంటుంది. మంగల్ దోషం లేదా కుజదోషం ఉన్న వ్యక్తులు కేవలము వివాహ జీవితంలోనే కాకుండా సాధారణ జీవితంలో కూడా అనేక రకాల చిక్కులు ఎదుర్కోవలసి ఉంటుంది. కుజదోషం ఉన్న వ్యక్తులు 1. విద్యాపరంగా అభివృద్ది వెనకపడుతుంది. 2. వృత్తి వ్యాపారాలలో చిక్కులు ఏర్పడతాయి. సరైన ఉద్యోగము లేదా వ్యాపారము లభించవు. 3. ఒకవేళ ఏదైనా ఉద్యోగం లభించినా అనేక సమస్యలు ఏర్పడతాయి. అలాగే వ్యాపారం చేసేవారికి ఏదో ఒక సమస్య ఏర్పడి ఆ వ్యాపారాన్ని మూసివేయవలసి రావచ్చు. 4. కుజదోషం ఉన్న వారికి సంతానం కలగటం ఆలస్యం అవటం మరియు గర్భస్థితిలోనే సంతానం నశించిపోవటం జరుగుతుంది. జ్యోతిషశాస్త్ర పితామహుడైన పరాశరమహర్షి వ్రాసిన బృహత్ పరాశర హోరాశాస్త్రంలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం చూస్తే ఒక స్త్రీ జాతకంలోని లగ్నము/4/7/8/12వ స్థానాలలో కుజగ్రహం ఉండి దానిపై ఏ శుభగ్రహముయొక్క దృష్టి లేకుండా ఉన్నా లేదా కుజునితో పాటుగా ఆ స్థానంలో ఏ శుభగ్రహమూ లేకున్నా ఆ స్త్రీయొక్క భర్త తప్పనిసరిగా అకాలమృత్యువు ఖచ్చితంగా పొందుతాడు. ఒకవ్యక్తి జాతకచక్రంలోని 1/2/4/7/8/12వ స్థానంలో లేదా చంద్రుడు ఉన్న రాశి నుండి 2/4/7/8/12వ స్థానాలలో కుజుడు ఉన్నట్లయితే ఆ జాతకునికి లేదా జాతకురాలికి కుజదోషం ఉంటుంది. కుజుడికి అంగారకుడు, మంగళుడు అన్న పేర్లు కూడా ఉన్నాయి. జాతకచక్రంలో కుజుడు అశుభస్థానాలలో ఉన్నపుడు జాతకులకు ఏర్పడే దోషాన్ని కుజదోషమని, అంగారకదోషమని పిలుస్తారు. కుజ దోషంతో జన్మించిన వ్యక్తిని ఉత్తర దేశ జ్యోతిషంలో మాంగలిక్ అని పిలుస్తారు. నవగ్రహాలలో ప్రముఖ గ్రహంగా పేర్కొనబడే కుజుడు ధైర్యానికి, బలానికి, శక్తికి, దూకుడుతనానికి కారకుడుగా ఉంటాడు. కుజుడిని యుద్ధానికి అధికారిగా పేర్కొంటారు. కుజుడు కారణంగా మానవులకు జ్యోతిషశాస్త్రంలో పేర్కొనబడిన పంచమహాపురుష యోగాలలో ఒకటైన రుచికయోగం ఏర్పడుతుంది. కుజుడు మేషరాశికి మరియు వృశ్చికరాశికి అధిపతిగా ఉంటాడు. మకరంలో కుజుడు ఉచ్ఛస్థానంలో ఉంటాడు. కర్కాటకరాశిలో కుజుడు నీచస్థితిలొపడి బలహీనుడు అవుతాడు. చంద్రుడు, సూర్యుడు మరియు బృహస్పతి (గురువు) కుజునికి మిత్రగ్రహాలుగా గుర్తించాలి. ఒకవ్యకి జాతకంలో కుజుడు బలంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ధైర్యవంతుడు, బలవంతుడు అపారమైన శక్తిగలవాడుగా ఉంటాడు. అయితే ఎవరి జాతకంలో అయినా కుజుడు చెడు స్థానాలలో ఉన్నట్లయితే ఆ వ్యక్తియొక్క వైవాహిక జీవితము, సామాజిక జీవితము మరియు బంధువులతో ఉండే సంబంధాలు సమస్యలతో కూడి ఉంటాయి. కొన్నిసార్లు కుజదోషం ఉన్న వ్యక్తి యొక్క జీవిత భాగస్వామి (భార్య/భర్త) అకాలమృత్యువు పాలు కావటం జరుగుతుంది. అయితే ఎవరైనా మంగళవారంనాడు జన్మించి నట్లయితే వారికి కుజదోషం ఉన్నా చెడు ఫలితాలు అంతగా ఉండవు. అంతేకాకుండా కుజదోషం ఉన్న స్త్రీ, పురుషలకు వివాహం చేసినట్లయితే వారికి ఉండే కుజదోషం ఎంతమాత్రం హానిచెయ్యకపోవటం విశేషం. ఈ క్రింద పేర్కొన్న పరిస్థితులలో వ్యక్తుల జాతకాలలో ఉండే కుజదోషం బలహీనమైపోతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కొంతమంది జ్యోతిష పండితుల అభిప్రాయం ప్రకారం కుజుడు ఒకవ్యక్తి జాతకచక్రంలోని సింహం, కర్కాటకం, ధనస్సు మరియు మీనరాశులలో ఉన్నట్లయితే ఆ వ్యక్తికి కుజదోషం ఎంతమాత్రం వర్తించదు. కారణం రవి, చంద్ర మరియు గురువులు కుజుడికి మిత్రులు కావటమే అని గ్రహించాలి. ఎ) ఒకవ్యక్తి జాతకచక్రంలో కుజుడు తన స్వీయరాశి అయిన మేషరాశిలోకాని ఉచ్ఛంలో ఉండే మకరరాశిలోకాని ఉన్నట్లయితే ఆ వ్యక్తికి కుజ దోషం ఉన్న ఎలాంటి చెడు ఫలితమూ ఉండదు. బి) ఒకవ్యక్తి జాతకచక్రంలో కుజుడు ద్వితీయస్థానంలో ఉండి ఆ స్థానం మిధునం లేదా కన్యారాశి అయినట్లయితే కుజదోషం నిర్వీర్యం అవుతుంది. సి) ఒకవ్యక్తి జాతకచక్రంలో కుజుడు సప్తమస్థానంలో ఉండి ఆ స్థానం కుజుడికి ఉచ్చస్థానం అయిన మకరరాశి అయిన లేదా కుజుడు బలహీనపడే కర్కాటకరాశి అయిన ఆ జాతకుడికి కుజదోషం అంటదు. డి) ఒకవ్యక్తి జాతకచక్రంలో కుజుడు ఎనిమిదవ స్థానంలో ఉండి ఆ స్థానం మీనరాశి అయినట్లయితే కుజదోషం ఉండదు. ఇ) ఒకవ్యక్తి జాతకచక్రంలో కుజుడు 12వ స్థానంలో ఉండి ఆ స్థానం వృషభం లేదా తుల అయినట్లయితే ఆ వ్యక్తికి కుజదోషం వర్తించదు. కర్కాటక మరియు సింహ లగ్నములలో జన్మించిన జాతకులకు కుజుడు యోగకారకుడు అవుతాడు కనుక ఆ జాతకాలలో కుజదోషం ఉన్న అది చెడు ప్రభావం ఎంతమాత్రం చూపించలేదు. కుంభలగ్నంలో జన్మించిన జాతకుని జాతకచక్రంలోని 4 లేదా 8వ స్థానంలో కుజుడు ఉన్నా ఆ జాతకునికి కుజదోషం ఉండదు. ఒకవ్యక్తి జాతకచక్రంలోని లగ్నంలో శుభగ్రహాలైన గురువు లేదా శుక్రుడు ఉన్నట్లయితే ఆ జాతకంలో కుజదోషం ఉన్నా చెడు ఫలితాలు రావు. ఒకవ్యక్తి జాతకచక్రంలోని కుజుడు గురువు లేదా, చంద్రుడితో కలిపి ఒకే రాశిలో ఉన్నా లేదా కుజుడి పై గురువు లేదా చంద్రునియొక్క దృష్టి పడ్డా ఆ జాతకునికి కుజదోషం ఉండదు. ఒకవ్యక్తి జాతకచక్రంలోని కుజుడు రవి/బుధ/శని/రాహు గ్రహాలతో కలిసి ఒకేరాశిలో ఉన్నా లేదా కుజునిపై ఈ నాలుగు గ్రహాలలో ఏ ఒక్క గ్రహంయొక్క దృష్టిపడ్డా ఆ జాతకునికి కుజదోషం ఎంతమాత్రం ఉండదు. కొంతమంది విమర్శకుల అభిప్రాయం ప్రకారం చూసినట్లయితే 28 సంవత్సరాలు వయస్సు దాటిన స్త్రీ, పురుషులకు కుజదోషం ఉండదని తెలుస్తున్నది. కుజదోష ప్రభావం వల్ల వివాహంకాని యువతీ యువకులు ఈ క్రింద పేర్కొన్న పరిహారాలను చేసుకున్నట్లయితే వారికి ఉన్న కుజదోషం తొలగిపోయి అతి త్వరలో వివాహయోగం పడుతుంది. ఆ పరిహారాలు ఏవంటే... 1. ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళి ఆయనకు 108 తమలపాకులతో ఆకుపూజ చేయించాలి. ఇలా తొమ్మిది మంగళవారాలు చేయించి నట్లయితే ఎంత తీవ్రమైన కుజదోషం ఉన్నా తొలగిపోతుంది. అంతేకాకుండా 21 రోజులపాటు ప్రతిరోజూ ఉదయం హనుమాన్ చాలీసాని పారాయణ చేస్తూ ఉండాలి. 2. కుజదోషం ఉన్నవారు తమ పూజా మందిరంలో కేసరీయ గణపతి విగ్రహాన్ని (ఆరంజి రంగులో ఉండే గణపతి విగ్రహం) ఉంచి దాన్ని గంధపు అక్షంతలతో పూజించాలి. అందువల్ల కుజదోషం తొలగిపోతుంది. 3. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని మంగళవారంనాడు దర్శించి స్వామికి ఒక ఎర్ర గుడ్డలో కందులను మూటకట్టి ఆలయ పూజారికి లేదా ఒక పురోహితునికి దానం ఇవ్వాలి. ఫలితంగా కుజదోషం తొలగిపోతుంది. 4. ఏడు మంగళవారాలుపాటు సుబ్రహ్మణ్యస్తోత్రం మరియు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించాలి. ప్రతి మంగళవారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉన్న కాలంలో ఏడుసార్లు వీటిని పఠించాల్సి ఉంటుంది. ఏడవ మంగళవారం కందుల్ని ఆంజనేయ లేదా సుబ్రహ్మణ్య ఆలయపూజారికి దానం ఇవ్వాలి. 5. కొంతమంది జాతకాలలో కుజదోషం అత్యంత తీవ్రంగా ఉండి వారిపై చెడు ఫలితాలను చూపిస్తుంది. అలాంటివారు తమిళనాడులోని వైదీశ్వరన్ కోయిల్ ఆలయానికి కృత్తికానక్షత్రం ఉన్న రోజునకాని, షష్టి తిధినాడుకానివెళ్ళి అక్కడ వెలసిన స్వామికి అభిషేకం చేయించాలి. ఆ తరువాత ఎరుపురంగులో ఉండే ఆహార పదార్ధాలను, రొట్టెలను, పాలను కుక్కలకు ఆహారంగా ఇవ్వాలి. 6. సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామికి పూజలుచేసి ఆ తరువాత ఎర్రటి పండ్లను, పూలను మరియు ఎర్రటి వస్త్రాలను ఆ ఆలయ పూజారికి దానం ఇవ్వాలి. 7. కుజదోషం ఉన్నవారు తమ జీవితకాలమూ శుద్ధమైన మరియు తొమ్మిది కారెట్లు బరువు ఉన్న పగడాన్ని చూపుడువేలికి ధరించటం మంచిది. 8. మంగళవారంనాడు నవగ్రహ ఆలయానికి వెళ్ళి అక్కడ కుజగ్రహ విగ్రహం ముందు ఎర్రటి వత్తులతో మరియు ఆవనూనెతో దీపారాధన వెలిగించాలి. 9. ఏడు మంగళవారాలుపాటు ఒకటిన్నర కిలోల బియ్యాన్ని, ఇతర పచ్చి ఆహార పదార్థాలను మరియు దక్షిణను కలిపి ఆంజనేయ లేదా సుబ్రహ్మణ్య లేదా శివాలయ పూజారికి దానంగా ఇవ్వాలి. 10. రాత్రి నిద్రపోయేముందు ఒక రాగి పాత్రలో నీటిని నిల్వఉంచి ఉదయం లేవగానే ఆ నీటిని తాగాలి. 11. కందిపప్పు మరియు బెల్లము కలిపిన మిశ్రమాన్ని ఆవులకి తొమ్మిది మంగళవారాలపాటు తినిపిస్తే కుజదోషం తొలగిపోతుంది. 12. ఏడు మంగళవారాలపాటు ఒక ముత్తైదువకు ఎర్రటి జాకెట్టుగుడ్డ, కుంకుమ మరియు ఎర్రటిపూలు ఇచ్చి నమస్కరించాలి. ఇది కుజదోషం వలన వివాహంకాని కన్యలకు మంచి ఫలితం వస్తుంది. 13. కుజదోషం ఉన్నవారు ఘట వివాహం లేదా కుంభ వివాహాన్ని చేసుకున్నట్లయితే ఆ దోషం తొలగిపోతుంది. ఈ విధానంలో కుజదోషం ఉన్న యువతి లేదా యువకుడు ఒక కొత్త కుండకు తాళిని కట్టి వివాహం చేసుకోవాలి. ఆ తరువాత ఆ కుండను నేలకేసి బాది పగలకొట్టాలి. ఫలితంగా కుజదోషం తొలగిపోతుందని జ్యోతిషశాస్త్రం తెలియజేస్తున్నది. 14. కుజదోషం ఉన్న యువతులు ఒక రావిచెట్టుకి కాని లేదా అరటిచెట్టుకి కాని తాళికట్టి వివాహం చేసుకోవాలి. ఆ తరువాత ఆ చెట్టును కొట్టివేయాలి. ఇలా చేసే వివాహాన్ని విష్ణు వివాహం లేదా అశ్వద్ద వివాహం అంటారు. 15. కుజదోషం ఉన్నవారు తమ ఇంటిలో ఏనుగు దంతాన్నికాని, ఆ దంతంతో చేసిన బొమ్మను కాని ఇంట్లో ఉంచుకున్నట్లయితే కుజదోషం తొలగి పోతుంది. 16. మర్రిచెట్టుకి పంచదార లేదా బెల్లం కలిపిన పాలనుపోసి ఆ చెట్టును పూజించినట్లయితే కుజదోషం తొలగిపోతుంది. 17. కుజదోషం ఉన్న యువతీ యువకులు రోజుకి 21 సార్లు చొప్పున మంగళ చండికా స్తోత్రాన్ని 108 రోజులపాటు పఠించాలి. ఇలా చెయ్యటంవల్ల తప్పనిసరిగా కుజదోషం తొలగిపోయి త్వరలో మంచి సంబంధం కుదిరి కుజదోషం తొలగిపోతుంది. 18. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినీ పట్టణంలో ఉన్న మంగళనాధ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసుకున్నట్లయితే కుజదోషం శీఘ్రంగా తొలగి పోతుంది. పరమశివుడు వైదీశ్వరన్ (వైద్య ఈశ్వరుడు) అన్న పేరుతో వెలిసిన క్షేత్రమే వైదీశ్వరన్ కోయిల్. నవగ్రహాలలో ఒకడైన అంగారకుడు లేదా కుజుడు ఈ క్షేత్రంలో పూజలందుకోవటం విశేషం. ఈ గ్రామంలో ప్రాచీనకాలం నుండి అనేకమంది నాడీ జ్యోతిష్కులు దేశం నలుమూలలనుండి ఇక్కడకు వచ్చే ప్రజలకు నాడీజోస్యం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాలను తెలియజేయటం జరుగుతున్నది. అతి శక్తివంతమైన ఈ క్షేత్రం తంజావూరు నుండి 110 కి.మీ. దూరంలోను, మైలాదుత్తరై నుండి 16 కి.మీ. దూరంలోను, చిదంబరం నుండి 27 కి.మీ. దూరంలోను ఉన్నది. ఈ ఆలయ ప్రహరీ లోపల ఉన్న సిద్దామృతం అనే పేరుగల పుష్కరిణిలో స్నానంచేస్తే అన్నిరకాల రోగాలు నశిస్తాయని తెలుస్తున్నది. ఈ పుష్కరిణిలో అమృతం కలిసి ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. స్థలపురాణం : త్రేతాయుగంలో శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు సప్తఋషులు ఈ క్షేత్రంలో వెలసిన వైదీశ్వరుడిని ఆరాధించినట్టుగా తెలుస్తున్నది. సీతాదేవిని అపహరించుకుపోతున్న రావణాసురుడిని అడ్డగించి అతడి చేతిలో మరణం పొందిన జఠాయువు అనే రాబందుకి రామలక్ష్మణులు ఈ క్షేత్రంలోనే అంతిమ సంస్కారాలు జరిపినట్టుగా తెలుస్తున్నది. ఈ క్షేత్రంలో జఠాయుగుండం అనే ఒక సరస్సు ఉన్నది. నవగ్రహాలలో ఒకడైన కుజుడు ఒకసారి కుష్టురోగానికి గురైనాడు. అపుడు కుజుడు ఈ క్షేత్రానికి వచి ఇక్కడ ఉన్న వైద్యనాధస్వామిని పూజించి కుష్టు రోగం నుండి విముక్తుడయినాడు. ఒకసారి పార్వతీదేవి ఆరు ముఖాలుగల షణ్ముఖుడిని ఒక్కముఖంతో మాత్రమే దర్శనమివ్వమని కోరింది. అపుడు ఆయన తన వేలాయుధాన్ని ధరించి ఒకే శిరస్సుతో పార్వతీదేవికి దర్శనమిచ్చాడు. శూరపద్మునితో జరిగిన యుద్ధంలో సుబ్రహ్మణ్యస్వామి ఆధ్వర్యంలో రాక్షసులతో పోరాడిన దేవతలకు విపరీతమైన గాయాలు అయ్యాయి. అపుడు పరమేశ్వరుడు వైద్యనాధునిరూపంలో అక్కడకువచ్చి దేవతలకు అయిన గాయాలకు వైద్యం చేసాడు. సాక్షాత్తు పరమశివుడే వైద్యుడుగా మారిన ఆ క్షేత్రమే ఆ తరువాత కాలంలో వైదీశ్వరన్ కోయిల్ గా పేరుపొందింది. ఐదు అంతస్తుల గోపురంకల ఈ విశాలమైన ఆలయంలో ఉన్న గర్భగుడిలో వైదీశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. అనేక ప్రాకారాలతో కూడిన ఈ క్షేత్రంలో మొదటి ప్రాకారం మధ్యలో ఉన్న ప్రధాన ఆలయంలో వైద్యనాధుడి లింగరూపం ఉంటుంది. రెండవ ప్రాకారంలో ఉన్న ఆలయంలో పార్వతీదేవి తనచేతిలో భక్తులయొక్క వ్యాధులను తొలగించే వైద్య సంబంధమైన నూనె ఉన్న పాత్రను పట్టుకుని కనిపిస్తుంది. దక్షిణదిశవైపు తిరిగి ఉండే ఈ అమ్మవారికి తెయ్యాలనాయకి అన్న పేరు ఉన్నది. అన్నిటికన్నా పెద్దదయిన ప్రాకారంలో ధన్వంతరికి మరియు అంగారకుడికి చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి. ఈ ప్రాకారం నుండి పుష్కరిణివైపుకు వెళ్ళే మార్గం సరిగ్గా తెయ్యాలనాయకి ఆలయానికి ఎదురుగా ఉంటుంది. వేపచెట్టు ఈ క్షేత్రంలో ఆలయ వృక్షంగా గుర్తించబడింది. వేపచెట్టుకి అనేక ఔషధ గుణాలు ఉన్నాయని మర్చిపోకూడదు. ఈ ఆలయంలో 11 మరియు 12వ శతాబ్దాలకు చెందిన చోళులకాలంనాటి ఐదు శిలా శాసనాలు ఉన్నాయి. ఈ క్షేత్రానికి వెళ్ళిన బక్తులు మొదట ఆలయ పుష్కరిణిలో స్నానంచేసి ఆ తరువాత ఆ ఆలయంలోకి వెళ్ళి వైదీశ్వరుడిని పూజిస్తారు. ఈ పుష్కరిణిలో బెల్లాన్ని కరగించినట్లయితే అలా కరిగించినవారి చర్మరోగాలు తొలగిపోతాయని ఈ ప్రాంతానికి చెందిన భక్తులు విశ్వసిస్తున్నారు. ఈ క్షేత్రంలో పిల్లలకు తొలిసారిగా పుట్టువెంట్రుకలు తీయించుట ఒక సాంప్రదాయంగా ఉన్నది. ఈ క్షేత్రంలో బియ్యపు ప్రమిదలలో దీపారాధన చెయ్యటం ఒక విశేషంగా చెప్పాలి. ఆలయ ధ్వజస్తంభంముందు ఉప్పు మరియు మిరియాలనువేసి నొక్కుతారు. దక్షిణ భారతదేశంలోని ఇతర హైందవ ఆలయాలలోవలె కాకుండా ఈ ఆలయంలోని ప్రతి చిన్న ఆలయంలోను ఒక ప్రత్యేకపూజారి భక్తుల తరపున పూజలుచేస్తాడు. ఈ క్షేత్రంలో ప్రసాదంగా ఇవ్వబడే చందనం మరియు విభూతి అనేక రోగాలకు ఔషధాలుగా భావించబడుతున్నాయి. ఈ క్షేత్రంలో ఉన్న హుండీలో భక్తులు వెండితో చెక్కిన మానవ అవయవాలను మొక్కుబడి చెల్లింపుకు వెయ్యటం జరుగుతున్నది. ఈ క్షేత్రంలో బ్రహ్మోత్సవం ఫాల్గుణ మరియు పుష్యమాసాలలో జరుపబడతాయి. ఇంకా ఈ క్షేత్రంలో నవంబరు నెలలో కార్తికేయ్ అనే పండుగను జరుపుతారు. ఆ తరువాత ఈ క్షేత్రంలోని మొదటి ప్రాకారంలో ఉన్న ముత్తు కుమారస్వామిని స్కంధషష్టి ఉత్సవాల సమయంలో పూజించటం జరుగుతుంది.