శ్రీ కాల భైరవ స్వామి వారు

kottiyoor devaswom

క్షేత్రపాలక కాలభైరవ ప్రాముఖ్యత : - ప్రపంచంలో అన్ని శివాలయాలలో విధిగా కాలభైరవ స్వామి ఈశ్వరునికి ఎదురుగా వుంటాడు. శాస్త్రం ప్రకారం ముందుగా క్షేత్రపాలకుడైన కాలభైరవుణ్ణి దర్శించిన తర్వాతనే పరమేశ్వరుణ్ణి దర్శించాలి. ఇది కాశీలో అందరూ ఈ నియమం పాటిస్తారు. అప్పుడే సత్ఫలితం వస్తుంది. భైరవసాధన దక్షిణాచార మార్గంలోను, వామచార మార్గంలోను చేయవచ్చు. రుద్రాక్షమాలధరించి, నల్లని వస్త్రాలు ధరించి, మంత్రజపంచేసి, భైరవ అనుజ్ఞా, దిగ్బంధన తప్పనిసరిగా చేసి, నల్లనువ్వులు, మిరియాలలో ముందుగా అష్టభైరవులకి ఆహుతులిచ్చి మూలమంత్రంతో హోమంచేసి, నల్ల మినపగారెలు నైవేద్యం పెట్టి అవి కుక్కలకు తినిపించిన కాలభైరవ దర్శనం తొందరగా దొరుకుతుంది..

కాలభైరవ చరిత్ర : - విశ్వాన్ని సృష్టించి, పాలించి, తిరిగి, సంహరించే కారణమున శివుడిని కాలుడు, భైరవుడు అంటారు. పరమేశ్వరునికి రెండు స్వరూపాలు. ఒకటి భక్తులకు అభయాన్ని ప్రసాదించే లింగ స్వరూపం. ఇది అత్యంత సౌమ్యంగా శాంతంగా వుంటుంది. ఇక రెండవది. దుష్టులను, పాపులను దండించే దండనాధస్వరూపమే కాలభైరవుడు. పరమశివుని పూర్ణావతారమే ఇది. భైరవరూపం రౌద్రంగా, భయానకంగా ప్రచండంగా, తీక్షణంగా ఉంటుంది.

కాలభైరవ జయంతి - కాలభైరవాష్టమి-కాలాష్టమి: - మార్గశిర బహుళ అష్టమి మధ్యాహ్న సమయంలో పరమేశ్వరుడు కాలభైరవ అవతారాన్ని స్వీకరించాడు. అందుకే ఆరోజు కాలభైరవ జయంతిగా ప్రసిద్ధి చెందినది. (అలాగే ప్రతినెల బహుళ అష్టమి శివునితిథినాడు కాలాష్టమినాడు ఈ వ్రతం ఆచరించాలి. ఆదివారం కూడా ఆచరించవచ్చు. 4వారాలుచేయాలి). ఆ పుణ్యతిథినాడు కాలభైరవ వ్రతం ఆచరించి, ఉపవాసం వుండి జాగరణచేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. కాలభైరవుడి భక్తులకి ఎవరైనా కీడు తలపెట్టాలని చూస్తే వారు (శత్రువులు) భైరవుడి ఆగ్రహానికి గురై సర్వనాశనమై నరకాన్ని చేరతారు.

శ్రీ కాలభైరవ స్వామి వారికి : - ప్రతీరోజు పంచామృత అభిషేకము, అలంకరణలు, ప్రతీ శుక్రవారం విశేష అభిషేకములు మరియు కాలభైరవాష్టమి రోజున కాలభైరవ స్వామికి విశిష్ట అభిషేకములు, పూజలు, శాంతి హోమములు జరుగును. జన్మ, గ్రహ, దిష్టి, దోష, భైరవ యాతన నివారణార్థం ప్రత్యేక అభిషేకములు, హోమములు జరుగును. అభీష్టం గల భక్తులు స్వయంగా పాల్గొని ప్రత్యేక కార్యక్రమములు చేయించుకొనుటకు తగిన ఏర్పాట్లు ఆశ్రమం వారిచే చేయబడును.