ద్వాదశ జ్యోతిర్లింగాలు

kottiyoor devaswom

1.  సోమనాథక్షేత్రం ( గుజరాత్ )

kottiyoor devaswom

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథక్షేత్రం మొదటగా చెప్పబడుతోంది. ఇచ్చట కొలువైన స్వామికి సోమనాథుడని పేరు. మన పురాణాలు ఈ క్షేత్రాన్ని ప్రభాసతీర్థంగా పేర్కొన్నాయి.

స్కాందపురాణాన్ని అనుసరించి చంద్రుని తపస్సు కారణంగా పరమశివుడు ఈ క్షేత్రంలో సోమనాథునిగా వెలశాడు. చంద్రునికి సోముడనే పేరుంది. నాథుడు అంటే రక్షకుడని అర్థం. చంద్రుడు శివుణ్ణి తన నాథునిగా భావించి యిక్కడ తపస్సు చేసాడు కాబట్టి ఈ జ్యోతిర్లింగం సోమనాథునిగా పేరొందింది.

సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు తొమ్మిదిమంది ప్రజాపతులను సృష్టించాడు. వీరిలో దక్షప్రజాపతి ఒకడు. దక్షుడు తన కుమార్తెలలో ఇరవైఏడు మందిని చంద్రునికిచ్చి వివాహం జరిపించాడు. అయితే చంద్రుడు మాత్రం అందరిలోను అందగత్తె అయిన రోహిణితో ఎక్కువ ప్రేమతో వుండేవాడు. దాంతో మిగిలిన వారంతా తమ బాధను తండ్రితో మొరపెట్టుకున్నారు. దక్షుడు భార్యలందరినీ సమానంగా చూడమని చంద్రునికి ఎన్నోవిధాలుగా నచ్చజెప్పాడు. అయినా చంద్రుని ప్రవర్తనలో మార్పు రాలేదు. దాంతో కోపించిన దక్షుడు భయంకర మైన క్షయవ్యాధిగ్రస్తుడవు కమ్మని చంద్రుణ్ని శపించాడు.

ఈ శాపంతో చంద్రుని కళలు క్షీణించసాగాయి. చంద్రుడు కాంతిహీనుడయ్యాడు. లోకాలపై తన కాంతిని శీతలత్వాన్ని, ప్రసరింపజేసే శక్తిని కోల్పోయాడు.

చంద్రకాంతి లేకపోవడంతో లోకాలలో చీకట్లు అలుముకున్నాయి. ఓషధులు, చెట్లు నిస్తేజాలయ్యాయి.

యజ్ఞయాగాదులు లేకపోవడంతో దేవతలకు ఆహుతులు కరువయ్యాయి. ఈ ఉపద్రవం నుండి బయట పడేందుకు శివుని గురించి ప్రభాసక్షేత్రంలో తపస్సు చేయమని బ్రహ్మ దేవుడు చంద్రునికి సూచించాడు.

చంద్రుడు తన తపస్సుతో శివ సాక్షాత్కారాన్ని పొందాడు. పరమశివుని అనుగ్రహంతో చంద్రుడు వ్యాధినుండి విముక్తిని పొంది కృష్ణపక్షంలో ప్రతీరోజు చంద్రునికళ ఒక్కొక్కటి క్షీణించే విధంగాను, మళ్లీ తిరిగి శుక్లపక్షంలో అదేక్రమంలో ఒక్కొక్క కళ వృద్ధి పొందేటట్లు వరాన్ని పొందాడు.

దాంతో యథావిధిగా లోకాలపై తన కాంతిని ప్రసరింపజేశాడు చంద్రుడు. చంద్రుని చైతన్యంతో లోకాలన్నీ ఉత్తేజాన్ని పొందాయి. చివరకు చంద్రుని కోరికమేరకు ప్రభాసతీర్థంలో సోమనాథునిగా వెలశాడు పరమేశుడు.

2 . శ్రీశైలమహాక్షేత్రం ( ఆంధ్రప్రదేశ్ )

kottiyoor devaswom

శ్రీశైలమహాక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో నల్లమల అడవులనడుమ కృష్ణానదికి కుడివైపున వుంది. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో కూడా ఒకటి కావడంచేత ఎంతో ప్రాశస్త్యాన్ని పొంది ఇలలో వెలసిన కైలాసంగా పేరొందింది. ఆదిపరాశక్తి ఈ క్షేత్రంలో భ్రమరాంబగా కొలువుతీరింది.

శ్రీశైలక్షేత్రం భూమండలానికి నాభిస్థానమని స్కాంద పురాణం అంటోంది. అందుకే మనం వివిధ వైదిక కర్మలను అంటే పూజలు, వ్రతాలు మొదలైన వాటిని ఆచరించేటప్పుడు చెప్పుకునే సంకల్పంలో “శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే.... శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే” అంటూ మన ఉనికిని శ్రీశైల క్షేత్రాన్ని కేంద్రంగా చేసుకుని చెబుతాం. అంటే మనం శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున వుండి వైదికకర్మను ఆచరిస్తున్నామనే విషయాన్ని సంకల్పంలో వివరంగా చెప్పుకోవడం జరుగుతుంది.

ఈ క్షేత్రాధిదేవుడైన మల్లికార్జునుడు పర్వతుని తపస్సు కారణంగా ఇక్కడ స్వయంగా ఉద్భవించగా, క్షేత్రాధిదేవత అయిన భ్రమరాంబాదేవి అరుణా సురుడనే రాక్షసుని సంహరించి ఈ క్షేత్రంలో స్వయంగా వెలసింది.

కృతయుగ ప్రారంభంలో శిలాదుడనే ఋషి, సంతానం కోసం శివుని గురించి తపస్సుచేసి అయోనిజనులైన ఇద్దరు కుమారులను పొందాడు. వారిలో మొదటి కుమారుడు నందికేశ్వరుడుకాగా, రెండవవాడు పర్వతుడు. తరువాత నందికేశ్వరుడు శివుని కోసం తపస్సు చేసి శివునికి వాహనమయ్యాడు. దాంతో పర్వతుడుకూడా కనీవినీ ఎరుగని రీతిలో నిరాహారంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు సంతుష్టుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై పర్వతుని వరం కోరుకోమన్నాడు. దానికి పర్వతుడు తాను పర్వత ఆకారాన్ని ధరించి స్థలంగావుండే విధంగాను, తనపై శివుడు శాశ్వతంగా కొలువుతీరివుండే విధంగా వరాన్ని కోరుకున్నాడు. ఆ వరాన్ని అనుగ్రహించాడు పరమశివుడు. దాంతో పర్వ తుడు పర్వత ఆకారాన్ని పొంది పర్వతంగా వుండగా ఆ పర్వతంపై శివుడు స్వయంభువుగా పర్వతలింగమై కొలువుదీరాడు. ఆ పర్వతమే శ్రీపర్వతంగా పేరొందగా, స్వామి శ్రీపర్వతస్వామిగా పిలవబడసాగాడు. కాలక్రమంలో శ్రీపర్వతం శ్రీశైలమని పిలువబడగా, శ్రీపర్వతస్వామికి మల్లికార్జునుడనే నామం ఏర్పడింది. కాగా శ్రీపర్వతస్వామిగా పిలువబడిన శ్రీశైలనాథునికి మల్లికార్జునుడనే పేరు రావడానికి చంద్రవతి వృత్తాంతం కారణంగా చెప్పబడుతోంది.

పూర్వం చంద్రవతి అనే రాజకుమార్తె ప్రతినిత్యం శ్రీపర్వతస్వామిని మల్లికా పుష్పాలతో (అడవి మల్లెలతో) పూజించేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు ఆ భక్తురాలు స్వామి గంగనుధరించి వున్నట్లుగానే తాను సమర్పించిన మల్లికా పుష్పాలను కూడా ఎల్లప్పుడూ ధరించి వుండాలని కోరింది. ఆమె కోరికను మన్నించాడు శ్రీపర్వతస్వామి.

ఈ విధంగా శ్రీపర్వతస్వామి “మల్లికార్చితుడు” (మల్లెల చేత పూజింప బడినవాడు) అయినాడు. “మల్లికార్చితుడు” నామమే కాలక్రమములో “మల్లికార్జునుడు” అనే నామంగా మారిందని భావించబడుతోంది.

3 . మహాకాళేశ్వరుడు ( ఉజ్జయిని )

kottiyoor devaswom

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో వెలసిన స్వామికి మహాకాళేశ్వరుడని పేరు. ఈ ఉజ్జయిని పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో ఒక్కటి కూడా. ఇక్కడి అమ్మవారిని మహాకాళీగా పిలుస్తారు. మన పురాణాలు ఈ ఉజ్జయిని అవంతి, అవంతిక, విశాల, కుశస్థలి, అమరావతి, కనకశృంగా అనే పేరులతో ప్రస్తావించాయి. మోక్షాన్ని ప్రసాదించే ఏడు పురాలలో ఉజ్జయిని కూడా ఒకటిగా చెప్ప బడింది. తక్కినవి, అయోధ్య, మధుర, కాశి, కంచి, పురీ, ద్వారక. శివపురాణంలో మహాకాళేశ్వరుని ఆవిర్భవానికి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తోంది. ఈ కథ ప్రకారం - పూర్వం అవంతీ నగరంలో వేదప్రియుడనే బ్రాహ్మణుడు వుండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. వేదాధ్యయన పరుడు. అతనికి దేవప్రియుడు, సుమేధనుడు, సుకృతుడు, ధర్మవాహినుడనే నలుగురు కుమారులుం డేవారు. వారూ గొప్ప శివభక్తులే. వేదప్రియుడు అతని పుత్రులు రోజూ పార్థివలింగాన్ని చేసి భక్తి శ్రద్ధలతో అర్చించేవారు. వేద పారాయణలను చేసేవారు. ఈ కారణంగా ఆ ప్రదేశ మంతా పాడిపంటలతో తులతూగుతుండేది.

ఇదిలావుండగా యిక్కడి సమీపంలోని రత్నమాలా పర్వతంపై దూషణుడు అనే దుష్ట రాక్షసుడు వుండేవాడు. బ్రహ్మచేత వరాలను పొందిన ఆ రాక్షసుడు వరగర్వంతో లోకాలన్నింటినీ బాధించేవాడు. వేదధర్మ వ్యతిరేకి అయిన ఆ రాక్షసుడు శివపూజలను, యజ్ఞయాగాలను మానమని వేదప్రియుని, అతని కొడుకులను హింసించసాగాడు. కానీ, వారు శివపూజలు మానలేదు. దాంతో దూషణుడు ఆ బ్రాహ్మణులను చంపబోయాడు. అప్పుడు పరమేశ్వరుడు రౌద్రస్వరూపునిగా హుంకారంతో ప్రత్యక్షమై ఆ రాక్షసుని భస్మం చేసాడు. తరువాత ఉజ్జయినిలో మహాంకాళేశ్వరునిగా కొలువుదీరాడు. పరమేశ్వరుడు ఇక్కడ రౌద్రరూపంలో, హుంకారముతో ప్రత్యక్షమైన కారణంగా ఆయనకు మహాకాలుడనే పేరొచ్చింది.

ఇక ఈ క్షేత్రానికి సంబంధించి మత్స్యపురాణంలో మరోకథవుంది. ఒకప్పుడు అంధకుడనే రాక్షసుడు పార్వతిని అపహరించేందుకు ప్రయత్నించాడు. అప్పుడు శివుడు ఆ రాక్షసుని మహాకాలరూపంలో సంహరించి, దేవతల కోరికమేరకు ఉజ్జయినిలో మహాకాలునిగా నిలచిపోయాడు.

4 . ఓంకారేశ్వడు ( మధ్యప్రదేశ్ )

kottiyoor devaswom

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో నాలుగవది అయిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరానికి సుమారుగా 65 కి.మీ దూరంలోవుంది. ఈ క్షేత్రంలో పరమశివుడు రెండు మూర్తులుగా వెలసిన ఒకే జ్యోతిర్లింగమవ్వడం విశేషం. స్వామిని ఓంకారేశ్వరుని గాను, అమరేశ్వరునిగానూ పిలుస్తారు.

ఈ ప్రదేశంలో నర్మదానది రెండు పాయలుగా చీలి మధ్య ఒక ద్వీపం ఏర్పడింది. ఈ ద్వీపాన్ని మాంధాత పర్వతమని పిలుస్తారు. రఘువంశానికి మూలపురుషుడైన మాంధాత చక్రవర్తి ఈ పర్వతంపై తపస్సుచేసిన కారణంగా ఇది మాంధాత పర్వతమైంది. ఈ పర్వతానికే శివపురి అనే పేరు కూడా ఉంది. కాగా నదినుండి ఒక పాయ ఈ పర్వతానికి ఉత్తరంవైపు ప్రవహించగా, మరోపాయ దక్షిణం వైపుకు ప్రవహిస్తుంది.

ఈ మాంధాత పర్వతం మీదనే ఓంకారేశ్వరుని ఆలయం నెలకొనివుంది. ఇక నర్మదానదికి దక్షిణ తీరంలో ఓంకారేశ్వర ఆలయానికి కొద్దిదూరంలోనే అమరేశ్వర ఆలయంవుంది. నిజానికి మొట్టమొదట అమరేశ్వర జ్యోతిర్లింగమే వెలసిందని, తరువాత మాంధాత తపస్సుచేత అమరేశ్వరుని నుండే ఓంకారేశ్వరుడు ఆవిర్భవించాడని చెబుతారు. ఇక్కడ ఓంకారేశ్వర, అమరేశ్వర దేవాలయాలు వేరువేరుగా వున్నప్పటికీ రెండింటినీ ఒకే స్వరూపంగా పరిగణిస్తారు. ఓంకారేశ్వర ఆలయం శిఖరంపై వున్నప్పటికీ అందులోని శివలింగం వింధ్య శిఖర భాగమే. వింధ్యుని కారణంగా ఇక్కడ జ్యోతిర్లింగం వెలిసిందని స్థలపురాణం చెబుతోంది. ఒకసారి నారదమహర్షి లోకసంచారం చేస్తూ పర్వతరాజైన వింధ్యుని వద్దకు వచ్చాడు. ఆ సందర్భంలో వింధ్యుడు పర్వతాలలో తన కన్నా అధికులెవ్వరూ లేరంటూ అహంభావంతో పలి కాడు. వింధ్యుని అహంకారాన్ని పోగొట్టేందుకు నారదుడు మేరుపర్వత శిఖరాలు దేవలోకాలవరకు వ్యాపించాయని, ఆ శిఖరాలపై దేవతలు సహితం నివసిస్తున్నారని, కాబట్టి వింధ్య పర్వతంకంటే మేరుపర్వతమే గొప్పదని పలికాడు.

అప్పుడు వింధ్యుడు తాను మేరుపర్వతం కంటే అధికుడవ్వాలనే కోరికతో ఓంకార క్షేత్రంలో శివునికోసం తపస్సుచేశాడు. ఆ తపస్సుకు మెచ్చి శివుడు సాక్షాత్కరించాడు. అప్పుడు శివుడు తనపై ఎప్పుడూ కొలువుతీరి వుండేవిధంగా వింధ్యుడు వరాన్ని పొందాడు. శివుడు వింధ్యుని కోరిన వరాన్ని ప్రసాదించి ఆ కొండపై అమరేశ్వరునిగా వెలిశాడు.

5 . వైద్యనాథలింగం (మహారాష్ట్ర)

kottiyoor devaswom

జ్యోతిర్లింగాలలో అయిదవది అయిన వైద్యనాథ జ్యోతిర్లింగానికి సంబం ధించి “వైద్యనాథం చితాభుమౌ” అని, “ప్రజ్వల్యాం వైద్యనాథం చ” అని రెండు పాఠాంతరాలుండటం వలన ఈ జ్యోతిర్లింగ స్థాన విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి.

వైద్యనాథలింగం జార్ఖండ్ రాష్ట్రంలోని జసిధి రైల్వే స్టేషన్ సమీపంలోని “వైద్యనాథమ్”లో వుందని ఉత్తరభారతీయులు భావిస్తారు. కానీ దక్షిణభారతీయులు మరియు మహారాష్ట్రీయుల దృష్టిలో మహా రాష్ట్రలోని ఔరంగాబాదుకు 273 కి.మీ దూరంలో గల భీడు జిల్లాలోని పరలి క్షేత్రమే జ్యోతిర్లింగ క్షేత్రం.

ఈ జ్యోతిర్లింగాల స్థానవిషయంలో వేరువేరు అభిప్రాయాలున్నప్పటికీ, స్థలపురాణగాథ మాత్రం ఒకటిగానే ఉంది.

ఒకసారి రాక్షసరాజైన రావణాసురుడు కైలాసపర్వతం మీద శివుని దర్శనం కోసం గోరతపస్సు చేశాడు. ఆ తపస్సులో ఒకదాని తర్వాత మరొకటిగా తనశిరస్సులను ఖండించి శివునికి అర్పించసాగాడు. ఆ విధంగా రావణుడు తన తొమ్మిది తలలను శివునికి సమర్పించి, పదవ తలను కూడా సమర్పించేందుకు సిద్ధపడ్డాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై రావణుని ప్రయత్నాన్ని విరమింపచేసి, రావణుని తొమ్మిది తలలు ఎప్పటిలాగా యథాస్థానంలో వుండేటట్లు అనుగ్రహించి, వరాన్ని కోరుకోమన్నాడు.

దానికి పరమేశుని శాశ్వతంగా తన లంకానగరంలో నివాసముండమని కోరాడు రావణుడు. దానికి వీలుపడదని చెప్పిన శివుడు, తనకు ప్రతీకగా తన ఆత్మలింగాన్నిచ్చి దానిని లంకానగరంలో ప్రతిష్టించమని చెప్పాడు. అంతే కాకుండా ఆత్మలింగం లంకానగరానికి చేరేలోపు భూమిమీద పెట్టకూడదని, ఒకవేళ ఎక్కడైనా నేలపై పెడితే, దానిని పెకిలించేందుకు ఎవ్వరికీ సాధ్యపడదని కూడా చెప్పాడు శివుడు. ఆత్మలింగాన్ని పొందిన రావణుడు లంకానగరానికి బయలుదేరాడు. ఆత్మలింగం లంకానగరం చేరితే తమకు కష్టాలు తప్పవని భావించిన దేవతలు ఆత్మలింగం లంకానగరానికి చేరకుండా చూడమని గణపతిని ప్రార్థించారు. దాంతో గోపబాలుని రూపంలో వినాయకుడు రావణుని వెంబడించాడు.

ఈ విషయం తెలియని రావణుడు మార్గమధ్యంలో సంధ్యావందనానికి సమయం కావడంతో, తన చేతిలోని ఆత్మలింగాన్ని గోపబాలుని చేతిలోవుంచి దాన్ని ఎట్టి పరిస్థితిలోనూ నేలపై పెట్టొద్దంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. అయితే రావణాసురుడు సంధ్యావందనం ముగించి వచ్చేలోపే ఆత్మలింగం నేలపై పెట్టాడు గోపబాలుని రూపంలోవున్న వినాయకుడు.

అప్పుడు రావణుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఇంచుకైనా ఆ శివలింగం కదల్లేదు. ఆ ప్రయత్నంలో రావణుని శరీరం గాయాలతో రక్తసిక్తమయింది. చివరకు శివుడు ఆ ఆత్మలింగం కదలదని చెప్పి రావణుని గాయా లను మాన్పించి అక్కడే జ్యోతిర్లింగంగా వెలశాడు. రావణుని గాయాలను మాన్పించిన కారణంగానే ఇక్కడి స్వామికి వైద్యనాథుడనే పేరు స్థిరపడింది.

6. శ్రీ భీమశంకర్ (మహారాష్ట్రుని)

kottiyoor devaswom

జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఆరవది అయిన భీమశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పూనానగరానికి దాదాపుగా 122 కి.మీ దూరంలో భీమానదీతీరాన కొండశిఖరంపై వెలిసింది. ఇక్కడి క్షేత్రం కూడా భీమశంకర్ గానే పిలువబడుతోంది.

ఒకానొకప్పుడు ఈ ప్రాంతం ఢాకినీ అనే రాక్షసి ఏలు బడిలోవున్నందున మన పురాణాలు ఈ ప్రాంతాన్ని ఢాకినిగా పేర్కొన్నాయి. ఈ కేత్రంలో పరమశివుడు భీమాసురుడనే రాక్షసుని సంహరించి, భీమశంకరునిగా వెలశాడు.

ఈ జ్యోతిర్లింగ ఆవిర్భావానికి సంబంధించిన కథ శివపురాణంలో కనిపిస్తుంది. త్రేతాయుగంలో భీమాసురుడనే బలవంతుడైన రాక్షసుడు తన తల్లి అయిన కర్కసితో కలసి నివస్తుండేవాడు. రావణుని సోదరుడైన కుంభకర్ణుడు ఈ భీమాసురుని తండ్రి. తన బాల్యంలోనే కుంభకర్ణుడు శ్రీరామునిచేత చంపబడ్డాడని తన యుక్తవయస్సులో తెలుసుకుంటాడు భీమాసురుడు. అప్పటి నుండి అతను విష్ణుమూర్తిపైన అతని భక్తులపైన పగను పెంచుకొని, విష్ణుమూర్తిని జయించేందుకై బ్రహ్మదేవునికోసం తపస్సుచేసి అంతులేని బలపరాక్రమాలను పొందుతాడు. ఆ వరగర్వంతో దండయాత్రలు చేస్తూ, అందులో భాగంగా కామరూపదేశంపై దండెత్తి ఆ దేశరాజైన సుదక్షుని తన చెరసాలలో బంధిస్తాడు. శివభక్తుడైన సుదక్షుణుడు కారాగారంలోనే పార్థివలింగాన్ని రూపొందించుకుని శివుని నియమ నిష్టలతో ఆరాధిస్తుంటాడు.

ఈ శివపూజలను సహించలేని భీమాసురుడు కారాగారంలోని పార్థివలింగపై కత్తినిదూస్తాడు. ఆ కత్తి శివలింగాన్ని స్పర్శించినంతనే శివలింగం నుండి పరమశివుడు ఉద్భవించి తన మూడవకన్నును తెరచి భీమాసురుని భస్మంచేస్తాడు. చివరకు దేవతలు, మునుల కోరిక మేరకు పరమ శివుడు ఇక్కడే జ్యోతి ర్లింగంగా వెలశాడు.

7. రామేశ్వర జ్యోతిర్లింగం (తమిళనాడు)

kottiyoor devaswom

రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో వుంది. మనదేశ భూభాగం నుండి విడదీయబడి, బంగాళాఖాతం - హిందూమహా సముద్రం సంగమస్థానంలో వున్న ద్వీపమే రామేశ్వరం.

సముద్రతీరంలో, సముద్రంలోనే వున్నట్లుగా కనిపించే ఈ క్షేత్రం శ్రీలంకకు ఎంతో దగ్గరగా వుంది. సముద్రమట్టానికి కేవలం పది అడుగుల ఎత్తులో మాత్రమే ఈ క్షేత్రం ఉండటం విశేషం. శ్రీరామచంద్రునిచే ప్రతిష్ఠితుడైన ఈ స్వామిని రామేశ్వరుడని, రామనాథుడని, రామలింగేశ్వరుడని పలు పేర్లతో పిలుస్తారు. మన పురాణాలలో ఈ ప్రాంతం గంధమాదనంగా పిలువబడింది.

శివపురాణంలోని కోటి రుద్ర సంహితలో ఈ క్షేత్రానికి సంబంధించిన స్థలపురాణగాథ చెప్పబడింది. శ్రీరామచంద్రుడు రావణుని సంహరించిన తర్వాత సీతాదేవితో కలసి ఈ గంధమాదన పర్వతానికి వచ్చాడు. రావణుని చంపడంచేత తనకు కలిగిన బ్రహ్మహత్యా పాపనివృత్తికై అగస్త్యుని సూచన మేరకు యిక్కడే శివలింగాన్ని ప్రతిష్ఠించదలచాడు శ్రీరాముడు. ప్రతిష్ఠకై శివలింగాన్ని తెచ్చేందుకై హను మంతుని కైలాసానికి పంపాడు. కానీ, హనుమంతుడు శివలింగాన్ని తెచ్చేంతలోపే ముహూర్తం సమీపిస్తుండటంతో సీతాదేవితో అక్కడి యిసుకను ప్రోగుచేయించి, సైకత లింగాన్ని రూపొందింపచేసి, ఆ లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠ పూర్తయ్యే సమయానికి శివలింగాన్ని తెచ్చిన హనుమంతుడు అప్పటికే ప్రతిష్ఠ జరిగిన విషయాన్ని తెలుసుకొని ఎంతో దుఃఖించాడు. శ్రీరాముడు ఎంత ఓదార్చినప్పటికీ హనుమంతుడు కుదుట పడలేదు. అప్పుడు శ్రీరాముడు హనుమంతునికి ఆనందాన్ని కలిగించేందుకై ప్రతిష్ఠించబడిన సైకతలింగాన్ని పెకిలించి, ఆ స్థానంలో హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని పునఃప్రతిష్ఠించమన్నాడు.

అయితే ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ శివలింగం యించుకైనా కదల్లేదు. శివలింగాన్ని పెకిలించే ప్రయత్నంలో హనుమంతుడు మూర్చపోయాడు. అప్పుడు శ్రీరాముడు హనుమంతుని మూర్ఛను పోగొట్టి, ఆ దగ్గరలోనే హనుమంతుడు తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠింపజేశాడు. శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం రామేశ్వరునిగాను, హనుమంతుడు తెచ్చిన శివలింగం హనుమదీశ్వరుని గాను పేరొందాయి. హనుమదీశ్వర లింగాన్ని విశ్వేశ్వర లింగం, విశ్వలింగం అనికూడా పిలుస్తారు.

8. నాగనాథ్ (గుజరాత్)

kottiyoor devaswom

గుజరాత్ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ద్వారకకు సుమారు 22 కి.మీ.ల దూరంలో, అరేబియా సముద్ర తీరానికి దగ్గరలో నాగనాథ్ క్షేత్రం వుంది. గోమతీనది ఈ క్షేత్రం వద్దనే అరేబియా సముద్రంలో కలుస్తుంది. పరమేశుడు ఈ క్షేత్రంలో నాగేశ్వర జ్యోతిర్లింగంగా కొలువుదీరాడు.

శివపురాణంలో కోటి రుద్ర సంహిత 29వ అధ్యాయం లో ఈ క్షేత్రానికి సంబంధించిన స్థలపురాణం చెప్పబడింది. ఈ కథ ప్రకారంగా, పూర్వం ఈ ప్రాంతంలో దారుక-దారుకుడు అనే రాక్షస దంపతులుండేవారు. ఈ రాక్షసులు తమ బలంతో అందరినీ హింసిస్తూ, ఋషులు చేసే యజ్ఞ, యాగాదులను ధ్వంసం చేసేవారు. అప్పుడు ఋషులు వెళ్ళి ఈ రాక్షసుల దురాగతాలను ఔర్వమహర్షికి వివరించారు. వారి అకృత్యాలను నివారించడానికై “భూమిపై నివసించే నిరపరాధులైన జనాన్ని హింసిస్తే” మరుక్షణమే ఆ రాక్షసులు మరణించే విధంగా శపించాడు ఔర్వ మహర్షి.

ఔర్వ మహర్షి శాపాన్ని తెలుసుకున్న దారుకుడు, తాను నివాసముంటున్న వనాన్ని పైకెత్తి, సముద్రం మధ్యలో స్థాపించాడు. ఔర్వ మహర్షి తన శాపంలో “భూమిపై నివసించే జనాన్ని” అని అన్నందు వలన, ఆ రాక్షసులు భూమిపై ఉండే జనాల జోలికి పోకుండా, సముద్రంపై ప్రయాణించే వారిని హింసించి, సంహరించ సాగారు.

ఇది యిలా వుండగా, కొంతమంది వర్తకులు వాణిజ్యం కోసం, యితర దేశాలకు వెళ్ళేందుకై నావలలో సముద్ర యానం చేయసాగారు. అప్పుడు దారుకుడు ఆ వ్యాపారు లందరినీ బంధించి, తన చెరసాలలో వేశాడు. ఈ వర్తకులలో సుప్రియుడనే వర్తక ప్రముఖుడున్నాడు. శివభక్తుడైన సుప్రియుడు చెరసాలలోనే శివారాధ నను కొనసాగించాడు. అంతేకాకుండా అందరిచేత కూడా శివపూజలను చేయించాడు. ఇది నచ్చని దారుకుడు సుప్రియుని చిత్రవధ చేసి చంపమని తన సేనకు ఆజ్ఞాపించాడు. అప్పుడు అక్కడ పరమేశుడు ప్రత్యక్షమై తన పాశుపతాస్త్రంతో దారుకుని, అతని సేననంతటినీ హతమార్చి, ఆ వనమంతా శివభక్తులకు నివాసంగా చేసి, తాను అక్కడ నాగేశ్వర జ్యోతిర్లింగంగా వెలసాడు.

మరో కథ ప్రకారం ఈ దారుకావనంలో పరమశివుడు దిగంబరంగా భిక్షాటనకై సంచారం చేస్తూ, మునిపత్నుల చేత ఆకర్షింపబడ్డాడు. అది గమనించిన మునులు శివుణ్ణి మట్టు పెట్టాలని సర్పశక్తిని ప్రయోగించారు. అప్పుడు శివుడు ఆ సర్పశక్తిని నాగాభరణంగా ధరించి, నాగేశ్వరుడై యిక్కడ వెలశాడని చెప్పబడుతోంది.

9. వారణాసి (ఉత్తరప్రదేశ్)

kottiyoor devaswom

భారతీయులందరూ పరమ పవిత్రంగా భావించే వారణాసి క్షేత్రం, ఉత్తరప్రదేశ్ లోని గంగాతీరంలో వుంది. ఈ పావన క్షేత్రానికి యిరువైపులా ‘వరుణ’ - ‘అసి’ అనే రెండు నదులు ప్రవహిస్తుండడం వలన ఈ క్షేత్రం వారణాసిగా పేరొందింది.

పరమేశుని దివ్య జ్యోతిర్లింగం యిక్కడ ప్రకాశమానం అవుతోంది కనుక, ఈ క్షేత్రం కాశీగా ప్రసిద్ధమైంది. “కాశి” అంటే కాంతి, వెలుగు, తేజస్సు, ప్రకాశము అనే అర్థాలున్నాయి. ఇక్కడ పరమశివుడు విశ్వనాథునిగా కొలువుదీరాడు. వారణాసి మహా శక్తిపీఠం కూడా. పద్దెనిమిది మహా శక్తులలో ఒకటిగా చెప్పబడే విశాలాక్షీదేవి ఈ క్షేత్రంలోనే వెలసింది.

మోక్షాన్ని ప్రసాదించే ఏడు పురాలలో ఒకటైన కాశీక్షేత్రానికి “ముక్తిభూమి” అనే పేరుంది. ఈ క్షేత్రంలో మరణిస్తే ముక్తి తప్పకుండా లభిస్తుందని చెప్పబడింది. ఇక్కడ మరణించిన వారికి విశ్వనాథుడు కుడి చెవిలో తారకమంత్రాన్ని ఉపదేశిస్తాడట. ప్రళయ కాలంలో కూడా ఈ క్షేత్రానికి ఎలాంటి విపత్తు రాదంటారు. ఆ సమయంలో పరమేశుడు ఈ క్షేత్రాన్ని తన త్రిశూలంమీద ధరిస్తాడట. స్థలపురాణం ప్రకారం పరమశివుడు విశ్వసృష్టి కోసం మొదటగా ప్రకృతి, పురుషులను సృష్టించాడు. ఈ పురుషుడు శ్రీమహావిష్ణువు స్వరూపమే. సృష్టికోసం తపస్సాచరించదలచిన ప్రకృతి, పురుషులు తమ తపస్సుకు అనువైన స్థానాన్ని చూపమని శివుణ్నికోరారు. అప్పుడు మరమేశుడు ఐదు క్రోసుల వైశాల్యంగల కాశీని నిర్మించాడు. ప్రకృతి, పురుషులలో పురుషుడైన నారాయణుడు యిక్కడ చాలాకాలం తపస్సు చేశాడు.

ఈ విధంగా తపస్సు చేస్తున్న శ్రీహరిదేహం నుండి స్వేదబిందువులు జలధారలుగా ప్రవహించాయి. ఈ విచిత్రాన్ని చూసిన నారాయణుడు ఆశ్చర్యంతో తన శిరస్సును కంపించాడు. అప్పుడు అతని కుడిచెవి ఆభరణం జారిపడింది. అది పడిన ప్రదేశమే మణికర్ణికా తీర్థం. కాగా శ్రీమహావిష్ణువు స్వేదజలంలో మునిగిన ఆ భూఖండాన్ని తన శూలంతో గుచ్చి, ఎత్తి పట్టుకున్నాడు శివుడు. తరువాత శ్రీమహావిష్ణువు ఈ భూఖండంలోనే యోగనిద్రలో నిమగ్న మయ్యాడు. అప్పుడు ఆయన నాభి నుండి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించాడు.

ఈ బ్రహ్మ దేవుడే బ్రహ్మాండాన్ని సృష్టించాడు. ఈ బ్రహ్మాండంలో జీవులు బంధ విమోచనాన్ని పొందేందుకు వీలుగా అంతరిక్షంలో తాను త్రిశూలంతో గుచ్చి పెట్టిన భూఖండాన్ని పరమశివుడు శూలంనుండి తీసి, బ్రహ్మాండంలో కలిపాడు. ఈ విధంగా కలుప బడిన ప్రదేశమే కాశి.

ఈ సందర్భంలో విష్ణువు, పరమేశుని ఎన్నో విధాలుగా స్తుతించగా, పరమేశుడు విశ్వనాథ జ్యోతిర్లింగంగా వెలిశాడు.

10.  శ్రీ త్ర్యంబకేశ్వర్ (మహారాష్ట్ర)

kottiyoor devaswom

త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని నాసిక్ లో సహ్యపర్వత శిఖరం మీద నెలకొని ఉంది. గోదావరి నది ఈ సహ్యపర్వతం మీదనే పుట్టింది. ఉత్తర భారతదేశంలో గంగానదివలె, దక్షిణ భారతదేశంలో గోదావరి నది పాపాలను పోగొట్టేదిగా ప్రసిద్ధి చెందింది.

ప్రతీ శివాలయంలోనూ శివుడు పానవట్టంపై లింగ రూపంలో దర్శమిస్తాడు. కానీ త్ర్యంబక క్షేత్రంలో ఇందుకు భిన్నంగా పానవట్టం మధ్యలో ఒక గుంతలాగా ఉంటుంది. ఆ గుంతకు మూడు వైపులా త్రికోణా కారంలో మూడు కన్నులుంటాయి. వీటిని పరమశివుని మూడు నేత్రాలుగా భావిస్తారు. పానవట్టం మధ్యలోని గుంతలో ఎప్పుడూ నీరు ఊరుతూ వుంటుంది.

బ్రహ్మపురాణంలోనూ, శివమహాపురాణంలోనూ త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావానికి సంబం ధించిన కథ చెప్పబడింది.

ఒకప్పుడు అనావృష్టి కారణంగా తీవ్రమైన కరువు ఏర్పడింది. పంటలు లేక జనులంతా ఆకలితో అల మటించసాగారు. కరువు కారణంగా పశుపక్ష్యాదులూ విలవిలలాడాయి. ఈ దైన్యస్థితిని చూసిన గౌతముడు కరువు నివారణకై వరుణదేవుని గురించి తపస్సు చేశాడు. గౌతముని తపస్సుకు సంతసించిన వరుణుడు ఆ ప్రాంతానికి అక్షయ తటాకాన్ని ప్రసాదించాడు. అక్షయ తటాకం అంటే అందులోని నీరు ఎంత వినియోగించినా అది తరగకుండా అక్షయంగా ఉంటుంది. ఈ తటాకంలోని నీటివల్ల ఆ ప్రాంతమంతా సస్యశ్యామలమైంది. కరువు నివారించబడి జనులంతా సుఖంగా వుండసాగారు.

అయితే గౌతమునివల్ల కరువు తొలగిపోవటాన్ని చూసిన తక్కిన ముని పత్నులు భరించలేకపోయారు. వారందరికీ గౌతముని పైనా, ఆయన భార్య అహల్యపైనా ఎంతో అసూయ కలిగింది. దాంతో వారంతా గౌతమ మహర్షికి అపకారం తలపెట్టమని తమ భర్తలను ప్రేరేపించారు. చివరకు మునులంతా కలిసి, గౌతమునిపై కుట్ర చేసి, ఒక మాయాగోవును గౌతముని పొలంలోకి తోలారు. ఆ గోవు పంటను మేయసాగింది. దాంతో గౌతముడు దాన్ని గడ్డి పరకతో అదిలించాడు. వెంటనే ఆ ఆవు నేలకొరిగి మరణించింది.

సమయంకోసం వేచివున్న అక్కడి మునులందరూ వచ్చి గౌతముడు గోహత్య, చేశాడని, కాబట్టి ఆ ప్రాంతాన్ని వదలి వెళ్ళమంటూ గౌతముని శాసించారు. అప్పుడు గౌతముడు గోహత్య పాప పరిహారం కోసం ప్రాయశ్చిత్తాన్ని చెప్పమని ఆ మునులను అడిగాడు. దానికి వారు ఆ ప్రాంతానికి

గంగను రప్పించి, ఆ జలంతో కోటి శివలింగాలను అభిషేకించాలని చెప్పారు. దాంతో గంగకోసం గౌతముడు బ్రహ్మగిరిపై పార్థివ లింగాన్ని నెలకొల్పి భక్తితో ఆరాధించసాగాడు. అప్పుడు పరమేశుడు ప్రత్యక్షమై గంగను ప్రసాదిం చాడు.

వెంటనే ఆ ప్రాంతంలో గంగాప్రవాహం ఏర్పడింది. ఆ నదీ ప్రవాహం గౌతముని పొలాన్ని చేరినంతనే పొలంలో మరణించిన ఆవు తిరిగి బ్రతికింది. గౌతమునిచేత తీసుకొని రాబడిన కారణంగా ఆ నది గౌతమియని, గోహత్య పాతకం నుండి గౌతమునికి విముక్తి కలిగించడంచేత గోదావరి యని ప్రసిద్ధిచెందింది.

ఈ సందర్భంలోనే యిక్కడ పరమేశుడు త్ర్యంబకేశ్వరునిగా కొలువుదీరాడు.

11.  కేదారనాథ్ (ఉత్తరాంచల్)

kottiyoor devaswom

ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదకొండవది అయిన కేదారనాథ జ్యోతిర్లింగం హిమాలయ పర్వత ప్రాంతంలోని కేదారనాథ్ క్షేత్రంలో నెలకొని ఉంది. హిమాలయాలలోని కేదార శిఖరమే కేదారనాథ లింగం. జ్యోతిర్లింగాలలోని అతి పెద్ద శివలింగంయిదే. ఈ క్షేత్రం సముద్ర మట్టానికి 11,760 అడుగుల ఎత్తులో వుంది. ఈ క్షేత్రంలో పర్వత శిఖరమే లింగం కనుక యిక్కడి స్వామికి పానవట్టం లేదు.

ఈ ప్రాంతం మంచు ప్రదేశం అయినందువల్ల ఆలయం సంవత్సరంలో ఆరు మాసాలపాటు మూయబడి ఉంటుంది. వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు (సాధారణంగా మే నుండి అక్టోబరు వరకు) మాత్రమే భక్తులు ఆలయాన్ని దర్శించ వచ్చు. ప్రధాన ఆలయం మూసివున్న సమయంలో కొంత క్రింది భాగంలో వున్న ఉర్విమఠంలోని స్వామిని భక్తులు దర్శించుకుంటారు.

స్కాందపురాణంలోని కేదారఖండంలో కేదారేశ్వర జ్యోతిర్లింగ మాహాత్మ్యం చెప్పబడింది. కాగా ఏ భక్తుడైనా కేదారనాథుని దర్శించకుండా, బదరీయాత్ర చేసినట్లైతే ఆ యాత్ర నిష్పలమని స్కాందపురాణం చెబుతోంది.

కృతయుగంలో శ్రీమహావిష్ణువు అవతార స్వరూపులైన నరనారాయణులు బదరికావనంలో జగత్కల్యాణం కోసం ఎన్నో వేల సంవత్సరాలు పరమశివుని గురించి తపమాచరించారు. ఆ తపస్సుకు సంతుష్టుడైన పరమశివుడు వారికి సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమన్నాడు. అప్పుడు వారిరువురూ కేదారశిఖరంపై కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తుండమని పరమశివుని కోరారు. పరమేశుడు వారి కోరికను మన్నించి అక్కడ జ్యోతిర్లింగంగా వెలశాడు. కేదారనాథ శిఖరంపై వెలసిన కారణంగా ఈ స్వామి కేదారేశ్వరునిగా ప్రసిద్ధుడయ్యాడు.

12. ఘృష్ణేశ్వర్ (మహారాష్ట్ర)

kottiyoor devaswom

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మహారాష్ట్రలోని ఘృష్ణేశ్వరం చివరిది. ఇక్కడ వెలసిన స్వామికి ఘృష్ణేశ్వరుడని పేరు. ఈ ఘృష్ణేశ్వరస్వామి సంతాన కారకునిగా ప్రసిద్ధుడు. సంతానం లేని వారు ఈ స్వామిని సంతానం కొరకు సేవిస్తుంటారు. మహారాష్ట్రలోని ఔరంగబాదు నగరానికి ఈ ఘృష్ణేశ్వర క్షేత్రం 28 కి.మీ దూరంలోవుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్లోరాగుహలు యిక్కడికి కేవలం 3 కి.మీ దూరంలో వున్నాయి. వాస్తవానికి ఈ క్షేత్రం యొక్క అసలు పేరు ఘృశ్మేశం. పూర్వం యిక్కడ ఘృశ్మ అనే భక్తురాలికి దర్శనమిచ్చి, ఆమె కోరిక మేరకు యిక్కడ కొలువైన శివుడు ఘృశ్మేశ్వరునిగా పిలవబడి, ఈ క్షేత్రం ఘృశ్మేశ్వరంగా పేరొందింది. కాలక్రమములో ఈ ఘృశ్మేశ్వరమే ఘృష్ణేశ్వరంగా మారింది.

శివపురాణంలోని కోటిరుద్ర సంహిత 133వ అధ్యాయంలో ఈ క్షేత్రం యొక్క స్థలపురాణగాథ వివరించబడింది. ఈ కథ ప్రకారం - పూర్వం ఇక్కడి దేవగిరి పట్టణంలో సుధర్ముడు, సుదేహ అనే బ్రాహ్మణ దంపతులుం డేవారు. ఎన్ని నోములు నోచినా, ఎన్నో తీర్థయాత్రలు చేసినా వారికి సంతానం కలుగలేదు. ఇదిలా వుండగా ఒక రోజున ఒక యతి వారింటికి భిక్షార్ధం వచ్చాడు. ఆ దంపతులు ఆ యతికి ఆతిథ్యాన్ని సమకూర్చారు. కానీ ఆ యతి వారికి సంతానం లేదన్న విషయాన్ని తెలుసుకొని, వారి భిక్షను నిరాకరించాడు. అప్పుడు సుదేహ, సుధర్మలు తమకు సంతానం కలిగే మార్గం చెప్పమంటూ ఆ యతి పాదాలపై పడి వేడుకున్నారు. దానికి ఆ యతి కాలాంతరంలో సుధర్మునికి కుమారుడు జన్మిస్తాడని ఆశీర్వదించాడు. అయితే సుదేహకు తన బాల్యంలో జ్యోతిషులు తనకు సంతాన యోగంలేదని చెప్పినవిషయం గుర్తుకొస్తుంది. దాంతో తనవల్ల తన భర్తకు సంతానం కలుగదని భావించిన సుదేహ, తన చెల్లెలైన ఘృశ్మలను సుధర్మునికిచ్చి వివాహం జరిపించింది. కొంతకాలానికి ఘృశ్మలకు కుమారుడు జన్మించాడు. ఘృశ్మల గొప్ప శివభక్తురాలు. ఆమె ప్రతిరోజు 1001 పార్థివ శివలింగాలను అర్చించి, వాడిని చెరువులో నిమజ్జనం చేసేది. ఆ భక్తురాలు కేవలం శివాను గ్రహము వల్లనే తమకు కొడుకు పుట్టాడని విశ్వసించేది. ఘృశ్మలకొడుకు విద్యాబుద్ధులు నేర్చుకుంటూ పెరిగి పెద్దవాడయ్యాడు. యుక్తవయస్సు రావడంతో అతనికి వివాహం జరిపించారు. కొడుకు, కోడలుతో సుధర్మ, ఘృశ్మలలు ఆనందంగా గడపసాగారు. దీన్ని చూసిన సుధర్ముని పెద్దభార్య సుదేహకు అసూయా ద్వేషాలు కలిగాయి. ఒక రోజు సుదేహ వేకువ జామున అందరూ నిద్రిస్తున్న సమయంలో ఘృశ్మల కొడుకు తలను నరికి, యింటికి దూరంలో వున్న చెరువులో వేసింది.

జరిగిన దురాగతాన్ని తెలుసుకున్న ఘృశ్మల కోడలు ఎంతగానో రోదించింది. అప్పటికే శివలింగార్చనలో నిమగ్నమైవున్న ఘృశ్మల, ఆనాటితో తన కోటి శివ లింగార్చన పూర్తవుతుందని తనకు ఎప్పటికీ పుత్రశోకం వుండదని కోడలిని ఓదార్చి తాను అర్చించిన పార్థివ లింగాలలు నిమజ్జనం చేసేందుకు చెరువు వద్దకు వెళ్ళింది. అప్పుడు పరమశివుడు ఘృశ్మలకు సాక్షాత్కరించి ఆమె కొడుకును బ్రతికించాడు. తరువాత ఘృశ్మల కోరికమేరకు పరమశివుడు అక్కడ జ్యోతిర్లింగంగా వెలశాడు.