శ్రీ సిద్దేశ్వర ధ్యాన పిరమిడ్

kottiyoor devaswom

పిరమిడ్ అంటే..... ? :- సుమారు 4000 సం.రాలక్రితం సృష్టించబడింది తొలి పిరమిడ్. త్రిభుజాలతో త్రికోణాకారంగా వుండే నిర్మాణం పిరమిడ్. సమతలమైన ప్రదేశంపైన మూడు సమతల పార్శ్వా లు శిఖరాగ్రాన ఒక బిందువు వద్ద కలసే నిర్మాణాకృతిని పిరమిడ్ అని వివరించింది నిఘంటువు. ఈజిప్టు దేశంలో మరణించిన వారి సమాధులను పిరమిడ్స్ గా పేర్కొంటారు. ‘పిరమిడ్’ అన్న పదంతోపాటు పిరమిడ్లకు నిలయం ఈజిప్ట్ కాబట్టి - 'సమాధి'ని పిరమిడ్ గా భావిస్తున్నారు అనేకులు. అయితే...  
సమాధిలో ధ్యానమా ? :- ‘అసంభవం’. ఈజిప్ట్ లోని కొన్ని పిరమిడ్స్ లోపల భద్రం చెయ్యబడిన శవాలు... మమ్మీలు - కన్పించినప్పటికీ, అన్ని పిరమిడ్స్ లోనూ ‘మమ్మీ’లు లేవు. కనుక శవాలను పాతిపెట్టే సమాధులు కావు-పిరమిడ్స్ అంటే... అని కొందరంటారు. నిజమే! శవాలను సమాధి చేసే పిరమిడ్స్ ఎవరూ ధ్యానం చెయ్యాలను కోరు. ఈనాడు ప్రపంచంలో అనేకులు ‘పిరమిడ్లో ధ్యాన సాధన’ చేస్తున్నారుకదా! కనక... పిరమిడ్ అంటే సమాధి కాదు! అయితే - వాస్తు శాస్త్రాన్ని అనుసరించి నిర్మించిన కట్టడం... ‘వాస్తు’ అంటే నివసించడానికి అనువైన గృహం. ఆచారం అనేది దేశం, ప్రాంతం, సాంప్రదాయం బట్టి వుంటుంది. ఈజిప్టులో పురాతన కాలంనాటి నమ్మకం ఒకటివుంది. ‘దేహంలో జీవుడు సూక్షశరీరంతో వుంటాడు’ అని వాళ్ల నమ్మకం. మరణం అంటే జీవుడికి ఆటవిడుపు. లేదా విశ్రాంతి. మరణంతో తానున్న దేహాన్ని విడిచిన జీవుడు సూక్షశరీరంతో ఇతర లోకాలకి ప్రయాణం చేస్తాడు. అయితే జీవుడికి దేహభ్రాంతి పుర్తిగా నశించదు. అందుచేత కొంతకాలం ఇతరలోకాల్లో సంచరించిన తర్వాత దేహభ్రాంతి చేత మరల తన దేహాన్ని వెతుక్కుంటూ భూమికి వస్తాడు జీవుడు. సాధారణంగా మరణం పొందిన వారి మృతదేహాన్ని దహనం చెయ్యడం లేదా, ఖననం చెయ్యడం జరుగుతుంటుంది. అందుచేత, మరల దేహాన్ని ఆశ్రయించవచ్చిన జీవుడికి తాను త్యజించిన దేహం లభించనందున, గత్యంతరం లేక మరో మాతృగర్భాన్ని ఆశ్రయిస్తాడు. అదే....
‘పునరపి జననం’:- ఈ సిద్ధాంతాన్ని దాదాపు ప్రపంచంలోని మానవజాతులన్నీ అంగీకరించాయి. ఇదే పిరమిడ్ నిర్మాణానికి కారణం, ఆధారం అయింది. మానవుడి బలహీనత 'సెంటిమెంట్' ఈ సెంటిమెంట్ ఎంత బలవత్తరమైనదంటే – ‘తమ ప్రేమని, అభిమానాన్ని అమితంగా పొందిన చక్రవర్తి లేదా రాజు మరణానంతరం సూక్షశరీరంతో ఇతరలోకాలకి వెళ్తాడు. కొంతకాలం - అది ఏళ్లు - శతాబ్దాలు కావచ్చు- తర్వాత ఆతడు తిరిగి దేహాన్ని దరించడానికి వస్తే....? ఆయన విసర్జించిన పూర్వ భౌతిక దేహం కన్పించకపోతే - ఆయన మరల ఎలా జన్మిస్తాడు? తమని ఎలా ఆదరించి పాలిస్తాడు?’ కనుక 'ఆతడు' తిరిగి ప్రవేశించేవరకూ 'ఆతను' వదిలివేసిన 'దేహం' భద్రంగా, జాగ్రత్తగా కాపాడబడాలి! ఒక ‘మృతదేహం’ చెడిపోకుండా, చెక్కుచెదరరకుండా, యధాతధంగా కాపాడే మార్గం ఏమిటి?

ఈజిప్షియన్స్ కనిపెట్టిన మార్గమే పిరమిడ్:-.

* ప్రాణంపోయిన మృతదేహాన్ని చెక్కు చెదరకుండా కాపాడుతుంది పిరమిడ్.
* అనేక శతాబ్దాలపాటు దేహాన్ని భద్రపరిచే నిర్మాణమే పిరమిడ్.
* 'సెంటిమెంట్' ని కాపాడుకునే కట్టడమే పిరమిడ్.
* పిరమిడ్స్ లో భద్రపర్చిన 'మమ్మీ'లే యీ సెంటిమెంట్ కి ప్రత్యక్ష సాక్ష్యం.

ధ్యానం:- ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సింపుల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ‘శ్వాస మీద ధ్యాస’ పెట్టడమే ధ్యానం. ఇంతేనా?... నిజానికి ఇంతే! ‘జీవి’ జీవించడానికి అవసరమైన శక్తి ప్రాణం. ఆప్రాణం జీవుడి నాశికా రంధ్రాల ద్వారా దేహంలోకి ప్రవేశించి... దేహమంతటా ప్రయాణించి... దేహాన్ని ప్రాణశక్తి పూరితంగావించి... మరల నాశికా రంధ్రం ద్వారా బైటకి వస్తూ వుంటుంది. ఇలా ప్రాణం నాశిక ద్వారా శరీరంలోకి ప్రయాణిస్తూ.... శరీరాన్నుండి బైటకి వస్తూవుండే ప్రయాణాన్నే యోగులు 'ఆనాపానసతి' అన్నారు. ఈ ప్రాణం అనేది నిలకడగా స్థిరంగా ఒకచోట నిలచివుండేది కాదు. ఇది క్షణక్షణం దేహంలోకి ప్రయాణిస్తూ తన జీవశక్తితో దేహాన్ని చైతన్య వంతం చేస్తూ బయటకి... అంటే.. తాను ఎక్కడనించి వచ్చిందో ఆ ప్రకృతిలోకి వచ్చి చేరుతూ వుంటుంది. అంటే ప్రాణం లేదా జీవశక్తి అనేది సువిశాల పంచభూతా త్మక ప్రకృతిలో రూపరహితంగా వ్యాప్తమై వుందన్నమాట! అంటే..... కంటికి కనిపించకుండా ప్రకృతిలోవున్న జీవచైతన్యశక్తి ఏదో... సమస్త విశ్వానికి ప్రాణాధార, జీవనాధార శక్తి ఏదైతేవుందో.... అది... మానవ శరీరంలోనూ జీవ, చైతన్య, ప్రాణాధారశక్తిగా పనిచేస్తోంది.  ఈ ప్రాణాధారశక్తి కంటికి కనిపించదు. కానీ దీని ఉనికిని గ్రహించగలగడానికి ఒక మార్గం వుంది. ఆ మార్గమే ఉచ్ఛ్వా స నిశ్వాస - ఈ ఉచ్చ్వాస నిశ్వాస అనే ప్రక్రియ మన నాసికారంధ్రాల ద్వారా, అంటే మన ముక్కు రంధ్రాల ద్వారా జరుగుతుంటుంది. ముక్కుకి వున్న రెండు రంధ్రాల్లో ఒకదాని ద్వారా శ్వాస లోపలికి పీల్చుకున్నప్పుడు... ఆ రంధ్రంద్వారా (ఆక్సిజన్) గాలి లోపలికి ప్రవేశించి, మన దేహంలోని ‘నాడీమండలాన్ని’ శుభ్రం చేస్తూ ప్రయాణిస్తూవుంటే - అలా నాసికారంధ్రం ద్వారా శుద్ధి అయిన మార్గం గుండా దేహంలోకి ప్రయాణం చేస్తుంది జీవధార శక్తి అయిన ప్రాణం. గాలి దేహంలోని నాడీమండల మార్గంద్వారా మన దేహంలో వున్న  1) మూల ధారం 2) స్వాధిష్టానం 3) మణి పూరకం 4) అనాహతం 5) విశుద్ధం 6) ఆజ్ఞా అనే నాడీమండలాలతో కూడిన (ఆరు) షట్చక్ర మండలాలగుండా వ్యాపించి దేహాన్నంతటిని శుద్ధి చేసి, దేహంలో ఏదైనా అశుభ్రతవుంటే దానిని నాసిక అంటే ముక్కు రెండవ రంధ్రం ద్వారా బయటకి తీసుకొచ్చి విసర్జిస్తుంది. వీటి ఉపరి భాగాన వుంటుంది 'సహస్రారము'. ఇదే మూలశక్తి. ఇలా నాడీమండలాన్ని, షడ్చక్రమండలాన్ని వాయువు శుభ్రం చేస్తూ ప్రయాణిస్తూ వుంటే, అలా శుద్ధి అయిన మార్గం గుండా ప్రాణం ప్రయాణిస్తూ దేహంలోని నాడీ మండలాన్ని, షడ్చక్రమండలాన్ని జీవనాధార ప్రాణశక్తితో నింపుతూ వాయుమార్గం ద్వారా నాసిక (ముక్కు) రెండవ రంధ్రం ద్వారా వెలుపలికి వచ్చి ప్రకృతిలో లీనమవుతూ వుంటుంది. మరల, మరల... మళ్లీ మళ్లీ... ఇదే పద్ధతి... అంటే మనం క్షణంలో ఎన్నిసార్లు గాలి పీల్చి వదులుతామో అన్నిసార్లు... ఒక నిమిషంలో ఎన్నిసార్లు ఉచ్చ్వాస నిశ్వాసలు జరుపుతామో అన్నిసార్లు.... ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవేశించి, శరీరాన్ని చైతన్యవంతం చేసి బయటకి వచ్చేస్తూ వుంటుంది. అంటే ఒక్క నిమిషంకూడా... ఒక్కక్షణంకూడా... మనలో ప్రాణశక్తి అనేది నిలువ వుండదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్... క్షణక్షణం కొత్త స్టాక్... ప్రాణం చేసే యీ ప్రయాణం మన కంటికి కనిపించదు. దీనిని మనం చేసే ఉచ్ఛ్వాస-నిశ్వాసల ద్వారా మాత్రమే గుర్తించగలం. ఇలా ఉచ్ఛ్వాస-నిశ్వాసల ద్వారా దేహంలోకి ప్రాణం వస్తూ- పోతూ వుండ టాన్నే- 'అనాపానసతి' అంటారు. 'అన...' అంటే ఉచ్చ్వాస... (గాలి) లోపలికి ప్రవేశించడం. 'అపాన...' అంటే నిశ్వాస... బైటకి నిష్క్రమించడం. ‘సతి...’ అంటేక్రమబద్ధికరించడం.. ఆన+అపాన+సతి=ఆనాపానసతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను క్రమబద్దీకరణగా జరపడం. అంటే ఉచ్చ్వాస నిశ్వాసలను క్రమపద్ధతిలో జరపడం. ఇలా సక్రమ పద్ధతిలో ఆనాపానసతి జరుగుతున్నప్పుడు ఈ మార్గం ద్వారా ప్రాణశక్తి మన దేహంలో ప్రవేశిస్తూ... క్రమపద్ధతిలో క్షణక్షణం దేహాన్ని జీవచైతన్య శక్తిపూరితం గావిస్తూ.... నిష్క్రమిస్తూంటుంది. ఇదే జీవ ప్రాణాలతో, జీవించి వుండే పద్ధతి. ఈ ప్రాణశక్తి సమ పద్ధతిలో అందుతున్నంత కాలమే యీ భౌతిక శరీరం సజీవం. ఇదే 'శివం'. ఎప్పుడైతే ప్రాణశక్తి మార్గం అశుద్ది మయమవుతుందో... శరీరానికి ఎప్పుడు ప్రాణశక్తి ఆగిపోతుందో.... అప్పుడది... 'శవం' మరైతే, 'నేను' అంటే 'ప్రాణమా? ప్రాణమే-నేను అయితే శరీరం ఎవరిది? నాది కాదా? ‘నా ప్రాణం - నా శరీరం’ అంటుంటాము సాధారణంగా. వీటిల్లో ప్రాణం ఆకార విశేషాలు తెలియవు. అది సువిశాల ప్రకృతిలో లీనమైవుంటుంది. కనుక ‘ప్రాణం’ ‘నేను’ కాదు. మరి శరీరమా?  శరీరం నశించి పోయేదేకదా! శివం ఎప్పటికైనా శవంగా మారక తప్పదు కదా! కనుక నశించిపోయే శవం 'నేను' కాదు. కానీ, 'నేను' అనుకునే శరీరంలో జీవశక్తిని నింపి ప్రాణం కల్పించిన ప్రాణశక్తి కంటే అతీతమైనదీ... సులభంగా నాశం కానిదీ... ఇంకేదో, అది. ‘నేను!’ జీవి చైతన్యం లేని శరీరం నిరుపయోగం. అప్పుడది శవం. శరీరం అనేది లేకపోతే 'ప్రాణం' నిరుపయోగం. అప్పుడది ప్రయోజనం లేనిది. అంటే అటు దేహమూకాక - ఇటు ప్రాణమూకాక - ఈ దేహాన్ని ఆశ్రయించుకుని మరేదోవుంది. ఈ దేహము, 'దానికి' నివాసం. ఆ నివాసానికి చైతన్యశక్తి ప్రాణం. ఈ దేహమూ, ఆ ప్రాణమూకూడా ఆ ‘మరో’ దాని ఉపయోగార్థమే నన్నమాట... అంటే .... 'అదేదో'.... అదే 'నేను' అన్నమాట! కంటికి కనిపించని ఆకారంలేని 'నేను' నివసించడానికి దేహమూ, ఆ దేహాన్ని చైతన్యవంతంగా వుంచడానికి ప్రాణం ఉపయోగపడుతున్నాయి. 'నేను' నివాసాన్ని అంటే దేహాన్ని ఖాళీ చెయ్యగానే శివం కాస్తా శవం అవు తుంది. శవం అయిపోగానే దాన్లోని ప్రాణం తన మూలప్రకృతిలో కల్సిపోతుంది. మరైతే అప్పుడు 'నేను' ఏమవుతాను? ఎక్కడికి వెళ్తాను? ఎక్కడ నివశిస్తాను? ఎంత కాలం? ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం చేసే ప్రక్రియే - ధ్యానం. కంటికి కనిపించిన 'నేను' కోసం దేహం… ఆ దేహాన్ని చైతన్యవంతంగా వుంచడానికి ప్రాణం... ఆ ప్రాణం దేహంలోకి రాకపోకలు సాగించడానికి... ఆనాపానసతి. ఆ 'ఆనాపానసతి' విధానాన్ని అధ్యయనం చెయ్యడమొక్కటే 'నేను' ఎవరో తెల్సుకోడానికి మార్గం. ఆనాపానసతి అంటే ఉచ్చ్వాస-నిశ్వాస విధానం. అంటే శ్వాస. శ్వాస ప్రక్రియను శ్రద్ధగా, జాగ్రత్తగా, ఏకాగ్రతగా అధ్యయనం చేస్తే…? ఆ అధ్యాయన మార్గమే ధ్యానం. అనగా.... ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సో... ధ్యాన మార్గం కోసం... వేద్దాం మరో అడుగు...

ధ్యానం వలన... :-
* శారీరక దారుఢ్యం పెరుగుతుంది.
* మానసిక ప్రశాంతి చేకూరుతుంది.
* బుద్ది సునిసిత్వ మవుతుంది.
* ఆర్థిక సంక్షేమం కొనగూడుతుంది.
* మంచి స్నేహాలు లభిస్తాయి.
* ఆధ్యాత్మిక జ్ఞానం అలవడుతుంది.
ఆధునిక ధ్యాన గురువులు మరికొన్ని లాభాలను ప్రతిపాదించారు. అవి
* ధ్యానం వల్ల రోగాలు నయమవుతాయి.
* ధ్యానం వల్ల జ్ఞాపక శక్తి అధికమవుతుంది.
* ధ్యానం వల్ల ఆత్మస్టైర్యం వృద్ధి అవుతుంది.
* ధ్యానం వల్ల జ్ఞాననేత్రం ప్రకాశిస్తుంది.
* ధ్యానం వల్ల ధ్యాన గురువవుతాడు.
* ధ్యానం వల్ల తానే దేవుడని గ్రహిస్తాడు.

పిరమిడ్- దేవాలయం :-
ఇంచుమించుగా పతంజలి మహర్షి -బుద్ధుడు మధ్యకాలంలోనే-అంటే సుమారు 4500 సంవత్సరాలనాడు 'పిరమిడ్' నిర్మాణం జరిగినట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోంది.  అంటే- యోగసాధనకోసం వేదాల్లో ఏం చెప్పబడిందో - వేదాల అధ్యయనం చేసి పతంజలి మహర్షి ఏం చాటాడో- ఆ 'మార్గం' ఆధారంగా 'పిరమిడ్స్' నిర్మాణం జరిగినట్లు మనం భావించవచ్చు. ఇందుకు యీ క్రింద కారణాలను మనం పరిశీలించాల్సి వుంటుంది. *సృష్టి ప్రారంభంలో జనాభా తక్కువగా వుండేది. వారిలో అధిక భాగం అధిక కాలం ధ్యాన, తపస్సులలో కాలం గడిపేవారు. మిగతా సమయాన్ని కుటుంబ అవసరాలకి వినియోగించేవారు. క్రమక్రమంగా సృష్టి అభివృద్ధి చెందాక వృత్తి విభజన జరిగింది. మనుషులను నాలుగు వర్ణాలుగా విభజించారు. అవి :- బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర వర్ణాలు. *బ్రాహ్మణులు లోకహితం కోసం యజ్ఞ యాగాదులు చేస్తూ, విద్యా విజ్ఞాన అభివృద్ధికి గురుకులాలు నిర్వహిస్తూ, వైదిక కర్మలు జరిపిస్తూ, వేద వాజ్ఞ్మయాన్ని లోకవ్యాప్తం చెయ్యడానికి నియమితులయ్యారు. కనుక వీరి విధివిధానాల్లో భాగంగా నిత్యం ధ్యాన యోగాది సాధనా కార్యక్రమాలు నిత్యం జరుపుకునే అవకాశం వుంది.  * వ్యాపారం చేస్తూ సామాజిక సంపదను అభివృద్ధి చేసే వైశ్యులకు, దేశరక్షణ, ప్రజారక్షణ చేసే క్షత్రియులకు, సమాజానికి ముఖ్యావసరాలైన కర్షక కార్మిక వృత్తులు చేపట్టిన శూద్రులకూ, వారివారి బాధ్యతలరీత్యా - ధ్యానం, యోగా, తపస్సు వంటివి చేసుకునే వ్యవధీ, అవకాశం తక్కువ. ఇలాంటి వారికి కూడా ఆధ్యాత్మిక చింతననూ - ధ్యాన ప్రయోజనాన్ని కొంతవరకైనా అందించే సదుద్దేశంతోటీ ఏర్పాటయ్యాయి దేవాలయాలు. * దేవాలయాలు అంటే సామూహిక సత్సంగ నిలయాలు. అనాదిగా మానవ ప్రపంచం ‘విగ్రహారాధన’కు ఆలవాలమైంది. దేశాలు, విభిన్న సంస్కృతులని అనుసరించి 'దేవుడికి' వివిధ దేశాల్లో, వివిధ మతాల్లో భిన్నమైన పేర్లూ, రూపాలు ఉండవచ్చుగానీ, వాటి నిర్మాణానికి మూలకారణం ‘సామూహిక సత్సంగం’. *దేవాలయాలు, ప్రార్ధనా మందిరాలు - పేర్లు ఏవైనా వాటిని 'కాస్మొటిక్ ఎనర్జీ' కేంద్రాలుగా నిర్మించి-ఆ 'విశ్వశక్తి'ని - అక్కడ ప్రార్ధనలు, సత్సంగాలు, సమావేశాలు జరుపుకొనే వారికి లభించి – ‘లాభించే’టట్లు చెయ్యడమే - వీటి నిర్మాణాల్లోని ముఖ్యోద్దేశం. ఆ తర్వాత కాలంలోనే మతం, కులం, ఆచారం వంటి రంగులు పులుముకుని వీటి 'యదార్ధత్వం' మరుగున పడిపోయింది.